Home / Inspiring Stories / బహిరంగంగా డాన్ దావూద్ ఇబ్రహీం కారు దహనం.

బహిరంగంగా డాన్ దావూద్ ఇబ్రహీం కారు దహనం.

Author:

Dawood_car

దావూద్ ఇబ్రహీం ముంబైనే కాదు ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న అండర్ వరల్డ్ డాన్.మహారాష్ట్రలోని రత్నగిరిలో పుట్టిన దావూద్ అంచెలంచెలుగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇంతటి నేరగాడు దావూద్ తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యంలో ఇతని పేరు మారుమోగింది. అప్పటికి అక్కడ డాన్‌గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద ఇతడు సోడాసీసాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్ , వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్‌లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లినవాడు దావూద్.

1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత ఇతను మనదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు. అప్పటి నుండి డి(దావూద్) కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ ఖైదా, లష్కరే తోయిబ వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం కూడా అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘానిస్థాన్ నుంచి అల్‌ ఖైదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు. కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి మనదేశం ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అయితే దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్ ఏనాడూ అంగీకరించలేదు. కరాచీ కేంద్రం గా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్‌ లతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లలో కూడా ఇతడి కార్యకలాపాలు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. మనదేశం లో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది.

ఇంతకూ ఇప్పుడు మళ్ళీ దావూద్ పేరు ఎందుకు చర్చల్లోకి వచ్చిందంటే…!? ఈమధ్యనే ఇతని తాలూకూకు హోటల్ నీ పాత కారునీ వేలం వేసారు. దావూద్ కారును బహిరంగంగా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య దహనం చేశారు, కారు దహనానికి గజియాబాద్‌లోని ఇందిరాపూర్ వేదికైంది. డిసెంబర్ 9న జరిగిన వేలంలో దావూద్ హ్యూందాయ్ యాక్సెంట్ కారు(ఎంహెచ్ 04-ఏఎక్స్ 3676)ను అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి రూ. 32 వేలకు దక్కించుకున్న విషయం విదితమే.

ముందుగా దావూద్ కారుని అంబులెన్స్ గా మార్చాలనుకున్నారట. ఐతే ఈ నేపథ్యంలో దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో వారికి తగిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో దాన్ని బహిరంగంగా దహనం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో మందిర్ మార్గ్ పోలీసులకు చక్రపాణి ఫిర్యాదు చేశారు. దావూద్ దుశ్చర్యలకు, ఉగ్రవాదానికి దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చక్రపాణి తెలిపారు. దావూద్ కారు దహనం చేస్తున్న సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దావూద్ ఇబ్రహీం అనుచరులు ఇప్పటికే బెదిరింపులు చెయ్యడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

(Visited 265 times, 29 visits today)