Home / Inspiring Stories / పిల్లలను ఎత్తుకు పోయి బిచ్చమెత్తిస్తున్నారు.

పిల్లలను ఎత్తుకు పోయి బిచ్చమెత్తిస్తున్నారు.

Author:

ఒకపక్క విపరీతమైన ఎండ, రోడ్డు కూడా సెగలు కక్కుతోంది, చుట్టూ వాహనాల పొగ, హారన్లూ వీటికి తోడు మీరు ట్రాఫిక్ జాం లో ఇరుక్కు పోయున్నారు. ఎలా ఉంటుందీ ఇది చదువుతున్నప్పుడే ఆవాతావరణం చికాకుగా అనిపించింది కదా…! అదే వాతావరణంలో అదే కాలిపోయే రోడ్డు మీద రెండు పసిపాదాలు నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తాయి. మీ చేతినో కాలునో తడుముతాయి చెడు లేలేత చేతులు… ఇంట్లో మీరు ముద్దాడుతూ ఎత్తుకొని ఆడిస్తారే అచ్చం మీ పిల్లల వయసులోనే ఉన్న ఒక పసి పాప తన గాజుకళ్ళ తో మీవైపు దీనగా చూస్తూ కొన్ని చిల్లర నాణాలను అడుగుతుంది…… వీలైతే రెండు నాణాలో లేదంటే ఒక చీదర చూపో ఆ పసిదానికి “బిచ్చంగా” వేస్తాం మనం. అక్కడితో మన బాధ్యత తీరిపోయిందా..? అసలెవరా పాప? అదే వయసులో ఉన్న మన పిల్లలు సంతోషంగా ఉంటే ఆ పసిది మాత్రం ఇక్కడ ఎందుకోసం అడుక్కుంటోందీ…. అని ఆలో చిస్తే… ఆ ఆలోచనలు కొద్దిసేపు కొనసాగితే…!? మీరు నమ్మలేని నిజాలు వింటారేమో. ఒకప్పుడు అమ్మ వొళ్ళో బజ్జొని కారులో వెళ్ళిన తను ఇక్కడ అడుక్కుంటోందని తెలిసి చలించి పోతారేమో. తన నాన్న కూడా మీలాగే ఆ పిల్లనూ బండి మీద ఎక్కించుకొని బడిలో దింపివచ్చిన రోజులున్నాయని చెబితే మీరు నమ్మలేరేమో కూడా…. కానీ అవి నిజాలు… చైల్డ్ ట్రాఫికింగ్ కు గురై ఎక్కడో కిడ్నాప్ చేయబడి మరెక్కడికో తరలించి వాళ్ళతో బిచ్చం ఎత్తిస్తున్నారు కొందరు రాక్షసులు… పసి ప్రాణాలే పెట్టుబడిగా వారి రక్తాన్ని తాగుతున్నారు… రంగారెడ్డి పోలీసుల సాక్షిగా బయట పడ్డ నిజాలివి.

beggar-main

రోడ్డు మీద గాంధీ వేశంలో అడుక్కునే పిల్లవాన్ని గానీ,సిగ్నళ్ళ దగ్గర వికలాంగులై అడుక్కునే పిల్లలనిగానీ పలకరించి చూడండి. వాళ్ళు మాట్లాడరు. వివరాలు చెప్పరు. మీరు పదే పదే గుచ్చి గుచ్చి అడిగితే అక్కన్నుంచి పారిపోవటమో,కాస్త పెద్ద పిల్లలైతే ఏదో ఒక జాలి కథని “బట్టీ పట్టినట్టు అప్పగించటమో చేస్తూంటారు. ఎందుకంటే వారికి దగ్గరలోనే వారిని అడుక్కోవటానికి తీసుకు వచ్చిన మనిషి వారిని గమనిస్తూంటాడు. వారు ఎవరితోనైనా మాట్లాడినట్టు కనిపించిందా… ఇక ఆరోజు రాత్రి వాడికి చిత్ర హింసలే…

Child Trafficing Hyderabad.

అనాథ బాలలకు విముక్తి కలిగించేందుకు హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆపరేషన్ స్మైల్-2 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన దాడుల్లో వీదుల్లో అడుక్కునే బాలలను కాపాడి వారి నుండికొన్ని విషయాలను రంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రీమా రాజేశ్వరి. ఎంతో ఆవేదన చెందారట. కొందరి తల్లిదండ్రుల్లో కేవలం ఒకరు మాత్రమే ఉన్నపుడు వారి పిల్లలు అనాథలవుతున్నారని,మరికొందరిని వేరే ప్రాంతాల నుంచి తెచ్చి కౄరంగా వారికి శిక్షణ ఇచ్చి మరీ వారి జీవితలను చిదిమేస్తున్నారు.కొన్నిసార్లు బలవంతంగా వారితో రక్త దానం చేయిస్తున్నరు. పేరుకే అది దానం నిజానికి వాళ్ళు ఆ రక్తాన్ని అమ్ముకుంటున్నారు. తండ్రి లేదా తల్లి చనిపోయి పేదరికం వల్ల ఇబ్బందికి గురౌతున్న పిల్లలను కొన్ని సార్లు వారి సమీప బంధువులే ఈ పిల్లలను తీసుకెళ్లి, భిక్షాటన, వ్యభిచారం వంటి పనులు చేయిస్తున్నారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో అదృశ్యమైన బాలలు రంగారెడ్డి జిల్లా వీధుల్లో బిచ్చగాళ్లుగా, బాల కార్మికులుగా కనిపిస్తున్నారు. గత నెలలో తాండూరు మండలంలో 142 మందికి, తాండూరుకు పరిసర ప్రాంతాల నుంచి మరో 123 మందికి పోలీసులు విముక్తి కలిగించారు. వీరిలో అనాథలు, బంధువుల ఆదరణ కరవైనవారు ఉన్నారు. ఓ బాలికను రూ.250 చెల్లించి ఓ గిరిజన కుటుంబం కొనుగోలు చేసిందని, వారు ఆ బాలికను బలవంతంగా బిచ్చగత్తెగా మార్చారని తాండూరు పోలీసులు తెలిపారు.

ఒక మామూలు పట్టణం అయిన తాండూరు లోనే ఇంతమంది పిల్లలుంటే ఇక రాజధాని వంటి నగరంలో ఎందరు పిల్లలు ఇలా బలై పోతున్నారో అని ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది.

(Visited 546 times, 19 visits today)