Home / సాహిత్యం / కృష్ణతత్వము అనబడు కవిత్వము

కృష్ణతత్వము అనబడు కవిత్వము

Author:

Krishnamani

యాసల్లో ఒక సౌందర్యముంటుంది.., ఒక ప్రాంత చరిత్రా,దాని అస్తిత్వమూ కలగలిసి ఒకసాహిత్యాస్తిత్వాల కలయిక ఒక తో పుట్టిన జానపదం మనలని అంతగా ఆకట్టుకుంటుంది.యాసాపదాల తోడుగా సాగే ఒక అడవిగాలి పాట. పొద్దున్నే పూసిన ఒక రాచగుమ్మడి పువ్వు లో మొహం పెట్టి పీల్చుకున్నప్పుడు తగిలే మత్తైన వాసనలా,మోదుగు చెట్టు కిందనుంచి నడిచేటప్పుదు రాలిన పువులన్నీ చూసినప్పుడు కలిగే ఉద్వేగపు అనుభూతీ కలిసినట్టుంటుంది యాసపదాలు కలిసిన ఒక పాతను గానీ ఒక కవితను గానీ విన్నప్పుడూ,చదివినప్పుడూ కూడా, మనదైన ఒక ఊరుంటుందనీ అక్కడ మనకో జీవితముండేదనీ గుర్తుకొస్తుంది.ఊరి పచ్చిగాలి వాసనేదో నాసికా రంద్రాలని తాకి ఊరి చివరి మసీదు ముందున్న వేపచెట్టుకి వేలాడే గాలిపటం లా తేలిపోతుంది… లేదూ ఊరిమధ్యలోనే ఉన్న ఆంజనేయుడి గుడి మెట్ల మీదరాలిన ఒక రావి ఆకులా మురిసిపోతుంది…. ఇంకా చెపాలంటే కృష్ణ మణి కవితలా ఒక్క కుదుపుతో మన అస్తిత్వ మూలాన్నీ ఊరి బొడ్రాయినుంచీ మనవరకూ వ్యాపించి ఉన్న ఒక రహస్య బొడ్డు తాడు ని లాగి మనలని మనకు గుర్తు చేస్తుంది…తను పుట్టిన గడ్డ మీదున్న ప్రేమ మణి కవిత్వాన్ని కొంత యాసా సౌందర్యం తోనూ,ఒక ముడి సరుకులాంటి పచ్చిబియ్యపు వాసనలాంటి ప్రాంతీయ భావం తోనూ..,ఉధ్యమ నేపథ్యం ఉన్న స్థలం కాబట్టి కొద్దిగా తిరగభడే తత్వం తోనూ కలగలిసి ఉంటాయి..


బర్రెమందల నడిమిట్ల ఆయిలాకుల కట్టే
పోతున్న తొవ్వ పోతనే ఉంది
పోయ్యేదెక్కడో తెల్వకుండనే !
చెర్వుకట్ట మీద చింతచెట్టు
అక్కడక్కడ కల్లులొట్లు నిండుతున్నయి…

అసంఖ్యాకంగా వచ్చి పడే ఒక జీవిత మూలాల పరిమళాలనీ, ఒక వేదనాకాలపు స్వరాన్నీ, పూడుకు పోయిన గొంతు లోని ధుఖ గీతాన్నీ కలిపిన ఒకానొక మార్మిక భావాన్నీ తెచ్చి పాఠకుని గుండెపై ఉంచి తనకు తాను మళ్ళీ విడివడి మరో అనామక రాగాన్ని వెతుక్కుంటూ పోయే ఈ కవిని చూసి. కృష్ణా…! నీకవిత్వమొక ఊరు,ఒక ఇల్లూ,ఒక మనిషీ అని పలవరించుకుంటాం…

మీ అమ్మ వ్రతం చేసింది
బంగారంలాంటి బొమ్మను ఇమ్మని
ఇప్పుడు ఇల్లంతా సందడి
విరిసిన పువ్వుల తోటలా !

ఒక భావం తన సొంతమే అని ఏ కవైనాఎలా చెప్పుకోగలడు. ఈభావం తనొక్కడిదేనా. లేత మొగ్గల్లా కంఠం చుట్టూ పెనవేసుకున్న పసిచేతుల స్పర్శతాకిన ఏ తండ్రి మాత్రం అనుకోని భావన ఇది. కానీ మణి ఒక్కడే ఎలా రాయగలిగాడూ? అంటే.. మణి జీవితం లోని చిన్ని ఆనందాలనీ,జీవితాన్నీ,కవిత్వాన్ని వేరుచేసి చూడకపోవటమేనేమో మరి…! ఔను తననీ,తనకుటుంబాన్నీ విపరీతంగా ప్రేమించుకునే వ్యక్తి తానున్న భూమినీ, తన దేశాన్ని, ప్రపంచాన్నీ అంతకంటే ఎక్కువే ప్రేమించగలడు.

