Home / Inspiring Stories / అతడు అడవిని నిర్మించాడు – 1360 ఎకరాల అడవిని తన చేత్తో పెంచిన యోధుడు.

అతడు అడవిని నిర్మించాడు – 1360 ఎకరాల అడవిని తన చేత్తో పెంచిన యోధుడు.

Author:

“ఒక్క చెట్టుని నరకాలనుకున్నా ముందు నన్ను నరకండి ఆ తరవాతే మీ చెట్టు దగ్గరికి వెళ్ళగలరు” తెలుగులో మాస్ హీరో పంచ్ డైలాగ్ అంత బలంగా ఉంది కదా ఈ డైలాగ్. అయితే ఇది సినిమా సన్నివేశం లోనిది కాదు ఈ మాటలన్నదీ సినిమా హీరో కాదు… జాదవ్ మొలాయి పయెంగ్‌ అనే ఒక మైసింగ్ తెగ గిరిజనుడు… అస్సాంలోని జోర్హాట్ కు చెందినవాడు. అయితే అతను సినిమా హీరో కాదు రియల్ హీరో ఒంటి చేత్తో మనుషులని నరికే హీరో కాదు 1360 ఎకరాల అడవిని తన చేత్తో పెంచిన యోధుడు. ఔను అతడు అడవిని నిర్మించాడు…

Forest Man

జాదవ్‌ పయెంగ్‌ వాళ్ల గ్రామం పక్కనుంచే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంటుంది.1979 వ సంవత్సరములో అస్సాం లో వచ్చిన వరదల వలన ఎన్నో జలచరాలు బ్రహ్మపుత్రా నది ఒడ్డుకి కొట్టుకువచ్చాయి. కొన్ని రోజులకి వరదలు తగ్గి నది మధ్య లోని ఇసుకదీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధి అయిపోయాయి. అక్కడికి దగ్గరలోనే ఉండే జాదవ్ వాటిని చూసి చలించి పోయాడు, వెంటనే అటవీ అధికారుల వద్దకు వెళ్లి ఆ ఇసుక తెన్నెల వద్ద అడవిని పెంచితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పాడు వాళ్ళు..’ఈ ఇసుక నేలళ్ళో ఏ విధమైన మొక్కలు పెరగవు అంతగా చేయాలనుకుంటే నువ్వే అక్కడ వెదురు లాంటి మొక్కలు ఏవైనా నాటి చూడు..’ అని సలహా ఇచ్చారు. అలా ముప్పై ఏళ్ల ముందట ప్రారంభమైనది జాదవ్ ప్రయాణం. మొదట వరదలతో కొట్టుకొచ్చిన ఇసుక మేటల్లోనే 20 వరకూ వెదురు మొక్కల్ని తెచ్చి నాటాడు. ఆ తర్వాత స్థానిక అధికారులు సుమారు 200 హెక్టార్లలో చెట్ల పంపకం మొదలు పెట్టారు జాదవ్‌ అక్కడ కూలీగా చేరాడు. ఆ కార్యక్రమం ఐదేళ్లకు ఈ కృత్రిమ అడవులను సృష్టించే పని అయిపోయింది. తనతో వచ్చిన తోటి వాళ్ళు అందరు ఎవరు దారి వారు చూసుకుని వెళ్ళిపోయారు. కాని పయెంగ్‌ మాత్రం ఆ పనిని మాన లేదు ఎందుకంటే మొక్కలు నాటటం అడవిని రక్షించటం అతని ఉధ్యోగం కాదు అతని ఆశయం…. అలా మొక్కలని నాటుతూ పోయాడు. ఒక్కరోజు నీళ్ళు పోసి ఫొటోలు దిగే నాయకుల్లా కాకుండా ప్రతీ మొక్కనీ బిడ్దలా చూసుకున్నాడు. చెట్లను కొట్టడానికి గ్రామస్తులు వస్తే “చిప్కో” ఉధ్యమ కార్యకర్తలా చెట్టుని కౌగులించుకొని నన్ను నరికాకే చెట్టుని నరకండి అంటూ ఎదిరించి నిలబడ్డాడు. ఫలితం 40 ఏళ్ళ లో అప్పుడు అక్కడ ఒక అడవి తయారయ్యింది… మామూలు అడవి కాదు ఏనుగులూ,పులులూ తిరిగేంత పెద్ద అడవి….

Forest Man 1

ఒక్కడే తన చేతులతో నిర్మించిన ఈ విశాలమైన అడవి ఇప్పుడు పులులు , సింహాలు , జింకలు , రకరకాల పక్షులు నివసించే సంరక్షణ కేంద్రంగా మారిపోయింది. అరుదైన అంతరించి పొయే దశకు చేరుకున్న రాబందులకూ ఇప్పుడు పయెంగ్‌ అడవి అమ్మలా మరో జన్మనిస్తోంది. వాటి జనాభా పెరుగుతోంది. ఈ అద్భుతమైన విశాల అరణ్య సౌదాన్ని నిర్మించడానికి 40 సంవత్సరాల తన జీవిత కష్టాన్ని దారపోసాడు పయెంగ్‌ . పయెంగ్‌ సేవకు ప్రతి ఫలంగా పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం.

(Visited 1,150 times, 61 visits today)