Home / సాహిత్యం / పుస్తక పరిచయం- చేతి చివర ఆకాశం.

పుస్తక పరిచయం- చేతి చివర ఆకాశం.

Author:

sailaja bandari

పుస్తకం: చేతి చివర ఆకాశం(కవిత్వం)
కవయిత్రి: శైలజా బండారి
పబ్లిషర్: వాసిరెడ్డి పబ్లికేషన్స్
బి-2,టెలికాం క్వార్టెర్స్,కొత్తపేట్,
హైదరాబాద్-6,ఫోన్:9000528717

ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలూ,పబ్లిషర్స్.

ఆకాశం ఎక్కడుంటుందీ? పైన మనకంటికి తప్ప చేతికందనంత దూరంలో అనిపిస్తుంది కదా..! లేదేమొ ఊహకందని కొంత శూన్యత చేతిదాకావచ్చి కూడా అందకుండా పోయే ఒక ఊహ, లేదూ..! వెళ్ళకిల్లా పడుకొని మన ఇంటి పైకప్పు కేసి చూస్తూ నే ఊహల్లోకి జారి అనంతానంతపు నిశ్శబ్దం లోకి జారిపోయే క్షణాలు కూడా ఆకాశం తో పోల్చబడతాయ్…. కనీ కనిపించని ఒక అధివాస్తవిక ఊహకూడా కొన్ని సార్లు కవితాత్మకత అద్దుకొని ఆకాశం గా కవిచేత అనిపించుకుంటుంది.. మరి చేతి చివరి ఆకాశం అంటే..!? ఒక ఊహ,తుడుచుకున్న వెంటనే మళ్ళీ పుట్టే ఒక అనామక కన్నీటి చుక్క చెక్కిలి మీదుగా జారుతూ చేసిన చప్పుడు,ఒకానొక ఆనంద సమయం చిన్ని నవ్వుతో కలిసినప్పటి ఒక అగోచర స్థలం. ఇలా ఒక్కోసారీ ఒక్కోలా తన రంగూ,రూపులని మార్చుకునే ఆకాశం అందినట్టే అనిపించే ఒక అనుభవం… ఎన్నని,ఎన్ని పేర్లని..!? ఒక ఆకాశం వేలి చివర్లలో చేసిన చిన్ని నృత్యం అదే చేతి చివరి ఆకాశం… వర్థమాన కవయిత్రి శైలజా బండారి కవితా సంపుటి ఫేస్బుక్ కవిసంగమం గ్రూప్ లోనూ ఫేస్బుక్ లో తన వాల్ మీదా పోస్ట్ చేసిన కవితలన్నీ కలిపి తెచ్చిన పుస్తకమే ఈ “చేతిచివర ఆకాశం”. చదివినంతసేపూ… శరీరానికీ మరేదో ఆత్మ లాంటి భావానికీ,రియాలిటీకీ..భావుకతకీ ఉండే ఒక చిన్న స్పేస్ లో ఉండిపోయినట్టనిపిస్తుంది…..

