EDITION English తెలుగు
Home / Inspiring Stories / ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం.

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం.

Author:

Special Status Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ప్రత్యేక హోదా కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు ఆ ఆశ అడియాసే అయింది, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదని కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈ మేరకు స్పష్టం చేశారు. అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు జీరో అవర్‌లో జయంత్ సిన్హా రాతపూర్వంగా జవాబిచ్చారు. ప్రత్యేక హోదా గురుంచి విభజన చట్టంలో లేదు, విభజన చట్టం నిబంధలను ఇప్పుడు మార్చడం కుదరదు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి చెప్పారు.

ప్రణాళిక సంఘం స్థానంలో ప్రవేశపెట్టిన నీతిఅయోగ్‌ సిఫారసులకు అనుగుణంగా ఏపీకి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకే ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్లు సిన్హా చెప్పారు. ఏపీకి రెండేళ్లలో రూ.6,403 కోట్ల ఆర్థికసాయం అందచేశామని, లోటుబడ్జెట్‌ భర్తీ కింద రూ.2,805 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. అలాగే రాజధానికి రూ.2,050 కోట్లు ఇచ్చామని జయంత్‌ సిన్హా తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.700 కోట్లు విడుదల చేశామని, పోలవరానికి రూ.850 కోట్లు విడుదల చేసినట్లు జయంత్ సిన్హా లేఖలో పేర్కొన్నారు.

ఇటీవలే రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రైవేటు మెంబర్ బిల్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు జేడీశీలం, సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. అదే సమయంలో హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. తాజాగా సిన్హా కూడా ప్రత్యేక హోదా లేదంటూ అధికారిక ప్రకటన ఇవ్వడం ఏపీలో ప్రకంపనలకు దారి తీసింది.

(Visited 467 times, 43 visits today)