Home / Inspiring Stories / ఆమె అపశకునం కాదు అని చెప్పిన ఒక మనిషి చేసిన పని కొందరిలోనైనా మార్పు తెస్తుందా.

ఆమె అపశకునం కాదు అని చెప్పిన ఒక మనిషి చేసిన పని కొందరిలోనైనా మార్పు తెస్తుందా.

Author:

widows

భర్త చనిపోవటం ఆమె జీవితంలోని ఒక విషాదం ఐతే. రంగుబట్టలకూ,స్త్రీ సహజమైన అలంకరణలకూ,ఆనంద సంఘటనలకూ దూరం కావటం మరో పెద్ద విషాదం. భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా పేరుకు పోయిన మూడ ఆచారం. ఒక స్త్రీ తన భర్తను కోల్పోయిన వెంటనే ఆమె అపశకునంగా మారిపోవటం. అందరూ సంతోషంగా ఉండే సందర్భాలకు వితంతువైన కారణంగా ఆమె రాకూడదు అంటూ విధించిన ఒక ఆచార నిబంధన ఒక స్త్రీ ఆత్మ విశ్వాసం మీదా,ఆమె ఆత్మ గౌరవం మీదా ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో మనకర్థం కాదు. ఐతే ఈ మూడాచారాన్ని తనదైన పద్దతిలో ఖండించాడొక వ్యక్తి. ఒక మనిషి జీవితం నుంచి వెళ్ళిపోవటం అనేది ఒక విషాదమే తప్ప దాని ద్వారా ఒక మనిషే నిషేదానికి గురవ్వటాన్ని వ్యతిరేకిస్తూ. ఆ దురాచారాన్ని పారదోలటానికి తమ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజెప్పటానికి. తన కొడుకు పెళ్ళికి చుట్టు పక్కల గ్రామాలలోని 18000 మంది వితంతువులని ఆహ్వానించాడు. వారి దీవెనలతోనే తన కొడుకు వివాహం జరిపించాడు….

గుజరాత్ లోని మెహ్సన కు చెందిన జితేంద్ర పటేల్ తన కొడుకు రవీంద్రపటేల్ పెళ్ళి నిశ్చయం చేసాడు. ఆడపెళ్ళి వారికి కూడా తన నిర్ణయాన్ని అదే రోజు చెప్పేసాడు. వారూ ఒప్పుకోవటంతో మొత్తం చుట్టు పక్కల అయిదు జిల్లాలకు చెందిన వితంతువులను పిలిచేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. భనస్కంథ, మెహ్సన, శబర్కంథ, ఫతన్,ఆరవల్లి జిలాలకు చెందిన మొత్తం 18000 మంది వితంతువులు హాజరయ్యారు. వీరిలో వృద్దుల నుంచీ 30 ఏళ్ళ లోపు ఉన్నవారి వరకూ ఉన్నారు.పెళ్ళికి వచ్చి ఆశీర్వదించటంతో ఐపోలేదు వచ్చిన వారందరికీ ఒక చీరా,దుప్పటీ, పెరటిలో నాటుతాం అన్న మాట తీసుకొని మరీ ఒక మొక్కా ఇచ్చారు. అంతే కాదు మరీ పేదరికంలో ఉన్న 500 మంది వితంతువులను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ పాలిచ్చే ఒక ఆవుని కూడా ఇస్తానని ప్రమాణం చేసాడు జితేంద్ర పటేల్.

Widows 1

“సమాజం వెలివేసిన ఈ స్త్రీలందరి దీవెనలూ ఎవరికీ చెడు కలిగించవని నిరూపించటానికే కాదు. తన భర్తను కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన, బతుకు దెరువు కోల్పోయిన వారిలో ఆత్మవిస్వాసాన్ని పెంచటానికి కూడా ఈ పని చేసాను. వారి జీవితం లోని ధు:ఖాన్ని అర్థం చేసుకోవాలే తప్ప వారిని అపశకునానికి చిహ్నంగా చూడకూడదని చెప్పటానికే ఈ విధంగా చేసాను. ఈ 18000 మంది దీవెనలూ నా కుమారుడికి ఎంతో శుభం కలిగిస్తాయని నేను నమ్ముతున్నాను.” అని టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు జితేంద్ర పటేల్.55ఏళ్ళ వితంతువైన హంసా ఠాకూర్ అనే వితంతువు తాను తన భర్తను కోల్పోయిన దగ్గరి నుంచీ గౌరవంగా చూడబడిన మొదటి శుభకార్యం ఇదేనని సంతోషంగా చెప్పింది.

ఆధునిక సమాజంలో కూడా ఇప్పటికి భర్తను కోల్పోయిన స్త్రీని అపశకునంగా భావించటం అనేది ఎంతో ధారుణమైన విషయం. అయినా ఇప్పటికి అది కొనసాగుతూ ఉండటం అంటే ఇనకా మనం ఎదగలేదనే అర్థం. ఇప్పటికైనా జితేంద్ర పటేల్ వేసిన ఈ ఒక్క అడుగైనా మనుషుల్లో కొంతైనా మార్పుతెస్తుందేమో చూడాలి.

(Visited 933 times, 19 visits today)