కొన్ని కవితల్లో ఇంకొకరి వేదననీ కష్టాన్నీ తానే అనుభవించిన అనుభూతిలోకి వెళ్ళి రాసినట్టుగా అనిపిస్తుంది.. నువ్వు జీవితాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ/నన్ను నీఙ్ఞాపకాలతో నింపేసావు/అణువణువూ నీ ఊసులే ఏదో భరోసా గుండెనిండిపోయింది/నువ్వు నాతోనే ఉన్నావని/అయినా వెలితి ఏదో శూన్యమై ఆవరిస్తూ/భౌతికంగా నువ్వులేనితనాన్ని గుర్తు చేస్తూ…. దాదాపుగా ప్రతీ ఒక్కరి జీవితం లోనూ ఒక ఎడబాటు తాలూకు చాయ ఉండి తీరుతుంది అదే కొంత విషాదాన్ని మరికొంత మానసిక బలాన్నీ పెంచుతుంది. ఒక విషాద ఘటనని వర్ణిస్తూ సాగిన కవిత చివరికి వస్తూనే జీవించాల్సిన అవసరాన్నీ బతుకుకి కావలసిన స్థైర్యాన్నీ ఇస్తూ… కన్నీరైనా/పన్నీరైనా/నువ్వు బతుకు బ్రతికించు/కొన్ని బతుకులని బతికించటానికి బతుకు /బతుకు పోరాటం సాగిస్తూ బతుకు.. అంటూ ముగుస్తుంది.(నువ్వు లేని శూన్యం)కవిత పూర్తయ్యాక కొన్ని క్షణాల మౌనం ఒక పాత పుస్తకం లోని నెమలీ క కళ్ళలో చిరుతడి అలా క్షనం సేపు మన కళ్ళలోనూ కదలాడుతుంది..

మరోకవితలో… రక్తంలో కరుగుతూ తీపిఏదో కిత్తగా పుట్టి/ఇన్సులిన్ సూదిలా చర్మం లొకి ఇరుకుతూంటే/పుష్కరం వయసు బాల్యం ఒకటి/చిక్కి శల్యమౌతున్న శరీరానికి వేళ్ళాడుతూ… ఒక వ్యాదిగ్రస్త శరీరమూ ఆ మనసు పడేబాదలని ఏక కాలం లోనే చూపిస్తారు (కన్నీటి అంచున) ఒక నిజజీవితాన్ని అక్షరాలుగా పేర్చిన తీరు కంటతడిపెట్టిస్తుంది.. పుస్తకంలో ఉన్న అన్ని కవితలూ ఇలా విషాదాన్నే అలుముకోలేదు పుస్తకమ్మొత్తం ఒక బంచ్ ఆఫ్ ఫీలింగ్స్.. ఐతే మీరొక డచ్ రోజెస్ గుత్తిని పట్టుకున్నప్పుడు ఆ సుకుమారమే కనిపించొచ్చు కానీ ఈ పుస్తకం ఒక దేశవాళీ గులాబీల గంప పూవుల అందాలే కాదు ముళ్ళలాంటి విషాదాలూ కనిపిస్తాయ్..

ఒక అందమైన అమ్మాయి/ఎందరో ప్రేమపిపాసులూ/దేవదాసులూ/మజ్ఞూలు అంటూ కొన్ని యవ్వన కాలపు రోజులని స్పర్శించే వాక్యాలు ఉచ్చ్వాసనిశ్వాసాల్లో ఊయలూగే గాలీ/ప్రేమ తిరస్కారాల్లో ఊగిసలాడే ప్రేమికుడూ మనలోనే మనచుట్టూనే ఉండే కొందరు మనుషులనూ కొన్ని గడిచిపోయిన రోజులనూ గుర్తుకు తెస్తాయ్… కొందరు ఏడుస్తున్నారు/కొందరు ఏడుపు నటిస్తున్నారు/కొందరు పాఉడే ముఖానికి/ఏడుపురంగుని పులుముకుటున్నారు/అయిన్నా…ఎవరెంత ఏడ్చారో ఒలికిన కన్నీరెవరిదో /చచ్చిపడి ఉన్న ఆ శవానికి బాగాతెలుసు.. (శవం) అన్న వాక్యాలదగ్గర ఒక సారి ఆగి మానవ జీవితం లో ఎన్ని నటనలున్నాయో… ఎన్ని మోసాలున్నాయో మరెన్ని అనివార్య ధుఖ కాలాల దారులున్నాయో చెప్పినప్పుడు మనసులో ఒక మహా స్మశానం మొలిచినట్టుగా కొన్ని జెముడుమొక్కలు గుండెచుట్టూ పెరిగి గుండెను సలుపుతున్న అంభూతి ఆవరిస్తుంది.

