Home / Inspiring Stories / అబూదాబిలో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులు.

అబూదాబిలో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులు.

Author:

Air India stops Indian Students at Airports

గత కొద్దిరోజులుగా కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న ప్రచారం ఆ విద్యార్థులని అయోమయంలో పడేసింది. రెండు రోజులుగా దేశం కాని దేశం లో ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో ఐ20 పొంది తర్వాత వీసా లభించిన దాదాపు 20 మంది తెలుగు విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబి విమానాశ్రయంలో అవస్థలు పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సోమవారం హైదరాబాద్ నుంచి అబుదాబి మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన వారే ఉన్నారు.

గత పది రోజులుగా కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు వెళ్తున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గతవారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు.దాంతో కాస్త ఎక్కువ ఉత్సాహం చూపించిన రెండు రోజుల కిందట ఎయిర్ ఇండియా అధికారులు ఇంకో అడుగు ముందుకువేసి మరో 19 మంది విద్యార్థులకు అసలు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచే వెనక్కి తిప్పిపంపారు. అదేమిటని అడిగినవాళ్ళకి మాత్రం తమకున్న సమాచారం మేరకు అనుమతించమనీ, ఒకవేళ ఇక్కడ అనుమతించినా అనుమతించినా అమెరికా నుంచి తిరిగి పంపేస్తారని అనటం తప్ప అసలు కారణాలేమిటో చెప్పకుండానే ముఖం చాటేసారు.

ఈ నేపథ్యం లోనే సోమవారం ఎతిహాద్ ఎయిర్ వేస్‌ విమానంలో బయలుదేరిన విద్యార్థులను అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ విమానంలో వెళ్ళాల్సి ఉండగా అసలు వీరిని బోర్డింగ్‌కు అనుమతించలేదు. ఎందుకని అడిగితే తమకున్న ఆదేశాల మేరకు అనుమతించడం కుదరదు అనటం తప్ప అంతకుమించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది.కనీసం వారికి సరైన సమాచారం ఇచ్చేవాళ్లు కూడా కరవయ్యారు. వారి గురించి సరైన సమాచారం లేక ఎలా ఉన్నారో కూడా అర్థం కాక వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విమానాల్లో సీట్ల అందుబాటును బట్టి విద్యార్థులను తిరిగి భారత్ కి చేరవేస్తారని, అంత వరకు వేచి ఉండాల్సిందేనని అధికారులు విద్యార్థులకు చెబుతున్నట్లు తెలిసింది.

ఐతే బ్లాక్ లిస్టులో పెట్టబడ్డాయన్న యూనివర్సిటీలుమాత్రం తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. అదొక ప్రచారంగా కొట్టిపారేశాయి. ఇమిగ్రేషన్ అధికారులకు వీసా, ఐ20, అడ్మిషన్ ప్యాకేజీ, ట్రాన్స్‌స్క్రిప్ట్స్ వంటి సరైన పత్రాలను చూపిస్తే ఎలాంటి సమస్య తలెత్తదని చెబుతున్నాయి. మెయిల్స్ ద్వారా సంప్రదించిన పలువురు విద్యార్థులకు ఆ రెండు వర్సిటీలు తమ వెబ్‌సైట్‌లో ఈ వివరాలిచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు, తమ వర్సిటీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని చెబుతున్నారు అంటూ ఒక దిన పత్రిక తన కథనం లో పేర్కొంది. తమకు ఇటీవలే సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని, బ్లాక్ లిస్ట్‌లో పెడితే పరీక్షలు నిర్వహించటానికి కుదరదు అయినా పరీక్షలు జరిగాయి అంటే బ్లాక్ లిస్ట్‌ లోనే లేనట్టే కద అని ఎన్‌పీయూలో ఎంఎస్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చెప్పారు అని ఆ పత్రిక ఇచ్చిన సమాచారం. ఈ యూనివర్సిటీల్లో గత సెమిస్టర్ కాలంలో 4,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

ఈ మధ్య జరిగిన ప్యారిస్ దాడుల నేపథ్యంలో కాలిఫోర్నియా అంతటా సోదాలు ముమ్మరం చేసినట్టు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానంగా వర్సిటీల్లో చదువుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం కూడా అక్కడ విదేశీ విద్యార్థుల మీద పెరిగిన సోదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. ఈ క్రిస్టమస్ వేడుకలు పూర్తయితే తప్ప ఈ విషయమై ఎటువంటి స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం లేదు.

(Visited 1,108 times, 14 visits today)