సలేశ్వరం జాతర మొదలైంది, ఏడాదిలో 5 రోజుల తప్ప మిగతా రోజులు చూడలేం.

Author:

కాశ్మీర్ లో జరిగే అమరనాథ్ యాత్ర గురుంచి మనందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తేగాని ఆ యాత్ర చేయలేము, అమరనాథ్ యాత్రలాగే మన తెలంగాణాలో కూడా ఒక యాత్ర ఉంది, అదే సలేశ్వరం యాత్ర, దీనిని తెలంగాణ అమరనాథ్ యాత్ర అని కూడా అంటారు, ఈ సలేశ్వరం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వచ్చే పౌర్ణమికి  జాతర నిర్వహిస్తారు, ఈ జాతరని అక్కడ ఉండే చెంచు జాతి ప్రజలే నిర్వహిస్తారు, ఈ సలేశ్వరం జాతరని 5 రోజులు నిర్వహిస్తారు. శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఈ ఆదివారం (ఏప్రిల్ 9) మొదలైన సలేశ్వరం జాతర.. ఐదు రోజులు జరగనుంది, ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు.

Saleshwaram Jathara సలేశ్వరం

శ్రీశైలంకి వెళ్లే ఘాట్ రోడ్డులో మన్ననూర్ చెక్ పోస్ట్ నుంచి ఘాట్ రోడ్లో 20 కిలో మీటర్లు వెళ్తే.. ఫరహాబాద్ చౌరస్తా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్లు అడవిలోకి పోతే అక్కడ సలేశ్వరం గుట్ట ఉంటుంది, సలేశ్వరం గుట్ట వరకే వాహనాలు వెళ్తాయి, అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లసిందే, సలేశ్వరం గుడిని చేరుకోవాలంటే దాదాపు 6 కిమీ గుట్టలు, లోయలలో నడవాలి, మధ్యలో మోకాళ్ళ పర్వతం అనే గుట్ట వస్తుంది దానిని ఎక్కడం చాలా కష్టమైన పని కానీ భక్తులంతా శివుని దయతో చాలా సులభంగా ఆ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కేస్తారు, గుట్టల మధ్యలో అందమైన జలపాతాలు, గుహలు కనువిందు చేస్తాయి, గుడి దగ్గర ఒక పెద్ద గుట్ట మీదుగా జలపాతం కనువిందు చేస్తుంది, ఆ జలపాతం కింద స్నానం చేసి అందరు స్వామిని దర్శించుకుంటారు.

Saleshwaram-Jathara

స్వామివారు మొదట చెంచులకు కనిపించారని చెబుతారు. అడవిలో నీళ్ల కోసం వెతుకుతుంటే.. కుక్కలు సలేశ్వరాన్ని చూపించాయి. జలపాతం, గుండం, లింగం, కాలబైరవుడు, చెంచులకు కనపించాయట. అప్పట్నుంచి నల్లమల అడవిలో చెంచులే ఈ గుడి దగ్గర పూజలు చేస్తున్నారు. ఉగాది పండగ తర్వాత వచ్చే పున్నమికి ఏటా సలేశ్వరం జాతర చేస్తారు. దేవున్ని లింగమయ్య అని పిలుస్తారు. లింగమయ్య ఎదురవ్వగానే గంగమ్మ దూకుతుంది. ఇదీ ఇక్కడి ప్రత్యేకత. అడవి చెట్ల వేర్ల నుంచి వచ్చే నీళ్లను భక్తులు తాగుతారు.

సలేశ్వరం జాతరకొచ్చే భక్తులకు కొన్ని సంఘాలు… అన్నదానంతో పాటు మంచినీళ్లు అందిస్తున్నారు. లింగమయ్యను ఏడాదిలో ఈ ఐదు రోజులు తప్ప.. మిగతా రోజుల్లో చూడలేం. చుట్టూ అడవి ఉండటంతో చెంచులు కూడా ఇక్కడికి వెళ్లరు. అందుకే సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్ నాథ్ యాత్ర అంటారు.

(Visited 2,241 times, 410 visits today)

Comments

comments