EDITION English తెలుగు
Home / Latest Alajadi / ఆనాధలా పెరిగింది, అమెరికాలో కంపెనీ పెట్టింది..! ఇప్పుడు వెయ్యి మందిని చదివిస్తుంది…!

ఆనాధలా పెరిగింది, అమెరికాలో కంపెనీ పెట్టింది..! ఇప్పుడు వెయ్యి మందిని చదివిస్తుంది…!

Author:

కన్న కూతురికి తిండి పెట్టలేక తండ్రి అనాథాశ్రమంలో చేర్పించాడు. ఫలితంగా అనాథాశ్రమంలో పెరగింది. పదవ తరగతి దాకా చదువుకుంది. పదహారేళ్ళ వయసులో ఆ తండ్రి వచ్చి ఆ అమ్మాయి కన్నా పదేళ్ళు పెద్ద వయసులో ఉన్న ఒకరికి ఇచ్చి వివాహం చేశాడు. రెండేళ్ళలో ఇద్దరు బిడ్డల తల్లి అయింది. కటిక పేదరికంలో మగ్గుతూ, కట్టుకున్న వాడికి, పిల్లలకూ తిండి పెట్టేందుకోసం ఎన్నో ఉద్యోగాల ప్రయత్నం చేసి విఫలమైనా… జ్యోతి రెడ్డి ఓడిపోలేదు చివరకు రోజుకు ఐదు రూపాయల కూలీకి పొలాల్లో పని చేసింది. ఈ అన్ని పరిణామాలూ ఆ అమ్మాయిని నిరాశ, నిస్పృహలకు గురి చేయలేదు సరికదా మరింత దృఢంగా కష్టించేందుకు ప్రేరేపించాయి. ఫలితంగా ఇప్పుడు ఆమె అమెరికాలో కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)గా పని చేస్తున్నది. ఇదంతా ఎవరి గురించో అయితే మనకెందుకు? మన తెలుగు బిడ్డ జ్యోతి రెడ్డి కథ ఇది. తెలంగాణ ప్రభుత్వం కేజీ టు పిజీ పథకాన్ని ప్రారంభించటానికి సాగిస్తున్న కసరత్తు ఇంకా ఆ దశలోనే ఉంటే, జ్యోతి రెడ్డి మాత్రం ఐదారు సంవత్సరాల నుంచే దీన్ని తన సంస్థ ద్వారా అమలు చేస్తున్నారు.

Inspirational-Story-Of-Jyothi-Reddy

ఇక కథలోకి వెళ్దాం…
జ్యోతి రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మైలారం గ్రామం. ఆ ఊర్లో ఒక పేద కుటుంబం. ఐదుగురు పిల్లల్లో జ్యోతి రెడ్డి రెండవ సంతానం. చిన్న వయసులోనే తల్లి చనిపోవటంతో తండ్రి ఆలనా పాలనా చూడలేక అనాథాశ్రమంలో చేర్పించాడు . అక్కడ పదో తరగతి దాక చదువుకుంది. అయితే ఆ తర్వాత కటిక పేదరికం కారణంగా చదువుకు స్వస్తి చెప్పి పొలాల్లో కూలి పనికి కుదురుకుంది. పదహారు సంవత్సరాల వయసు రాగానే ఆమెకన్న పదేళ్ళ పెద్ద వయసున్న వాడికి బలవంతంగా కట్టబెట్టారు. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూడటానికి రోజుకు ఐదు రూపాయల కూలీకి చేరింది. 1988లో వయోజన విద్యా వలంటీర్ గా రూ.120 రూపాయల చిన్న ఉద్యోగం సంపాదించింది. దానితో పిల్లలకు ఒక పండో, కొన్ని పాలో కొనగలిగే దాన్నని ఆమె అంటారు. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ కార్యకర్తగా నెలకు రూ.200 వేతనానికి చేరారు. అయితే కుటుంబం నడవటానికి ఆ డబ్బు కూడా సరిపోక పోవటంతో రాత్రి వేళల్లో దుస్తులు కుట్టి మరి కాస్త సంపాదించేవారు.

Inspirational-Story-Of-Jyothi-Reddy-1-జ్యోతి రెడ్డి

భర్త వద్దన్నా చదువు వదలలేదు:
చదువు కొనసాగిస్తానంటే భర్త ఒప్పుకోలేదు. ఆయన, ఆమె గ్రామాన్ని విడిచిపెట్టి పిల్లలను తీసుకొని హన్మకొండ చేరుకున్నారు. టైప్ రైటింగ్ లో శిక్షణ పొంది చిత్రకళ కోచింగ్ కు వెళ్ళారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో పాటు తాను అనుకున్నది సాధించటం కోసం కుటుంబంతో, సమాజంతో అనునిత్యం పోరాటం జరపాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి 1994లో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ వర్సిటీ నుంచి 1997లో పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఫలితంగా ఆమెకు రూ.398 వేతనంతో స్పెషల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. బడికి వెళ్ళటానికి రోజూ రెండు గంటలు పట్టేది. ఈ మధ్య సమయంలో తన తోటి ప్రయాణికులకు చీరెలు అమ్మి మరి కాస్త అదనపు డబ్బు సంపాదించేవారు.

