Home / Inspiring Stories / కొడుకు ప్రాణాలు తీసిన రోడ్లమీద అతను పగ తీర్చుకుంటున్నాడు

కొడుకు ప్రాణాలు తీసిన రోడ్లమీద అతను పగ తీర్చుకుంటున్నాడు

Author:

Dada Rao 1

దాదారావు బిల్హోరే 40 ఏళ్ళ ముంబై వాసి రోడ్డు మీద వెళూతున్నప్పుడు ఎక్కడైనా రోడ్డుపాడై గుంత కనిపిస్తే చాలు వాటిని చదును చేసే పనిలో పడతాడు. ఆ గుంత సమానం అయ్యే వరకూ అతను వేరే పని చేయడు. రోజూ పాడైన రోడ్లను చూస్తూనే వెళ్ళిపోయే మనకు దాదారావ్ చేసే పని వింతగానే అనిపిస్తుంది.ఎందుకంటే అలాంటి ఓ చిన్న గుంత కారణంగా 16 ఏండ్ల తన కుమారుడు ప్రకాశ్ మృత్యువాత పడటమే. జోగేష్వరి-విఖ్రొలి లింక్ రోడ్ వేసిన కాంట్రాక్ట్ కంపెనీ ఉధ్యోగుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన పుత్రశోకం మరొకరికి కలుగొద్దనే ఉద్దేశంతో రోడ్డు మీద గుంతలు, గడ్డలు కనిపిస్తే.. ఇసుక, మట్టి, చిన్న రాళ్లతో వాటిని నింపి రోడ్డుకు సమానంగా చదును చేస్తాడు.. మరో గుంత ఎక్కడుందా అని వెతుక్కొంటూ ముందుకెళ్తుంటాడు. గుంతలు నింపడం దినచర్యలో ఓ భాగం చేసుకొన్న దాదారావు ముంబై నగరంలో పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

2015 జూలై 28న దాదారావు కుమారుడు ప్రకాశ్ ఓ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అదే దారిలో వస్తుండగా, వర్షం నీళ్లతో నిండిన గుంతలో ముందు చక్రం పడటం తో ఆ జర్క్ కి ఎగిరి రోడ్డు మీద పడ్ద ప్రకాశ్ తల నేలకు బలంగా కొట్టుకుంది.అతని ముక్కూ ,చెవుల నుంచి రక్తం వచ్చింది. వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళినా ప్రయోజనం లేక పోయింది. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కూరగాయలమ్ముకునే తాను ఎన్నో ఆశలుపెట్టుకున్న కొడుకు ఎవరో,ఎప్పుడో చేసిన నిర్లక్ష్యానికి బలికావటం ఎందుకు? అసలు ఎవరో తన డ్యూటీ సరిగా చేయనప్పుడు తానెందుకు శిక్ష అనుభవించాలి? అనుకున్నాడు. ఇక అప్పటి నుంచీ గుంతలున్న రోడ్ల మీద పగబట్టాడు. ఎక్కడ చిన్న గుంత కనిపించినా దాన్ని చదును చేయటం ప్రారంబించాడు.

Heartbroken Father Covering Potholes After He Lost His Son

రోడ్డును నాసిరకంగా నిర్మించిన కంపెనీ మీద దాదారావు ఫిర్యాదు చేయడంతో ఆ కంపెనీ నిర్వాహకులపై సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం కారణంగా మరొకరి మరణానికి కారణం అవటం),338 (మరొకరి తీవ్రగాయాలకు కారకులు కావటం) కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకూ చార్జ్ షీట్ దాఖలు చేయనే లేదు. నిందితులు మాత్రం బెయిలు మీద హాయిగానే బయటకు వచ్చేసారు. దాదారావ్ ఈ విషయం ఎప్పుడు అడిగినా వచ్చే వారం లో అనే సమాధానమే వస్తుంది…

“ఈ కేసులో రెండు వైపులా నిర్లక్ష్యం తోనే ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ లో వచ్చినప్పుడే కదా అంత పెద్ద ప్రమాదం జరిగింది..! అధికారినీ,ఒక టాటా ఇంజినీరునీ అరెస్ట్ చేసాం.కానీ వారు అప్లై చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ ద్వారా వారు బయటకు వచ్చారు. చార్జ్ షీట్ ఈవారం లో సమర్పించనున్నాం” అని టైంస్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ అన్నారు, ఆరే ప్రాంత పోలిస్ స్టేషన్ లోని సీనియర్ ఇన్ స్పెచ్టర్ విలాస్ చవాన్

అయితే కోర్టు తీర్పుకోసం ఎదురుచూస్తున్న దాదారావుకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు.. కానీ.. మరో కుటుంబానికి అన్యాయం జరుగకుండా తన పని తాను చేస్తూ పోతూనే ఉన్నాడు.

(Visited 2,262 times, 39 visits today)