Home / Inspiring Stories / చెట్ల నుండి కరెంటు తయారు చేస్తూ, చాలా గ్రామాల్లో వెలుగు నింపుతున్నారు.

చెట్ల నుండి కరెంటు తయారు చేస్తూ, చాలా గ్రామాల్లో వెలుగు నింపుతున్నారు.

Author:

మనిషి అవసరం కొత్త ఆవిష్కరణలకు పురుడు పోస్తుంది… ఒకరి కష్టం మరికొందరి సమస్యలను తీర్చే కొత్త ఆలోచనకు దారి తీస్తుంది.. ఇన్ని శతాబ్దాల మానవ పరిణామ క్రమం లో ఒక్కో ఇబ్బందిని అధిగమించి పనులను సులభతరం చేసుకోవటానికి చక్రం దగ్గరినుంచీ ఉపగ్రహం వరకూ మనిషి ఒక్కొక్క మెట్టూ తన కష్టాలు, అవసరాల నిమిత్తం సృష్టించినవే.. ఇప్పుడు కూడా ఒక జంట ఉత్తరాఖండ్ లోని చిన్న చిన్న పల్లెల్లో అడవులు తగలబడ్డప్పుడు జరిగే ఆస్తిన నష్టాన్ని నివారించటానికి మొదలు పెట్టిన ప్రయత్నం ఒక కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. కొన్ని వందల కుటుంబాలలో వెలుగులు నింపింది. దశాబ్దాల కాలంగా చీకట్లోనే మగ్గిపోతున్న అక్కడి వారి జీవితాల కరెంటు కష్టాలకూ ఒక మార్గం చూపించింది. చాలినంత విద్యుత్తును ఉత్పత్తి చేసే పరిస్థితులు మనదేశంలో లేవు. ఇప్పటికీ దేశంలోని లక్షా 25 వేల గ్రామాల్లోని 40 కోట్ల మందికి కరెంటు లేదు. అందుకే అక్కడ ఏదైతే ప్రమాద కారకమో దాన్నుంచే విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నారు. ఎలా అంటే…

హిమాలయ సానువుల్లో ఉన్న ఉత్తరాఖండ్ అత్యధికంగా అటవీ ప్రాంతంతో నిండి ఉంటుంది. పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు. కరెంటు అనే మాట తప్ప కనీసం ఒక బల్బు వెలుతురుని కూడా వాళ్ళెప్పుడూ చూడలేదు. అయితే వీరి ప్రధాన సమస్య కరెంటు మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంది. అదే వేసవిలో అడవులు తగలబడటం. హిమాలయాల్లో అధికంగా ఉండే పైన్ వృక్షాల ఆకులు విపరీతంగా రాలి ఎండిపోయి ఉంటాయి. ఒక చిన్న నిప్పు రవ్వ తాకినా ఇక అడవులు తగలబడిపోతాయి. ఫలితం అక్కడ ఉన్న గిరిజనుల ఇళ్ళూ, ఆస్తులూ కాలిపోవటమే కాదు, అడవినుంచి వారు సేకరించే మూలికలూ, ఇతర అటవీ ఉత్పత్తులనిచ్చే చెట్లూ పూర్తిగా తగలబడిపోతూంటాయి.

Generating elecricity from pine tree leaves

న్యూయార్క్ లో ఉన్న కార్పోరేట్ జీవితాన్ని వదిలి హిమాలయాలకు దగ్గరగా ప్రశాంత జీవితం గడుపుదామని వచ్చిన రజనీష్ జైన్, ఆయన భార్య రష్మి భారతి ఉత్తరాఖండ్‌లోని పైన్ చెట్ల అందాలను చూసి మురిసిపోయారు. కానీ, అవే పైన్ చెట్లు స్థానికుల పాలిట మృత్యుపాశాలవడాన్ని కూడా గమనించారు. అడవుల్లో సహజంగా పుట్టే అగ్నికి పైన్ చెట్ల ఆకులు ఆజ్యం పోశాయి. ఆ అగ్నికీలలు అక్కడి వారి విలువైన ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. మరోవైపు అవే గ్రామాలు అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో పడుతున్న ఇబ్బందులను కూడా రజనీష్ దంపతులు దగ్గర నుంచి చూశారు. ఎలాగైనా వారి కష్టాలను దూరం చేయాలనుకున్నారు. ఇక తమ ముందు “కెరీర్” ని కూడా ఇక్కడే వెతుక్కోవాలనుకున్నారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన రజనీష్‌కు గతంలో పునరుత్పాదక ఇంధనం, సమగ్ర గ్రామీణాభివృద్ధి లాంటి ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవమే ‘అవని’ సంస్థ స్థాపనకు దారితీసింది.

