Home / సాహిత్యం / గిజిగాడి గూటిలా అందంగా అల్లిన కవిత్వం -పువ్వు,ముల్లూ,ఒక కవితా వస్తువూ..!

గిజిగాడి గూటిలా అందంగా అల్లిన కవిత్వం -పువ్వు,ముల్లూ,ఒక కవితా వస్తువూ..!

Author:

Rohini Uyyala

I love to rise in a summer morn,
When the birds sing on every tree;
The distant huntsman winds his horn,
And the skylark sings with me:
O what sweet company!

But to go to school in a summer morn, –
O it drives all joy away!
Under a cruel eye outworn,
The little ones spend the day
In sighing and dismay………..
—William Bleak

పిల్లలేం కోరుకుంటారు? పొద్దున్నే కిచ కిచ మనే పిచ్చుక అరుపుకోసం బాల్కనీ లోకి పరుగులెత్తి.. బయటనుంచి వినిపించీ కూరలమ్మే మనిషి గొంతును అనుకరిస్తూ… తన కళ్ళ చుట్టూ తిరిగే ఒక చిన్నారి పిల్లిపిల్లని హత్తుకోవాలనుకుంటారు…. అమ్మ వొడిలో కూచుని కొన్ని గారాలు పోతూ మృదువైన చేతులతో అమ్మని హత్తుకొని ఇంకొన్ని క్షణాల పాటు అలా ఊరికే ఉండిపోవటం తప్ప పెద్దగా పిల్లలు మననుంచేం ఆశిస్తారు? కానీ…! జీవితం రంగులు మార్చుకున్నాక కాస్తనల్లని రంగు పిల్లలపై వొలికిపోయింది. మూడేళ్ళకే వాళ్ళని నాలుగు గోడల మధ్య ఉండే ఒక భావి నిపుణున్ని తయారు చేసే ఒక కర్మాగారం లో పడేస్తున్నాం. వాళ్ళు మాట్లాడాలనుకున్న పిచ్చుకలనీ,హత్తుకోవాలనుకున్న పట్టుకుచ్చుతోకల పిల్లి పిల్లల శరీర నమూనాలని వారికి చూపిస్తున్నం… వాసన లేని పువ్వులనూ,ఆకలి తీర్చని పళ్ళ పేర్లనూ బట్టీయం వేయిస్తున్నాం…. మనకూ ఒక బాల్యం ఉంది కొన్ని పసి చేష్టల,కొన్ని అతి సున్నిత ఆలోచనల,అందమైన రోజులున్నాయ్ అలా ఒక్కసారి ఆ పసితనం లోకి జారిపోతే…!? రోహిణి ఉయ్యాల గారి మాటల్లో చెప్పాలంటే

మదిలో ఏదో ఒకమూల బాల్యం ఊయలలూగుతూనే ఉంటుంది
అచ్చు ఆ తుమ్మచెట్టుకు వేళ్ళాడే గిజిగాడి గూటిలా…
పసుపుపచ్చని మైదానమౌతుంది మనసప్పుడు
రాలిపోయిన తుమ్మపువ్వులన్నీ పరుచుకుని…
గజ్జెలసవ్వడిలా మృదువుగా ధ్వనించే తుమ్మకాయల గలగలలు చెవులకు సోకుతూనే ఉంటయ్
లీలగా రణగొణధ్వనుల మధ్య..

వృత్తి రీత్యా ఉపాద్యాయురాలైన ఉయ్యాల రోహిణీ కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో గజల్ ప్రేమికులందరికీ పరిచితమే.. సంఖ్యా పరంగా ఇప్పటికీ తక్కువ సంఖ్యలో నే ఉన్న గజల్ కవయిత్రులలో రోహిణీ ప్రత్యేకంగానే కనిపిస్తారు. కవిసంగమంలో రాస్తున్న కవయిత్రులలోనూ ఈ కవయిత్రిది ప్రత్యేక గోంతుకే. రాసే శైలిని బట్టీ,భావ ప్రకటనా వైవిద్యతను బట్టీ కవితల్లోనూ గజల్ లో కనిపించే అతి సున్నిత భావాలని కలిగిగి ఉండే రోహిణీ కవిత్వం త్వరలో పుస్తకం గా రావొచ్చు,లేదూ ఒక గజల్ గా ఒక నిశ్శబ్ద సాయంత్రం మీ చెవులను తాకొచ్చూ…. ఈ రెండూ జరిగే రోజు త్వరలోనే ఉందనిపిస్తోంది..

