Home / Entertainment / జనతా గ్యారేజ్ రివ్యూ & రేటింగ్.

జనతా గ్యారేజ్ రివ్యూ & రేటింగ్.

Author:

జనతా గ్యారేజ్ రివ్యూ

సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి నుండి అందరి హీరో ల ఫ్యాన్స్ వరకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న సినిమా పేరు జనతా గ్యారేజ్ . చాలా రోజుల తర్వాత టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి రెండు సూపర్ హిట్ సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన హీరో ఎన్టీఆర్‌.  మిర్చి, శ్రీమంతుడు వంటి సినిమాలతో ఒక యాక్షన్ సినిమాకు సందేశంతో కూడిన కథను నడిపించడంలో దిట్ట అని నిరూపించుకున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం. అందాల ముద్దుగుమ్మలు సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది… మరి ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

కథ :

ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రాణం పోయిన సరే సాయం చేయాల్సిందే అన్నట్టుగా ఉండే సత్యం(మోహన్ లాల్) జనతా గ్యారేజ్ ని నడిపిస్తుంటాడు, జనతా గ్యారేజ్ కి సహాయం కోసం ఎవరు వచ్చిన తన వాళ్ళతో కలిసి ఎంతదూరం అయిన వెళ్లే మనస్త్వతం సత్యంది, ఈ క్రమంలో తన తమ్ముడిని అతని భార్యని కోల్పోతాడు, అయిన సరే జనాలకి సహాయం చేస్తూనే ఉంటాడు.

చిన్నప్పుడే తల్లితండ్రుల్ని కోల్పోయి తన మేనమామ ఇంట్లో ఉంటూ చెట్లని, ప్రకృతిని ప్రేమిస్తూ పెరిగిన ఆనంద్(ఎన్టీఆర్) పర్యావరణ పరిరక్షణే తన ధ్యేయంగా పని చేస్తుంటాడు, రీసెర్చ్ కోసం అని హైదరాబాద్ కి వచ్చి అనుకోకుండా జనతా గ్యారేజ్ లో చేరుతాడు,సత్యం కొడుకుతో ఆనంద్ ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? సత్యం- ఆనంద్ ల మధ్య సంబంధం ఏంటి.? అసలు ఆనంద్ జనతా గ్యారేజ్ లోకి ఎందుకు వచ్చాడు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

సమాజానికి ఉపయోగపడే అంశాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలని తీసాడు కొరటాల, ఆ రెండు సినిమాలలో చిన్న కథనే ఆహ్లాదకరమైన కథనాలతో, మంచి డైలాగ్స్ తో, మంచి కామెడీతో తీసిన కొరటాల జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయాడు, చాలా మంచి కథనే తీసుకున్న దానిని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు.

ఫస్ట్ హాఫ్ లో కొంచెం సేపు మోహన్ లాల్ ని, కొంచెం సేపు ఎన్టీఆర్ ని చూపిస్తూ ప్రేక్షకులు కొంచెం గందరగోళానికి గురవుతారు, ఎన్టీఆర్, సమంతల మధ్య ఉండే లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోదు, ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ కి తరువాత వచ్చే సీన్ కి సంబంధం ఉండదు, కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది, ఎన్టీఆర్ చేసే ఫైట్లు సూపర్ గా ఉంటాయి, కష్టాలలో ఉన్న ప్రజలకి సహాయం చేసే పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్ సూపర్బ్ అనాల్సిందే, ఇంటర్వెల్ కి ముందు ఎన్టీఆర్, మోహన్ లాల్ ని కలిసిన తరువాతే అసలు కథ మొదలవుతుంది.

సెకండ్ హాఫ్ సినిమా చాలా సీరియస్ గా ఉంటుంది, ఇంటర్వెల్ తరువాతే వచ్చే రాజీవ్ కనకాల సీన్ సినిమాకే హైలెట్, రాజీవ్ కనకాలని కాపాడే సమయంలో ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోతాయంతే, అప్పటి నుండి మోహన్ లాల్, ఎన్టీఆర్ పోటీపడి మరి నటిస్తుంటారు, ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా కష్టం అంత అద్భుతంగా నటించారు, మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఎన్టీఆర్ అదరగొట్టాడు, చివరికి వచ్చేసరికి రొటీన్ సినిమాలాగా అయిపోతుంది, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోవు, సినిమా ముగింపు కూడా బాలేదు.