కొత్తగా చేయాలన్న ఒక ఆలోచనే రెండు సమస్యలకు పరిష్కారాన్ని చూపించింది. చెట్ల నుంచి రాలిపడుతూ అడవిలో అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్న పైన్ వృక్షాల ఆకులతోనే ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన ఆ జంటకు కలిగింది. ‘గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా పైన్ నీడిల్స్‌తోనే విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీని సృష్టించాం. గ్యాసిఫికేషన్‌ జీవసంబంద వ్యర్థాలను కొంతవరకూ కుళ్ళ బెట్టి, కొన్ని ప్రత్యేక పద్దతులలో మండించి జీవ ఇంథనాన్ని తయారు చేసే విధానం. పైన్ చెట్ల ఇది గతంలో ఎవరూ చేయని ప్రయోగం. ఇది మాటలకందని అద్భుత ఆవిష్కరణ. మేం దీన్ని సాధించగలమని ఎవరూ ఊహించలేదు’ అని తమ ఆవిష్కరణ గురించి గర్వంగా చెబుతున్నారు రజనీష్. మొదట 9 కిలోవాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. అది విజయవంతమైంది. ఆ వెంటనే 120 కిలోవాట్ల కమర్షియల్ పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. ఇది ఎన్నో విధాలుగా సత్ఫలితాలను ఇచ్చింది. ‘కర్బన ఉద్గారాలను చాలా వరకు తగ్గించగలిగాం. మొదటగా స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంలో విజయవంతమయ్యాం. ఇక పైన్ నీడిల్స్‌ను ఎప్పటికప్పుడు సేకరించి అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించగలిగాం. కిరోసిన్, డీజిల్లాంటి ఖరీదైన, కాలుష్య కారకాలైన ఇంధన వాడకాన్ని తగ్గించగలిగాం’ అని అంటారు రజనీష్.

ఈ ఆవిష్కరణ వల్ల అగ్ని ప్రమాదాలు తగ్గి అక్కడున్న 7500 మందికి మేలు జరిగింది. అంతే కాదు వీరు కొన్ని కుటీర పరిశ్రమల ద్వారా ఇక్కడి ప్రజల ఆదాయ శాతాన్నీ పెంచగలిగారు. స్థానికుల సంపాదన కూడా భారీగా పెరిగింది. వారు నెలకు 20 నుంచి 25 వేలకు వరకు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతిష్ఠాత్మక NREGA లాంటి పథకాల ద్వారా కూడా సాధ్యం కాని మొత్తం ఇది. ఇక ‘గ్యాసిఫికేషన్’ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, తర్వాత మిగిలిపోయిన బొగ్గును కూడా వంట కోసం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అక్కడి గ్రామస్థులు వంట చెరుకు కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ బొగ్గును సంస్థ వాళ్లే ఇంటింటికీ తిరిగి సరఫరా చేస్తున్నారు. అవని సంస్థ ఆవిష్కరణకు మెచ్చిన అక్యుమెన్ భారీగా నిధులను సమకూర్చింది. వీటి ద్వారా ఒక్కోటి 120 కిలోవాట్ల సామర్థ్యం గల మరో 20 పవర్ ప్లాంట్లను ‘అవని’ ఏర్పాటు చేస్తోంది. రెండు సమస్యలకు తమ అద్భుత ఆవిష్కరణతో ఒకే పరిష్కారాన్ని కనుగొన్న రజనీష్ దంపతులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.  ఈ సంస్థ గురించి మరిన్ని వివరాల కోసం వారి వెబ్‌సైట్ చూడండి.

Must Read: 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క నెలలో చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు.

(Visited 525 times, 28 visits today)