ఒక ప్రాంతపు అస్థిత్వాన్ని సజీవంగా ఉంచేది భాషా,యాసా,ఆప్రాంతపు వాతావరణమూ మాత్రమే కాదు సముద్రాలని దాటి వెళ్ళినా వాటన్నిటినీ తనలో దాచుకున్న మనిషే తన ప్రాంత అస్థిత్వాన్ని మళ్ళీ నిలబెట్టగలడు,అదే గాలుల చల్లదనాన్ని ఆపొద్దుల రాగాలనీ మనముందు చిత్రించగలడు… మా 8ఇంక్లైన్ కాలనీ, సింగరేణీ ఈ రెండుకవితలూ తెలంగాణా మాండలీకాన్నీ రామగుండం గోదావరీ లోయ అందాలనీ ఒక్క సారిగా రాకాసిబొగ్గు అని పిలిపించుకునే అమ్మతాలూకు ఒక మాతృ స్పర్శానుభూతిని కలిగిస్తాయ్ అది అక్కడపుట్టిన మనిషి మాత్రమే అర్థం చేసుకునే ఒక భాష ఒక మార్మిక స్పర్శ…

ఒక్క ముక్కల జెప్పాల్నంటే వాకిలి అలికి ముగ్గుపెట్టినట్టుంటది/సింగరేనిసిగలో అందమైన తంగేడు పుష్పం… ఇప్పుడు నా వేర్లను నేను వెతుక్కుంటున్నాను/ఊపిరిపోసిన బతికిన క్షణాలను వెతికి పట్టుకుంటున్నాను/వెచ్చని అమ్మ ఒడిలెక్క/నాన్న ఆత్మీయ స్పర్శలెక్క/ఎన్నో జీవితాలకు దిక్సూచి లెక్క /మా 8ఇంక్లైన్ కాలనీ…. నావేర్లను నేను వెతుక్కుంటున్నాను అన్న మాటకు అర్థం కవితలోనే ఉంది తన యాసా,భాషా,ఉచ్చారణలను అందుకోలేక మళ్ళీ మామూలుభాష లోనే తన భాషను బంధించుకున్న ఒక లోలోపలి ధు:ఖం మనకు కనిపించకుండా పోదు… ప్రతీ బొగ్గుపెళ్ళా చెబుతుంది/కథలు కథలుగా సీమాంద్ర దోపిడీని/కణ్ణీళ్ళుగారాబందుల రాక్షసత్వాన్ని/తవ్విపోసిన ప్రతీ మట్టిగుట్టా చెబుతుంది…. 8ఇంక్లైన్ చుట్టు పక్కల కొండల్లా ఉండే మట్టి కుప్పలని చూస్తే తప్ప అర్థం కాదీ వ్యద కవితలో మనదాకా చేర్చే ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి…

మొత్తానికి 55 కవితల్లో చెప్పిన,చెప్పుకున్న,కేరింతలుగా,ఆనందకెరటాలుగా, ధు:ఖపు తెరలుగా తనని తాను చెప్పుకున్నారు శైలజ… పుస్తకంలో ప్రతీ కవిత చివరా కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ మొదటినుంచి చదవాలనిపంచేలా ఉన్నా, కవితలన్నీ అద్బుతం అని చెప్పలేం.. ఐతే..! చేతిచివర ఆకాశం చదివిన పాఠకుడూ ఒక సారి తనని తాను చదువుకుంటాడు కొన్ని పేజీలని దాటేస్తాడు… ఐతే..! అతను వదిలేసిన పేజీల దగ్గర మరొకరు ఆగిపోవచ్చు ఆ అక్షరాలలో తమని తాము గుర్తించుకోని అలా ఆ పుస్తకాన్ని గుండెల మీద ఆనించుకొనీ కవిత్వ భాషలో తమతో తాము మాట్లాడుకోగలరు….

(Visited 310 times, 128 visits today)