కుదురుగ నిలిచిన కొమ్మలనెక్కీ ఊయలలూపును
తరువుల తోటీ గాలులు ఆడే సరసము చూడూ…

ప్రకృతితో మమేకమైన కొన్ని భావాలు అలా ఒక కవిత్వమై నిలుచున్నప్పుడు ఒక వేదనలో కూడా అదే సున్నితత్వమూ లీలగా కదలాడుతూ,కవిత్వమై చలిస్తూ..చరిస్తూ ఒక మారుమూల పల్లె తాలూకు జీవితాన్నీ,మనిషిలోపల కుహనా విలువల వెనుక ఉన్న నిర్మాలిన్యత్వాన్ని ఒకే సారి స్పృషించగల నేర్పు రోహిణి గారికెలా పట్టు బడిందో గానీ… కార్పోరేట్ జీవితాల్లో నలిగే బాల్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఒక నోస్టాల్జియా భావనతో కూడిన పదాల్తో రాసిన ఈ కవిత ఒక సారి చదివి చూడండి…..

నేటి బాల్యానికివ్వడానికేమ్మిగిలాయని
ఉదయాన్నే ఇనుపశిలువను భుజానికి తగిలించి
ముక్కుపచ్చలారని బంగారుతల్లుల్ని/కొండల్ని భవిష్యత్తనే కొండచిలువకి అల్పాహారంగా ఇవ్వడం తప్ప…!

చివరి పంక్తులు అలా ఒక్క సారి మనసుని గుచ్చుకొని మనలని కొద్దిసేపు ఆలోచనలో పడేస్తాయి….

!! ఏమివ్వగలం !!

కొన్ని జ్ఞాపకాలెప్పుడూ పాతబడవ్…
సరికదా
మరింత చిక్కబడుతుంటయ్…
చింతలన్నీ కక్షగట్టి
ఒక్కుమ్మడిగా పులిలా
పంజా విసిరినా…

మదిలో ఏదో ఒకమూల బాల్యం ఊయలలూగుతూనే ఉంటుంది
అచ్చు ఆ తుమ్మచెట్టుకు వేళ్ళాడే గిజిగాడి గూటిలా…
పసుపుపచ్చని మైదానమౌతుంది మనసప్పుడు
రాలిపోయిన తుమ్మపువ్వులన్నీ పరుచుకుని…
గజ్జెలసవ్వడిలా మృదువుగా ధ్వనించే తుమ్మకాయల గలగలలు చెవులకు సోకుతూనే ఉంటయ్ లీలగా రణగొణధ్వనుల మధ్య…

సీమచింత తోపుల్లో వనవిహారం
ఆకలిదప్పులెరగని బాల్యానిది
చెరుకుదంట్ల పచ్చివాసన
ముక్కుపుటల్ని తాకుతూనే ఉంటుంది
ఏదో ఒక అలసటలో గోడకలా జారగిలబడి కూర్చున్నప్పుడో
ఒక నిస్సత్తువ వేరే లోకానికి విసిరేసినప్పుడో…

ఆ ఆనందాల నదిలో ఓలలాడుతూ మనసలా విహరిస్తుండగనే
కర్కశంగా గుచ్చేస్తుంది వాస్తవం తుమ్మముల్లై…
నేటి బాల్యానికివ్వడానికేమ్మిగిలాయని
ఉదయాన్నే ఇనుపశిలువను భుజానికి తగిలించి
ముక్కుపచ్చలారని బంగారుతల్లుల్ని/కొండల్ని భవిష్యత్తనే కొండచిలువకి అల్పాహారంగా ఇవ్వడం తప్ప…!!

–రోహిణి ఉయ్యాల.

(Visited 361 times, 97 visits today)