Home / Entertainment / బ్రహ్మోత్సవం సినిమా రివ్యూ & రేటింగ్.

బ్రహ్మోత్సవం సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

bramothsavam movie review

శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరువాత, కుటుంబ కథలకి పెట్టింది పేరు అయిన శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ బాబు చేసిన సినిమా బ్రహ్మోత్సవం, ఈ సినిమాని పివిపి సినిమా బ్యానర్ పై పొట్లూరి ప్రసాద్ నిర్మించాడు, సినిమా నిర్మాణంలో మహేష్ బాబు సొంత బ్యానర్ కూడా ఉంది, సినిమా మొదలైనప్పటి నుండే చాలా పెద్ద హిట్ అవుతుందని అంచనాలు వేసారు, మరి  బ్రహ్మోత్సవం ఆ అంచనాలని అందుకున్నదో..? లేదో..? చూద్దాం..!

కథ:

మహేష్ బాబు, వాళ్ళ నాన్న సత్య రాజ్, అమ్మ రేవతి మరియు నలుగురు అత్తలు, మామలు వారి పిల్లలతో కలిసి ఎంతో అన్యోన్యముగా ఉంటారు. కానీ మహేష్ బాబు పెద్ద మామ రావు రమేశ్ వీళ్ళలో కలిసినట్టే ఉన్నా కలవడు. అందరు కలిసే బిజినెస్ చేస్తున్న సత్యరాజ్ కొచ్చిన పేరు తనకు రావట్లేదని ఫీల్ అవుతుంటాడు. చివరికి తన కూతురు  ప్రణీత ని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. కానీ మహేష్ బాబు కాజల్ కి దగ్గరవడంతో రావు రమేశ్ తీసుకున్న నిర్ణయం సత్యరాజ్ మరణానికి కారణం అవుతుంది. తన తండ్రి మరణం తర్వాత మహేష్ బాబు తన తండ్రి నమ్మిన సిద్దాంతాన్ని ఎలా పాటించాడో, తన జీవితంలొకి సమంత ఎలా వచ్చిందొ, రావు రమేశ్ మనసు ఎలా మార్చాడో, మొత్తం కుటుంబాన్ని ఎలా కలిపాడో  మిగిలిన సినిమా.

అలజడి విశ్లేషణ:

దేవుడి బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి సమంత చెబుతున్నట్లుగా మొదలవుతుంది సినిమా, మొదటి భాగం మొత్తం ఒక డబ్బున్న పెద్ద ఫ్యామిలీ కలిసి ఎలా ఎంజాయ్ చేస్తారో, ఫంక్షన్ లు , పండుగలు కలిసి ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారో చూపించాల్సి రావడం, మహేష్ బాబుతో, కాజల్ వ్యవహారం కలిసి ప్రతి పది నిముషాలకు ఒక పాట వస్తుంది. సినిమాకి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే లోపే పాట రావడమో లేకపోతే, ఆ సీన్ అక్కడికి ఆగిపోవడమో జరుగుతుండటంతో సినిమా లో అసలు ఏం జరుగుతుందో అర్ధం అయినా అర్ధం కానట్లే ఉంటుంది.

సత్యరాజ్ మరణంతో ఇంటేర్వెల్ కి వెళ్ళిన ప్రేక్షకులు రెండవ భాగంలో అయిన ఏదైనా మంచి కథ ఉంటుందో అని ఎదురుచూస్తారు, సమంత కూడా ఉండటంతో ఎంటర్‌టేన్‌మెంట్ ఉంటుందని ఎదురుచూసిన వారి ఆశలు అడియాసలు అవుతాయి. రెండవ భాగంలో, ఉన్న కుటుంబాన్ని చక్కదిద్దుతాడనుకున్న మహేష్ బాబు, సమంతతో కలిసి తన ఏడు తరాల చుట్టాలను వెతుక్కుంటూ, ఊర్లు తిరుగుతూ ఇంకా సినిమా పది నిముషాలలో ముగుస్తుంది అన్న టైమ్ కి మళ్లీ ఇంటికి వస్తాడు. ఈ గంట సమయం ప్రేక్షకులకు కొన్ని యుగాలు గడిపినట్టుగా ఉంటుంది. అసలు మహేష్ బాబు అన్ని ఊర్లు తిరిగి ఏం సాదించాడనేది సగటు ప్రేక్షకులకి అర్దం కాదు. సినిమాలో స్క్రీన్ నిండుగా పాత్రలు ఉన్న అలరించే పాత్రలు కొన్నే. మహేష్ బాబు,సమంత లకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది మరియు వీరి మధ్య వచ్చే ఎపిసోడ్ లు మాత్రమే కొంచెం అలరిస్తాయిు. సినిమాలో నవ్వుకున్న సంధర్భాలు నాలుగుంటే, ఏడిపీంచే సంధర్భాలు చాలా ఉంటాయి.

నటీనటుల పెర్ఫార్మన్స్:

మహేష్ బాబు: మహేష్ బాబు తన పెర్ఫార్మన్స్ తో సినిమాని నడిపించాడు, లుక్ పరంగా మహేష్ బాబు చాలా సూపర్బ్ గా కనిపించాడు, ఇంటర్వెల్ కి ముందు మహేష్ బాబు పెర్ఫార్మన్స్ సినిమాకే హైలెట్. క్లైమాక్స్ లో కూడా చాలా బాగా చేసాడు.

కాజల్:కాజల్ పాత్ర ఫస్ట్ ఆఫ్ వరకే పరిమితం, పెర్ఫార్మన్స్ విషయంలో కాజల్ బాగా నటించింది.

సమంత: సమంత తన యాక్టింగ్ తో సినిమాలో కొంచెం ఊపు తీసుకవచ్చింది, మహేష్ బాబు, సమంత మధ్యలో వచ్చే సీన్స్ కొంచెం బాగుంటాయి.

రావు రమేష్: రావు రమేష్ పెర్ఫార్మన్స్ సినిమాకి ప్లస్ పాయింట్, క్లైమాక్స్ లో రావు రమేష్ చాలా బాగా నటించాడు. 

మిగతా వారిలో మహేష్ బాబు తండ్రిగా సత్య రాజ్, అమ్మ గా రేవతిలు తమ తమ పరిది మేరకు నటించారు. హీరోయిన్ ప్రణీత కు, కమీడియన్ వెన్నెల కిశోర్ కి పట్టుమని పది డైలాగ్ లు కూడా లేవు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ రత్నవేలు పనితనం, సినిమాని చాలా కలర్ ఫుల్ గా, సూపర్బ్ క్వాలిటీగా చూపించాడు, మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, ఇక డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన మార్క్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు, తనకు మాత్రమే సాధ్యం అయిన కుటుంబ కథని కమర్షియల్ గా చెప్పే ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు కాని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా తీసాడు, కథలో ఇంకా బలం ఉంటే మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేది, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురుంచి చాలా సీన్స్ ని మధ్యలోనే కట్ చేసారు, స్క్రీన్ ప్లే కూడా సరిగా లేదు.

ప్లస్ పాయింట్స్:

  • మహేష్ బాబు పెర్ఫార్మన్స్
  • సినిమాటోగ్రఫీ
  • రావు రమేష్
  • ఫ్యామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ, స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్
  • బోర్ కొట్టించే సీన్స్

అలజడి రేటింగ్: 2.25/5

 పంచ్ లైన్: సీరియల్ లాగ సాగిపోయిన బ్రహ్మోత్సవం.

(Visited 11,255 times, 18 visits today)