EDITION English తెలుగు
Home / Latest Alajadi / సినిమా స్టోరీని తలపించిన కరీంనగర్ ప్రేమ కథ..!

సినిమా స్టోరీని తలపించిన కరీంనగర్ ప్రేమ కథ..!

Author:

కరీంనగర్ లో జరిగిన ఒక కులాంతర ప్రేమ పెళ్లిలో జరిగిన నాటకీయ పరిణామాలు అచ్చం మన తెలుగు సినిమా స్టోరీని తలపించాయి, తమకు తెలియకుండా రహస్యంగా కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని బలవంతంగా భర్త నుండి శుక్రవారం (నవంబర్ 10 న) రోజు తమ ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు శనివారం(నవంబర్ 11) రోజు పెద్ద మనస్సుతో వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించి పోలీసుల సమక్షములో వారిద్దరిని ఒక్కటి చేసారు, ఈ సందర్భంగా కనిపించిన దృశ్యాలన్నీ అనుబంధాల ఆత్మీయతలతో కలగలిపిన భావోద్వేగాలకు అద్దం పట్టాయి. ఓ వైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, మరోవైపు కనీ పెంచిన తల్లిదండ్రులు… ఎవరిని వదులు కోలేక ఆ యువతి పడిన తపన, తండ్రి రోదన.. చూసేవారి కళ్లు చెమర్చేలా చేసాయి.

కరీంనగర్ లవ్ స్టోరీ - కరీంనగర్ police

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసాచారి కూతురైన హరిణి, కరీంనగర్ జిల్లా సాయం పేట అనే గ్రామానికి చెందిన సిదురు నర్సయ్య – ప్రమీల కుమారుడైన ప్రవీణ్, చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి కులాలు వేరు కావడంతో.. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించరేమోనన్న కారణంగా ఇద్దరూ ఇంట్లో తెలియకుండా అక్టోబర్ 7న సికింద్రాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ కథ కూడా సినిమా స్టోరీని తలపించేలా మొదలైంది. ప్రవీణ్ ఓ విత్తన కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఆ కంపెనీ తరపున గ్రామాల్లో రైతులు పండించిన పంటను సేకరించేవాడు. ప్రవీణ్ చెల్లెలు హన్మకొండలో డిగ్రీ చదువుతోంది. తరుచూ హన్మకొండలోని చెల్లెలి దగ్గరకు వెళ్లే ప్రవీణ్ కు ఆమె స్నేహితురాలైన హరిణితో పరిచయమైంది. హరిణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో.. పెళ్లికి పెద్దలనొప్పించేందుకు వీరికి ధైర్యం చాల లేదు. ఇద్దరూ మేజర్లే కావడంతో.. గత నెల 7న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి వరకు కథ సాఫీగానే సాగినా.. అసలు కథ  ఆతర్వాత మొదలైంది.

కరీంనగర్ లవ్ స్టోరీ - కరీంనగర్ police

కూతురు హన్మకొండ నుంచి వెళ్లిపోయి ఓ యువకున్ని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న హరిణి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తల్లి మంచం పట్టింది. దీంతో.. యువకునిపై మహబూబాబాద్ పోలీసు స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో ప్రవీణ్- హరిణి కూడా జమ్మికుంట పోలీసు స్టేషన్లో కలిసి తాము ప్రేమ వివాహం చేసుకున్నామని, అయితే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేసారు. ఇదిలా ఉండగా… తరుచూ హరిణి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతుండేది. తల్లి దండ్రుల యోగక్షేమాలు కూడా కనుక్కుంటుండేది. ఎంతైనా కన్నవారి ప్రేమను కాదనుకోలేక.. తల్లి దండ్రుల దగ్గరకు వెళ్లొస్తానని ప్రవీణ్ ను కోరింది. కానీ.. భార్యను పంపిస్తే తిరిగి తన దగ్గరకు రానిస్తారో లేదోనన్న భయంతో అందుకు నిరాకరించేవాడు ప్రవీణ్. ఇంతలో శుక్రవారం (నవంబర్-10) యువతి తరపు బంధవులు రెండు వాహనాల్లో సాయంపేటకు వచ్చారు. ప్రవీణ్ ఇంటికి వెళ్లి యువతిని తమ వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ అడ్డుకోవడంతో.. అతన్ని కొట్టి మరీ హరిణిని కార్లో ఎక్కించుకుని వెళ్లి పోయారు. తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో మొదటి కారు వెళ్లి పోగా, రెండో కారును గ్రామస్థులు అడ్డుకున్నారు. కారును, కారులోని ఐదుగురిని జమ్మికుంట పోలీసులకు అప్పగించారు. తిరిగి అమ్మాయిని తీసుకు వస్తేనే వారిని వదిలి పెట్టాలని గ్రామస్థులు, ప్రవీణ్ కుటుంబీకులు డిమాండ్ చేసారు.

శనివారం (నవంబర్-11)న తిరిగి యువతితో సహా తండ్రి జమ్మికుంట పోలీసు స్టేషన్ కు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దెబ్బలు తిని నీరసంగా కనిపిస్తున్న భర్త, మరోవైపు కనిపించిన తల్లిదండ్రుల ప్రేమాప్యాయతల నడుమ హరిణి నలిగిపోయింది. తిరిగి వచ్చిన భార్యను చూసి ప్రవీణ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. అందరి ముందే భార్యను ప్రేమగా అక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. పోలీసులు కూడా యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతి కూడా తాను భర్తతోనే ఉంటానని, కాకపోతే.. తమ తల్లివైపు వారిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని వేడుకుంది. వాళ్లని తన ముందే పోలీసు స్టేషన్ నుంచి క్షేమంగా విడిచి పెట్టాలని ప్రాదేయ పడింది. తండ్రి కాళ్లపై పడి కన్నీరు మున్నీరైంది. తండ్రి శ్రీనివాసాచారి కూడా బిడ్డను చూసి కంట తడి పెట్టాడు.కూతురి ప్రేమని అర్ధం చేసుకొని పెద్ద మనస్సుతో వాళ్ళని దీవించి, పర్సులోంచి డబ్బులు తీసి కూతురుకిచ్చాడు. ఈ దృశ్యాలన్నీ మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాల నడుమ నలిగిపోయిన భావేద్వేగాలకు అద్దం పట్టాయి. చివరకు యువతి తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లిపోగా.. ఆమె కోరిక మేరకు తల్లిదండ్రులను పోలీసులు ఏమీ అనకుండా వదిలేయడంతో శుభం కార్డు పడింది.

Must Read: 99 మంది చిన్నారులను బతికించిన మహేష్ బాబు.

(Visited 1,867 times, 50 visits today)