EDITION English తెలుగు
Home / Inspiring Stories / 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క నెలలో చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు.

70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క నెలలో చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు.

Author:

బాలచంద్ర హెగ్డే, సన్నీ అరోకియా స్వామి, కుమారస్వామి, కొట్రేశ్ వీరాపూర్ బీటెక్ చదువుకున్న నలుగురు సామాన్య కుర్రాళ్ళు వీళ్ళు. కాకపోతే బీటెక్ ఐపోగానే వీళ్ళకోసమే కాక తమ చుట్టూ ఉన్న సమాజం కోసం కూడా ఒక్క నిమిషం ఆలోచించారు. కర్ణాటకలోని ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదివారీ నలుగురూ. కాలేజ్ లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న సమయంలో ఒక చిన్న చర్చ జరిగినప్పుడు విద్యుత్ లేని గ్రామాల ప్రసక్తి వచ్చింది. అప్పటికి వారిపనిలో పడిపోయినా పట్టాలు చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకుని స్థిరపడిపోదామని ఆలోచించకుండా దేశానికి ఏం చేయాలా అని ఆలోచించారు.

అలాంటి ఆలోచనల్లోనే ఓసారి ఈ నలుగురూ ఉత్తర కన్నడ జిల్లా అయిన జోయిడాలోని మారుమూల గ్రామాలకు వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి విస్తుపోయారు. ఎందుకంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ ఆ గ్రామాలకు కరెంటనేది లేదు. అంధకారంలో మగ్గుతున్న అక్కడి గ్రామస్థుల్ని చూడగానే ఎప్పుడో తాము మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి తమ లక్ష్యం ఏమిటో అర్థం అయ్యింది.

bringing-light-to-the-village-1

వెనటనే మళ్ళీ వెనక్కి వచ్చారు ఇప్పుడు తాము చేయాలనుకున్న పనికి కేవలం తాము నలుగురు మాత్రమే సరిపోరు మరేం చేయాలి..?నలుగురిలో ఒకడైన సన్నీ అరోకియా స్వామి చెప్పిన ఆలోచన ఒకటి అందరికీ నచ్చింది.  తాము చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ఓ 20మంది విద్యార్థులను ఎంచుకున్నారు. వారికి తాము చేయాలనుకుంటున్న పని వివరించారు సహాయం చేయాలనుకున్న వారు రావచ్చని చెప్పరు. ఆనందంగా అంగీకరించారా కొత్త మిత్రులు కూడా.

bringing-light-to-the-village-1

అంతాకలిసి కార్యరంగంలోకి దిగారు. అంతా కలసి రెండు గ్రామాల్లోని 20 ఇళ్లలో వెలుగులు పూయించారు.జోయిడాలోని అటవీ గ్రామాలైన ఘటక్‌కునాంగ్, కుక్కుటె, కిండేల్ వంటి తొమ్మిది గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వీటిలో రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు. దారితెన్నూ లేని ఈ గిరిజన గ్రామాలకు కరెంటు సౌకర్యం తెప్పించాలంటే సౌర విద్యుత్‌ ద్వారానే సాధ్యమని భావించారు. ఒక్కో ఇంటికి సోలార్ పలకలు అమర్చాలి. మరికొంత సామగ్రి అవసరం. తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి సరే. మరి డబ్బు సంగతి? దీనంతటికీ లక్షలు ఖర్చవుతాయి. ఎలా? నలుగురు కుర్రాళ్లూ తాము చదువుకున్న కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు.

bringing-light-to-the-village-1

వారి ఆశయం గురించి తెలుసుకున్న ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం ఈ ప్రాజెక్టును స్పాన్సర్ చేయడానికి అంగీకరించింది. అలా ‘ప్రాజెక్ట్ బెళకు’ పట్టాలకెక్కింది. (బెళకు అంటే కన్నడంలో వెలుగు అని అర్థం). ఏప్రిల్ 7వ తేదీన ఏడుగురు కుర్రాళ్లు సమీపంలోని ధార్వాడ్‌కు వెళ్లి, కావలసిన పరికరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాతి రెండు రోజుల్లో రెండు గ్రామాల్లోని 20 ఇళ్లలో వెలుగులునింపారు. ఇదంతా ఎప్పుడో జరిగింది కాదు కేవలం నెలరోజుల కిందటే.

bringing-light-to-the-village-

వెలిగిపోతున్న తమ గ్రామాలను చూసి మురిసిపోయిన గ్రామస్థులు కుర్రాళ్లందరికీ తమకు తోచిన రీతిలో సన్మానం చేశారు. వారిని తమ దేవుళ్ళంటూ నెత్తిన పెట్టుకున్నారు. ఈ సంఘటన పత్రికలకెక్కింది. వారిపై ప్రశంసల వర్షం కురిసింది.

bringing-light-to-the-village-1

అయితే ఇంతటితో తమ లక్ష్యం నెరవేరలేదంటున్నారు ఆ నలుగురు యువకులు.  రెండు గ్రామాలకు కరెంటు తెప్పించగానే వారి ప్రస్థానం ఆగిపోలేదు. భారతదేశంలో అంధకారంలో మగ్గుతున్న 11400 గ్రామాలను విద్యుదీకరించడమే లక్ష్యమంటున్న ఈ నలుగురి కళ్ళలో కొన్ని కలలున్నాయి…. కొన్ని జీవితాలలో కురవాల్సిన వెన్నెలని తమ కలల్లో మోస్తున్నారు వాళ్ళు… ఇప్పుడు మనవంతూ వస్తోందేమో మన ఊరిలో ఒక్క దీపాన్నో…ఒక వీది పంపునో మనం కాక ఇంకెవరు చేస్తారు..?  మీరేం చేయాలనుకుంటున్నారో, ఏదైనా ఆలోచన ఇవ్వాలనుకుంటున్న మాకు తెలియజేయండి…. మీ ఊరికోసం మీరు చేసిన చిన్న పని అయినా సరే కామెంట్లలో మాతో పంచుకోండి.. మీ పని మరొకరికి స్ఫూర్తినిచ్చేది కావొచ్చు… అలజడి మీ స్ఫూర్తి గాథని ప్రపంచానికి తెలియజేస్తుంది.

(Visited 6,218 times, 28 visits today)