Home / Inspiring Stories / హిందూ తండ్రీ, ముస్లిం కొడుకూ – వాళ్ళు ప్రేమతో మతాలని జయించారు.

హిందూ తండ్రీ, ముస్లిం కొడుకూ – వాళ్ళు ప్రేమతో మతాలని జయించారు.

Author:

Aiku Lal and Akbar

తాను హిందువే అయినా త‌న‌ను ఒక‌ప్పుడు ఓ ముస్లిం కుటుంబం చేర‌దీసి పెంచి పోషించింది. అయితే అదేం విచిత్ర‌మో గానీ ఇప్పుడు ఆ వ్య‌క్తి కూడా ఓ ముస్లిం బాలున్ని చేర‌దీసి అత‌న్ని పెంచి పోషిస్తున్నాడు.అదీ తన మత నియమాల ప్రకారమే… ఎక్కడా ఆ కుర్రవాడి అభిప్రాయలనీ,సొంత మత విశ్వాసాలనీ అతను తప్పు పట్టలేదు. ఎందుకంటే తాను ఒక‌ప్పుడు ముస్లిం కుటుంబానికి రోడ్డులో దొరికిన‌ట్టే, అత‌నికి ఇంకో ముస్లిం బాలుడు తనకు దొరికాడు. తాను పెరిగినట్టే ఇప్పుడు ఈ బాలుడూ ఉండాలనుకున్నాడు. తనను తానుగా పెంచిన ఆ ముస్లిం తల్లి తండ్రుల ఋణం ఇలా తీర్చుకుంటున్నా అనుకుంటున్నాడు ఈ ఐకూ లాల్ సందిల్..

ఐకూ లాల్ లక్నో లో ఒక టీ స్టాల్ నడుపుతూంటాడు. 2002 ఫిబ్రవ‌రిలో లక్నో లో ఉన్న పార్క్ వ‌ద్ద ఓ బాలున్ని గుర్తించాడు. ఆ బాలుని వ‌ద్ద అత‌ని సంబంధీకులు ఎవ‌రూ లేరు. అయితే అత‌న్ని విచారించ‌గా తన పేరు అక్బ‌ర్ అని ఐకుకు చెప్పాడు. కాగా ఆ బాలుడికి త‌న పేరు త‌ప్ప వేరే ఎవ‌రూ గుర్తు లేక‌పోవ‌డంతో ఐకు స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా అక్బ‌ర్ గురించిన వివ‌రాలేవీ తెలియ‌రాలేదు. అయితే అక్బ‌ర్‌ను ఏదైనా అనాథాశ్ర‌మంలో చేరిస్తే బాగుంటుందని పోలీసులు ఐకుకు సూచించారు. కానీ ఐకు అందుకు ఒప్పుకోలేదు. తానే స్వ‌యంగా అక్బ‌ర్ బాధ్య‌త‌ల‌ను చూస్తాన‌ని అత‌న్ని త‌న‌తోపాటు తీసుకుపోయాడు. అప్ప‌టి నుంచి అక్బ‌ర్‌కు ఐకు త‌ల్లి, తండ్రి తానే అయి పెంచాడు. ఐకు హిందువు, అక్బ‌ర్ ముస్లిం. అయినా అత‌ని మ‌తాన్ని గౌర‌వించి ఐకు అక్బ‌ర్‌ను ముస్లిం సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా పెంచాడు. అత‌న్ని రోజూ న‌మాజ్‌కు తీసుకెళ్లేవాడు. ఖురాన్ చ‌ద‌వడం నేర్పించేవాడు. ఈ క్ర‌మంలో అక్బ‌ర్‌, ఐకుల మ‌ధ్య ఏదో తెలియ‌ని అవినాభావ సంబంధం ఏర్ప‌డింది. కాగా అక్బ‌ర్ ఐకును త‌న సొంత తండ్రిలాగే భావించేవాడు. భావించ‌డం కాదు, తండ్రే అనుకుని అత‌నితో బాంధ‌వ్యాన్ని పెంచుకున్నాడు.

Aiku and Akbar

అయితే 2007వ సంవ‌త్స‌రంలో ఈ రెండు మతాల అపూర్వ బంధం గురించి తెలుసుకొని టీవీ జర్న‌లిస్ట్ ఐకు, అక్బ‌ర్‌లని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ ఇంట‌ర్వ్యూ టీవీలో ప్ర‌సారం కావ‌డంతో దాన్ని చూసిన అక్బ‌ర్ సొంత త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ త‌మ‌కు కావాల‌ని ఐకు వ‌ద్ద‌కు వ‌చ్చారు. అయితే అక్బ‌ర్ వారి వ‌ద్ద‌కు వెళ్ల‌న‌ని, ఐకుయే త‌న తండ్రి అని మొరాయించాడు. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు కూడా ఐకుకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. చిన్న‌ప్పటి నుంచి చేర‌దీసి పెంచిన ఐకుకే అక్బ‌ర్‌పై అన్ని హక్కులు ఉంటాయ‌ని తెలియ‌జేసింది.తాను మేజర్ అయ్యేంత వరకూ అక్బర్ ఐకూ దగ్గరే ఉండవచ్చనీ, కావలంటే అతని సొంత నిర్ణయాన్ని బట్టి ఉండవచ్చనీ తెలిపింది. అక్బర్ ఐకూ తోనే ఉంటానన్నాడు. ఇక చేసేదేం లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు…

Aiku and Akbar

కాగా కోర్టులో విచార‌ణ‌లో భాగంగా ఐకు న్యాయ‌మూర్తికి చెప్పిన ప‌లు విష‌యాలు మాత్రం నిజంగా అంద‌రినీ ఆలోచింప‌జేశాయి. అవేమిటంటే, అక్బ‌ర్ ఎలాగైతే చిన్న పిల్లాడిలా ఉన్న‌ప్పుడు ఐకుకు దొరికాడో, ఐకు కూడా అలాగే ఓ ముస్లిం కుటుంబానికి దొరికాడ‌ట‌. వారు కూడా ఐకును అత‌ని సాంప్ర‌దాయాల‌ను గౌర‌వించి, అత‌ని మ‌త విశ్వాసాల‌కు అనుగుణంగా పెంచార‌ట‌. విచిత్రంగా అక్బర్ కూడా ఐకుకు అలాగే దొర‌క‌డం, ఐకు తాను పెరిగిన‌ట్టే అక్బ‌ర్‌ను పెంచ‌డం త‌దిత‌ర విష‌యాల‌న్నంటినీ ఐకు వివ‌రించాడు. తనని పెంచిన ఆ ముస్లిం తల్లితండ్రుల ఋణం ఇలా తీర్చుకుంటానను కుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు…. ఔను..! మతాల మీదే నరుక్కునే మనుషులలో ఐకూ,అక్బర్ ల జీవితం చూసాకైనా మార్పు వస్తుందేమో చూడాలి….

(Visited 519 times, 15 visits today)