విలన్స్ క్యారెక్టర్ లు పవర్ ఫుల్ గా లేకపోవడం, సినిమా మంచి మూడ్ లోకి వెళ్ళగానే దానిని చెడగొట్టే సీన్లు వెంటనే రావడం, చివరికి రొటీన్ సినిమా లాగానే క్లైమాక్స్ కి వెళ్లడం వల్ల జనతా గ్యారేజ్ సినిమా మిక్సడ్ ఫీలింగ్ ని ఇస్తుంది.

నటీనటుల పనితీరు:

ఎన్టీఆర్: ఈ తరం హీరోలలో నటన విషయంలో ఎన్టీఆర్ తరువాతే అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు, సినిమా మొత్తం ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు, ఇంటర్వెల్ కి ముందు, ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్లలో, ఇంకా ఎమోషనల్ సీన్లలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

మోహన్ లాల్: నటన విషయంలో మోహన్ లాల్ గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించడు అతని పాత్రే కనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలో జీవించాడు, మోహన్ లాల్ ఉన్నంత సేపు స్క్రీన్ నిండుగా అనిపిస్తది.

సమంత, నిత్యా మీనన్ పాత్రలకి అంతగా స్కోప్ లేదు, ఒక ఎమోషనల్ సీన్ లో సమంత సూపర్బ్ గా చేసింది, పోలీస్ ఆఫీసర్ గా సాయి కుమార్ చాలా బాగా నటించాడు, మిగిలిన వారు కూడా చాలా బాగా చేసారు.ఈ సినిమాలో విలన్ గా నటించిన మలయాళం నటుడు ఉన్ని ముకుందన్‌ తన పరిధి మేరకు బాగానే నటించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

మిర్చి, శ్రీమంతుడు లాంటి బంపర్ హిట్ లని ఇచ్చిన కొరటాల జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం కొంచెం తడబడ్డాడు, క్యారెక్టర్ లు ఎక్కువైపోవడంతో గందరగోళం అయిపోయింది, డైలాగ్స్ మాత్రం అద్భుతంగా రాసాడు, మంచి కథని ప్రేక్షకులకి నచ్చే విధంగా చెప్పటంలో 70 % మాత్రమే సక్సెస్ అయ్యాడు, ఈ సినిమాకి కెమెరామెన్ గా చేసిన తిరు తన పనితనంతో సినిమాకి ప్రాణం పోసాడు, ప్రతి విజువల్ అద్భుతంగా ఉంది, చాలా కలర్ ఫుల్ గా, రిచ్ గా సినిమాని చూపించాడు.

కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ ది హిట్ కాంబినేషన్, శ్రీమంతుడు సినిమా రేంజ్ లో ఈ సినిమాకి పాటలు ఇవ్వలేదు కానీ చాలా మంచి పాటలే ఇచ్చాడు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది, కాజల్ చేసిన ఐటెం సాంగ్ సినిమాకే హైలైట్, ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ బాగాలేదు ఇంకొంచెం బాగా చేయాల్సింది, మైత్రి మూవీ మేకర్స్ సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది, కొన్ని చోట్లా కొరటాల తన మార్క్ కి తగ్గట్టు ప్రెజెంట్ చేయలేకపోయాడు, క్లైమాక్స్ మరి రొటీన్ గా ఉంది.

ప్లస్ పాయింట్స్:

  • ఎన్టీఆర్‌
  • మోహన్‌లాల్‌
  • సెకండ్ హాఫ్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ క్లైమాక్స్
  • ఫస్ట్ హాఫ్

అలజడి రేటింగ్: 3/5

పంచ్ లైన్: జనతా గ్యారేజ్- ఈ సినిమాకి ఇంకొన్ని రిపేర్లు ఉంటే బాగుండేది. 

(Visited 1,686 times, 36 visits today)