Home / సాహిత్యం / భావుకత్వమూ-కవిత్వమూ-ఫెమి”నిజమూ”-ఒక సరితా

భావుకత్వమూ-కవిత్వమూ-ఫెమి”నిజమూ”-ఒక సరితా

Author:

saritha

భావుకత్వమంటే ఏమిటి..? వెన్నెల ని కప్పుకున్న పువ్వొకటి అర్థ రాత్రి మంచులో తడుస్తో తోటలో కి పరిమళ రాగాలని పాడుకుంటుంది చూడూ అదేనా..!? లేక రెక్క విరిగిన సీతాకోక శారీరక వేదనావాహనానుభవమా..? ఒకానొక రహస్య భాషా సంభాషణ లో విశ్వం ఆలపించే ఒక అనామక రాగమా? ఏదీ భావుకత్వం!?
అమ్మ అబద్ధం కూడా ఎంత తీయగా ఉంటుందో
గోరుముద్దల లాలిత్యానికి మురుస్తున్నపుడు
నాపై జెలసీతో ఆ అబద్ధం నిజం చేద్దామన్నట్టుగా
అమ్మ కళ్ళలో మెరిసిన నీ వెన్నెలను చూడటం ఆనాడు ఒక అద్భుతమే నాకు” చందమామతో చెప్పుకునే మాటల వెనుక ఏదో కోల్పోయిన భావనని మళ్ళీ తనలో వెతుక్కునే ప్రయత్నం చేయటాన్ని భావుకత్వం అనక ఇంకేం అనగలం. భాదనీ మరో కన్నీటిలో రక్తం గా కదిలించ గల ఒక చేతనా శక్తిని ఊహ చేయటమూ దాన్ని మరొకరికి అందేలా చెప్పగలగటమూ కవిత్వమే అయితే ఇదిగో ఇక్కడ కాస్త కవిత్వం కుప్పబడేవుంది. ఇప్పుడు రాసున్న యువకవులలో సరితా భూపతి రాస్తోన్న కవిత్వం కాస్త కొత్తగానూ ఆవేశం గానూ కనిపిస్తుంది.ఐతే ఆ ఆవేశానికి కారణాలేంటో మనం ఊహించల్కేంత గొప్ప్వేం కావు. సరిత ప్రశ్నించేది మనల్నే కొన్ని సార్లు తనచుట్టూ ఉన్న వాళ్ళనీ వాళ్ళలో కలిసిపోయిన తనని తానే ప్రశ్నించుకున్నట్టు అనిపిస్తుంది. ఈ కవిత్వం చదువుతుంటే…
ఇదేమిటీ వెన్నెల స్పర్షా, కోకిల గానమా కాదేమో అంతమాత్రమే కాదేమో ఒకానొక బానిసతత్వపుతనాన్ని వ్యతిరేకించే తిరుగుబాటు దోరణి,కొద్దిగా నరాలని మెలిపెట్టే వేదనా కలగలిసి సరిగ్గా కాళ్ళకి చెప్పుల్లేకుండా పచ్చని పొలగట్టు మీద నడిచీ నడిచీ పల్లేరు కాయలు గుచ్చుకున్న నొప్పి కలిగించే హాయైన భాద వంటి ఒక వింతభావం. కొన్ని కవితల్లో కనిపిస్తుంది.
నూతిలో కప్పలా
ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటుంటాం
పై నుంచి పడే రాయిని గుర్తించం…
చేతగానితనాన్నే కంఫర్ట్ జోన్ అనుకునే పిచ్చి నమ్మకాల్లో చితికిపోతూ … అంకంఫర్ట్ జీవితాల్లో కనిపించే చిన్న పాటు శూన్యాన్నే కంఫర్ట్ జోన్ గా ఫీలయ్యే మనం ఎన్ని సార్లు ఇలా అనుకొనుండలేదూ.
ఎక్కడరా తెల్లోడా మేము గెలిచింది?
అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ
నీకు బానిసలమే కదా!” దేశం మీద ప్రేమ సరిదిద్దుకోలేని ఒకానొక నిస్సహాయావెదన లొంచి వచ్చిన వాఖ్యాల్లా ఇలా కాగితం పై రాలిపోయి “మరిప్పుడు నీసంగతేంట?ని పాఠకున్ని ప్రశ్నిస్తాయ్…
ఐతే అతిసున్ని తభావమూ అత్యంత అరుదుగా కనిపించే దృశ్యమూ సరిత కళ్ళలో పడకుందా తప్పించుకోవటం అరుదే… కొన్ని సార్లు అక్కడక్కడా కొద్దిగా తడబడినట్టు అనిపించినా తను రాసిన మిగిలిన పదాలెన్నో అత్యద్బుతంగా ఉండి చిన్న లోపాలని కనిపించనివ్వవు…. ఏదేమైనప్పటికీ రాబోయే కాలం లో నిలబడబోయే అతికొద్దిమందిలో సరిత స్థానం సాహిత్యం లో పదిలమే అని చెప్పొచ్చు… ఈ ఒక్క కవిత చూడండి… చూసాక మరిన్ని చదవాలనిపించొచ్చు లేదూ అవే వాక్యాలని మళ్ళీ మళ్ళీ చదవాలని పించనూ వచ్చు… ఒక నిరామయ శూన్యావస్తలో మిమ్మల్ని కొద్దిసేపలా పడవేయనూ వచ్చు ఇంకొన్ని చదవాలని పిస్తే….sarithabhupathi.blogspot.in ఈ లింక్ చూడండి ఐతే కొత్త బ్లాగ్ కావటం వల్ల అన్నీ పోస్ట్ చేయలేదనిపిస్తుంది కవిసంగమం లో సరిత కవితలన్నీ చదివే అవకాశం వదులుకోవద్దు…

// ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం//

 

యా దేవీ సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత
లోకమాతా! లవకుశులంటి వీర కొమరులెవరూ లేరిక్కడ
క్షమించాలి వీరత్వం లేకపోవటమేమిటీ కామంతో కళ్ళు బయర్లు కమ్మి,
నీ మాతృరూపాన్ని కూడా గుర్తించని మెుగతనమంతా వీరత్వమేగా
యా దేవీ సర్వభూతేశు శాంతిరూపేణ సంస్థిత
ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగో
నిన్ను పొగిడినపుడే గుర్తించాల్సింది
రాఘవప్రియా! ఆ ప్రియత్వం అంతా చేయని అపరాధాన్ని మోస్తూ
అగ్నికి నిన్ను నువ్వు అర్పించుకొని
పునీత అని నాలుగు నోళ్ళలో నానితేనే బయటపడుతుందనీ,
కర్కశత్వానికి భయపడి తల్లి ఒడిన దాగోకపోతే
ఇంకెన్నాళ్ళో కదూ రామవల్లభా అని పిలుస్తూ నిరంతరం వధిస్తూ
విష్ణుపత్నీ! మరి సిరికిన్ చెప్పడే?
సిడి ముడి తడబడినా, జారే పవిట ఆపటానికి అష్టకష్టాలు పడటం ముల్లోకాలు చూస్తున్నా,
అది నీ పరువు తీయటం కాదనీ,
గజేంద్రమోక్షం అంటే లోకం చంకలు గుద్దుకొని ఆలకిస్తుందనీ
ద్రుపదరాధ్యా.. ధర్మరాజప్రియాయై.. అర్జునవిమోహనాయై.. భీమసేనమనూవల్లభాయై.. సవ్యశాచిశివశాయై .. నకులస్వాంతభూషణాయై వారి నామధేయములను ముందు తగిలించుకున్నా
ఆ అయిదుగురు భర్తల ముందు
విధవ అవుతుంటే గుడ్లప్పగించి చూసారే?
యజ్ఞసంభూతా! పేరుకు తగిలించిన నీ పురుషపుంగవుల పేర్లు
ఆనాడే నిన్ను నగ్నంగా చూస్తూ వెక్కిరించాయి కదా
స్త్రీ శక్తిస్వరూపిణి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
ఈ పొగడ్తలన్నీ నిన్ను తుంగలో తొక్కటానికే
యుగాలు మారినా….. ఈ పురుషాధిక్య సమాజంలో
స్త్రీ అంటే కార్యేషు దాసీ శయనేషు రంభ
                                                          –సరిత భూపతి

(Visited 334 times, 53 visits today)