నేనూ నీ ఆయువును
నీ అంతరాత్మను
‘జాగో మేరె భాయ్
ఆజ్కా దిన్ తుమ్హారా హై హాల్ చలానేకేలియే
ధర్తి పే లాల్ రంగ్ పూలోంకో ఉడానేకేలియే ’ 

ఇలా రాసి మరొక మనిషికి తానూ ఒక ఆధారమై నిలబడనూగలడు .. ఇలా ఈతన్ని మళ్ళీ మళ్ళీ హత్తుకోవాలనిపించేంత గా,ఈ కవిత్వం లో మునిగిపోవాలనిపించేంత మనసు లాగితే ఫేస్ బుక్ కవిసంగమం లో చేరిపోండి… ఇంకాస్త పాతవి కూడా చదవాలనిపిస్తే http://krishnamani-official.blogspot.in/ లో లాగిన్ ఐపోండి….. ఈ కవిత కూడా చదివేస్తే ఇంక మీరు మణి ని వెతుక్కుంటూ వెళ్ళిపోవచ్చు…

ఏం జెయ్యాలె ?
____________________ కృష్ణ మణి
గడిగడికో గండం నా మొగుడు
యదల మంటలు మాన్పె తొవ్వల నేనుంటి !
ఏం జెయ్యాలె
మాటముచ్చటకు ముందే
సరసమాడమనే
ఇంట్ల అన్నలదెలిసి
ఆగమాగమయ్యి లగ్గమొద్దనె !
బావకిచ్చిన మాట జవదాటని మా నాయిన
అడుగు ఎంకవడితే అవమానమైతదని
ఆగలేనికాడ పెండ్లిజేశిచ్చె
అత్తమామల మొక్కి ఆ ఇంట్ల కాలుపెడితే
కాటికైయిన నయమని
ఇయ్యల్ల తెలిశొచ్చె !
బయటిశోకుల నా మొగుడు
ఆడినాటలు ఇని
మన్సుకాలి బుడిదాఎ
ఆడపిల్లలు పుడితె ఇద్దరే ముద్దని
ఎంతజెప్పిన ఇనక
ఆప్రీషను జేపిచ్చె !
కాలం గడిశిన కాడ
పాత గుణము లేశె
బరితెగిమ్పున బామాటలకు బయలుదేరె
అన్నకు కొడుకుపుడితె
నాకెందుకు లేరని
మల్ల కోపిచ్చే నా పాణం పోయ్యిరాంగ
దవాఖానల నేవంతె
నా ఇంట్ల భోగమాటలు !
అవి తెలిశి అడుగంగ
ఊర్ల ఎవడు సోక్కం నేను జేస్త
ఎవడు అడ్డమనె
సవితిని తెస్త ఒప్పుకో
లేదంటే తప్పుకో అని
నడిరాతిరి సీసవలిగే నెత్తిన
కారేది కన్నీరా లేక నేత్తురాని
తెలియని రాత్రులు ఎన్నో గడిశె !
కాలయమున్ని కట్టబెట్టిన అమ్మానాయిన
ఊరంతటిని ఒకటి జేస్తే
ఎంత జెప్పిన ఇనక
ఊరకుక్క తిరిగి మొరగవట్టె
నలుగురిలవెట్టి నవ్వులాట చేశినానని
పానం తింటనని కత్తి ఎత్తి రాంగ
పోలిసొళ్ళ కాడ పంచాదులు చెయ్యంగ
పైసలు తినే కాడ నాయమేక్కడుంటది ?
ఊరోళ్ళు నవ్వసాగే
ఇల్వ లేని జన్మ
మర్ల బడ్డ మొగుడిని
సావుదెబ్బలు కొట్టే అన్నలు ఓపని కోపాన
ముందు రాయెత్తి సంపజూసిందని
అన్నల కన్న ముందు నన్నే దోషని కోర్టులు తిప్పవట్టే
సావురాని సన్నాసి !
యాడాది నర్దం ఆగిజూస్తి
బిడ్డల బతుకుకోసం నేనెక్కితి కోర్టు
అడుగు బెట్టని సొట అల్వాటాయే కర్మ కర్మ
పైస తిన్న మా లాయరు నా మొగుడి సైగలల్ల మసిలే
యాడాది గడిశిపాయే
తిండి తిప్పలెట్ల ?
నా పిల్లల సదువులెట్ల ?
ఎంతగనమని మావోల్లు పెడ్తరు ?
మొగునికి రోగామన్న రాదాయే
శావ జేస్కుందమంటె !
బరువై లోకానికి
ఎండమాయి బతుకున
నా గుడ్డుల తోవ్వేదీ ?
ఏ ఏట్ల నేవడుదు ?
ఏం జెయ్యాలె ? ఏం జెయ్యాలె ….. ?
–కృష్ణ మణి

(Visited 240 times, 33 visits today)