Inspirational-Story-Of-Jyothi-Reddy-జ్యోతి రెడ్డి

పత్రికా ప్రకటన చూసి…
అదే సమయంలో ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన ప్రకటన చూసిన జ్యోతి రెడ్డి జన శిక్షణ నిలయంలో లైబ్రేరియన్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు. చదువును కొనసాగించటం కోసం ప్రతి ఆదివారం ఓపెన్ స్కూల్ కు హాజరయ్యేవారు. 1992లో వరంగల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమీన్ పేటలో పద్దెనిమిది మాసాల కాల పరిమితితో కూడిన స్పెషల్ టీచర్ ఉద్యోగం తనకు దక్కిందని, చివరకు 1994లో రూ. 2,750 వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగం లభించిందని జ్యోతి రెడ్డి చెప్పారు. మరో నాలుగేళ్ళ తర్వాత అమెరికా నుంచి వచ్చిన తన భర్త బంధువును చూసి ఆశ్చర్య పోయింది. అతడి హుందా, దర్జా చూసి తానూ అలా కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా సాఫ్ట్ వేర్ నైపుణ్యం వైపు దృష్టి సారించారు. అందుకోసం హైదరాబాద్లోని విసిఎల్ కంప్యూటర్స్ లో చేరి సాఫ్ట్ వేర్ శిక్షణ పొందారు. అందుకోసం దీర్ఘకాలిక సెలవు పెట్టారు. 2000లో పాస్ పోర్టు, హెచ్1 వీసా లభించటంతో అమెరికా వెళ్ళారు. అక్కడ పని చేసే తన భర్త బంధువు సహాయంతో ఒక దుకాణంలో ఉద్యోగం సంపాదించి పన్నెండు గంటలకు 60 డాలర్ల వేతనం పొందారు. అమెరికా వెళ్ళేందుకు వీలుగా తన ఇద్దరు పిల్లలనూ ఒక మిషనరీ స్కూల్లో చేర్చేశారు. అమెరికాలో ఒక గుజరాతీ కుటుంబానికి పేయింగ్ గెస్ట్ గా ఉన్నారు.

Inspirational-Story-Of-Jyothi-Reddy-1-జ్యోతి రెడ్డి

అడుగడుగునా అడ్డంకులే…
అమెరికాలో ఆమె జీవితం అంత సులభంగా ఏమీ సాగలేదు. ఒక గ్యాస్ స్టేషన్లో కొంతకాలం, బేబీ సిట్టర్ గా ఇంకొంతకాలం, విడియో షాప్ లో సరకుల లోడింగ్, అన్లోడింగ్ పనిలో మరి కొంతకాలం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక సమీప బంధువు సహాయంతో సిఎస్ అమెరికా అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. మరో కంపెనీలో ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా ఎక్కువరోజులు నిలవలేదు. ఫలితంగా మళ్ళీ బేబీ సిట్టర్ గా పని చేయాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచీ ఆమె కలలు సాకారం కావటం మొదలైంది. అమెరికాలోని ఒక సంస్థ ఆమెను సాఫ్ట్ వేర్ నియామకాలు చూసుకునే పనికి నియమించింది. అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగి అతి త్వరలోనే జ్యోతి రెడ్డి స్వంత సంస్థని స్థాపించుకోగలిగారు. అప్పటికే ఆమె పిల్లలు కూడా అమెరికా వచ్చేశారు. LKG నుంచి పిజి దాకా 1,000 మందికి చదువు చెప్పాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేయటం ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ శిక్షణ ఆ సంస్థ ప్రత్యేకం. పుట్టిన రోజు నాడు వరంగల్లోని అనాథాశ్రమంలో ఆమె గడుపుతారు. మానసిక వికలాంగులైన పిల్లల ఆలనా పాలనా చూస్తారు. ఈ క్రమంలో తన ఆలోచనా ధోరణితో LEARN TO LIVE FOUNDATION ను స్థాపించారు. అది విజయవంతంగా నడుస్తోంది. ఇదీ మన తెలంగాణ బిడ్డ జ్యోతి రెడ్డి కథ. పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందగలరు. www.jyothireddy.com

సేకరణ: Ramesh Posu (Facebook).

(Visited 9,679 times, 45 visits today)