Home / Political / భారత్ మాతాకి జై అనే నినాదాన్ని చేయను అన్న అసదుద్దీన్ కు పెరుగుతున్న మద్దతు

భారత్ మాతాకి జై అనే నినాదాన్ని చేయను అన్న అసదుద్దీన్ కు పెరుగుతున్న మద్దతు

Author:
Asaduddin Owaisi  says no to bharat mataki jai

Asaduddin Owaisi says no to bharat mataki jai

భారత్ మాతాకి జై అనే నినాదాన్ని చేయను అన్న అసదుద్దీన్ వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇలాంటి వారికి దేశ పౌరసత్వం తక్షణ రద్దు చేయాలని.. ఓటుహక్కు కూడా తొలగించాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఒవైసీని.. రాష్ట్రం దాటి ఎలా వెళ్లనిచ్చారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై నిప్పులు చెరిగింది. జాతీయ పతాకాన్ని అగౌరవపర్చాడని పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్‌పటేల్‌పై దేశద్రోహం కేసు పెట్టగా.. అతడు ఇంకా జైలులోనే ఉన్నాడని, మరి దేశమాతను అవమానించిన ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. ఎవరైతే భారత్ మాతా కీ జై అని నినదించరో వారందరి పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
మాతృభూమిని గౌరవించని ఎంఐఎంను రాజకీయ పార్టీగా భావించడం లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. దాన్ని ఒక మత ఛాందసవాద సంస్థ అని ఆరోపించారు. భరతమాతకు జై అనలేకే ఖాసీంరజ్వీ పాకిస్థాన్‌కు పారిపోయాడని, రజాకార్ల వారసులే ప్రస్తుతం భారతమాతకు జై అననని ప్రకటిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయతో కలిసి గురువారం ఆయన సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బంగారు లక్ష్మణ్ ట్రస్ట్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని, మాతృభాషను నిర్లక్ష్యం చేసినవాడెవడూ మనిషే కాదని, ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమన్నారు. మతం వ్యక్తిగతమని, అదొక జీవన విధానమని పేర్కొన్నారు.

venkaiah naidu fires on owaisi
ఈ తరం యువతకు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం నేర్పాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందిస్తూ… ‘‘మీరు నా పీక మీద కత్తి పెట్టినా సరే.. ‘ఆ’ నినాదం చేయను. నన్నేం చేస్తారు భగవత్ సాహెబ్‌?’’అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర లాతూరు జిల్లా ఉద్‌గిర్‌ తహసీల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయగానే ప్రజల నుంచి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. దీంతో ఒవైసీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘‘భారత మాతా కీ జై’ అని తప్పనిసరిగా అనాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని గుర్తు చేసారు.తమకు దేశం అంటే చుట్టూ ఉన్న మనుషులే తప్ప బొమ్మలూ,మ్యాపులూ కాదనీ, దేశాన్ని కాపాడటం, దేశభక్తి కలిగి ఉండటం కంటే సాటి పౌరులని ప్రేమతో చూస్తూ, వారికి రక్షణ కల్పించటమే అనీ ఆయన అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలకు సమాధానం గా వెంకయ్య పై విధంగా స్పందించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం శివసేన వ్యాఖ్యలను ఖండించారు. ఈ విషయంలో శివసేన రాజకీయ కపటత్వం ప్రదర్శిస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అల్ నసీర్ జకారియా విమర్శించారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ ఆరెస్సెస్, బీజేపీ విధానాలను అనుసరించాల్సిన పనిలేదు. ఆరెస్సెస్ నేతలు భరతమాతను ఒక దేవతగా ఆరాధిస్తారు. అందరూ ఆ పద్ధతినే పాటించాలని కోరడం సహేతుకం కాదు. ఇలా రాజ్యాంగంలోనూ లేదు. ఆరెస్సెస్ విధానాలను పాటించనంత మాత్రాన దేశద్రోహులుగా చిత్రించడమూ సరికాదు. ఎవరికినచ్చిన విధంగా వారు దేశాన్ని ప్రేమిస్తారు., కొలుస్తారు.. గౌరవిస్తారు. అంతేకానీ, తమ మార్గాన్నే అనుసరించాలని చెప్పడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమే అని పేర్కొన్నారు.

(Visited 1,187 times, 20 visits today)