Home / Political / ఇక ఎర్రబెల్లి దయా”కార్”

ఇక ఎర్రబెల్లి దయా”కార్”

Author:

Errabelli Dayakar Rao joined TRS party

ప్రజాభీష్టం మేరకే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరణ ఇచ్చారు. తెలంగాణలో తిరిగేందుకు టీడీపీకి మొహం లేదని, ఆ పార్టీ ఇక్కడ బతుకలేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ పేదల పార్టీ అని తాము ప్రజల్లోకి వెళ్లినా, ప్రజలు మాత్రం గ్రేటర్లో కారుకె ఓట్లు అన్ని గుద్ది ఏకపక్ష విజయాన్ని టిఆర్ఎస్ పార్టీకి అప్పగించారు. దానితో ఒకరి వెనుక ఒకరుగా పచ్చకండువాలు తీసేసి గులాబీ రంగులోకి మారిపోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ కు టీ.టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్దంగా ఉంది. నిన్న మొన్నటివరకూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసిన ఎర్రబెల్లి కూడా గులాబీ దళం లో చేరిపోయి “పసుపు గుడ్డలు” విప్పేసుకున్నారు. ఇన్నాళ్ళూ తాను “ఆ పార్టీ అధిష్టానం” ఆదేశాలమేరకే ఇక్కడ నడుచుకున్నాననీ… తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్షించటం లో టీడీపీ పార్టీ అధిష్టానానిదే తప్ప తాను నిమిత్త మాత్రున్ననీ చెప్పుకొచ్చారు…. గతంలో తాను టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశానని, అవన్నీ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే చేశాననే విషయాన్ని మళ్లీ చెప్తున్నా నీ ఎర్రబెల్లి సెలవిచ్చారు. ఇక టీడీపీని వీడటం బాధగా ఉందని కూడా, పాపం బాగానే భాద పడ్డ ఎర్రబెల్లి..ఇప్పుడు “తన” ప్రాంతమైన తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరానని, అయితే ఇక్కడ ఇలా చేరటం కాకుండా తన జిల్లా వరంగల్‌లోగానీ, హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలోగానీ భారీ బహిరంగ సభ వేదికగా సీఎం సమక్షంలో మరోసారి టీఆరెస్ పార్టీలో చేరుతానన్నారు. పాలకుర్తి నియోజకవర్గంతోపాటు వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినవారిలో తెలంగాణలో 15 మంది శాసనసభ్యులు గెలిచారు. వారిలో ఒక్కరొక్కరే తెరాసలో చేరుతున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది శాసనసభ్యులు తెరాసలో చేరారు. ఏకంగా తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకర్ రావే గులాబీ కండువా కప్పుకున్నారు. తాను పోతూ పోతూ రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌ను కూడా తనతో బాటు తీసుకు వెళ్ళారు.

ఆ సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతారన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మిగిలినా వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమని, తమతో ఈ మేరకు చర్చిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బతికి ఉండదని, మిగిలిన ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీకి చెందిన మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎర్రబెల్లి అన్నారు. హైదరాబాదు నుంచి కెసిఆర్ తలసాని శ్రీనివాస యాదవ్‌ను తీసుకుని ఏకంగా ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి ఆ వలసలు సాగుతూనే ఉన్నాయి. నిజానికి, తెరాసకు మరో శాసనసభ్యుడు టిడిపి నుంచి వస్తే సరిపోతుంది. అది పార్టీ ఫిరాయించిన టిడిపి శాసనసభ్యులపై వేటు పడకుండా కాపాడుతుంది. శాసనసభలో టిడిపిని చీల్చి తెరాసలో చేర్చడానికికి పది సంఖ్య సరిపోతుంది. పార్టీని చీల్చి, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించడానికి మూడింట రెండు వంతుల శాసనసభ్యులు చీలితే చాలు. టిడిపి నుంచి చీలిన వర్గం ఏకంగా పార్టీని తెరాసలో విలీనం చేయడానికి వీలవుతుంది. దానికోసమే కెసిఆర్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు.మొత్తానికి తెలంగాణాలో టీ.టీడీపీని సమూలంగా తుడిచి పెట్టే వ్యూహం లో భాగంగా కేసీఆర్ వేసే ఒక్కో అడుగూ టీడీపీ అధినేత చంద్రబాబు కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నాయి…

ఇక ఈ వలసల పై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడినంత మాత్రాన కేడర్ ఎటూ పోదని టీడీపీ జాతీయ పార్టీగా తన సత్తా చూపించగలదనీ అన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని, అందుకే సీఎం కేసీఆర్ తమ పార్టీని, నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా పార్టీది టెస్ట్ మ్యాచ్‌ల చరిత్ర. ఆ అనుభవం ఎక్కడికీ పోదు. మా పార్టీది టీ20లు ఆడే పరిస్థితి కాదు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడతామని తెలిసినా పోటీ చేశాం. అయినా గతంలో కంటే టీడీపీకి లక్షన్నర ఓట్లు అదనంగా వచ్చాయి. గెలుపోటములు, సర్వేలు, లెక్కలు వేసుకుని యుద్ధంచేయడం రాజకీయం కాదు’’ అంటూ పంచ్ డైలాగులు కూడా చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కుంగిపోబోమని, యువ రక్తంతో 2019 ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని వెళ్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి లేదని, అవన్నీ అమలవాలంటే రూ.60 వేల కోట్లు కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లోపు టీఆర్‌ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోతుందని అప్పుడు మళ్ళీ టీడీపీనే అధికారం లోకి వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసారు.

(Visited 159 times, 15 visits today)