Home / Inspiring Stories / LED కాంతులతో వెలిగిపోనున్న భాగ్య నగరం.

LED కాంతులతో వెలిగిపోనున్న భాగ్య నగరం.

Author:

LED Bulbs Company In Hyderabads

తెలంగాణా లో మరో ఉపాదికల్పన కు తెరలేవనుంది నిరుద్యోగాన్ని పారదోలే దిశగా అదుగులు వేస్తున్న ప్రభుత్వాలు మరిన్ని కంపెనీల స్థాపనకు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగం గానే రాష్ట్రంలో దాదాపు రెండువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగును అందించే ఎల్‌ఈడీ లైట్ల పరిశ్రమ భాగ్యనగరిలో కాంతులీననుంది. హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ లైట్ల తయారీ యూనిట్‌ను స్థాపించడానికి అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివెసైస్ ఇంటర్నేషనల్ (ఏవోడీ) కంపెనీ ముందుకొచ్చింది. దేశీయ కంపెనీ సిస్కాతో కలసి రూ. 500 కోట్ల పెట్టుబడితో ఏవోడీ ఈ యూని ట్‌ను స్థాపించనుంది. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఏవోడీ సీఈవో ప్రతాప్ కందమూరి, జీఎం రవి ఇంద్రాణి, డెరైక్టర్ ఆండ్రెస్, సిస్కా డెరైక్టర్ రాజేష్ ఉత్తమ్‌చందానీ తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ను కలిశారు. యూనిట్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు సమర్పించారు.

దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని, దీని వల్ల 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు కేసీఆర్‌కు వివరించారు. తయారీ పరిశ్రమతోపాటు అనుబంధ పరిశ్రమలనూ స్థాపిస్తామన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ యూనిట్ స్థాపనకు అవసరమయ్యే భూమిని సమకూర్చడంతోపాటు అన్ని విధాలా సహకరిస్తామని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మార్చి నుంచే ఉత్పత్తులు ప్రారంభించడానికి తాము సిద్ధం గా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పగా.. భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాలు వీలైనంత తక్కువ సమయంలో సమకూరుస్తామని సీఎం చెప్పారు. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగు అందించే ఎల్‌ఈడీ లైట్ల వాడకం పెరగాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.వాటి వాడకం పెరిగేకొద్దీ డిమాండ్ పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు తెచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం సత్ఫలితాలిస్తోందని, ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులిచ్చామని వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ‘బిజినెస్ ఎట్ ఈజ్’ పద్ధతిలో పారిశ్రామిక విధానం ఉందన్నారు. హైదరాబాద్‌లో త్వరలో ఫార్మా సిటీ, సినిమా సిటీ రానున్నాయని, ఐటీ కంపెనీలు కూడా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడే పెట్టుకుంటున్నాయని చెప్పారు.

ఏవోడీ కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎల్‌ఈడీ యూనిట్ కోసం ఇండస్ట్రియల్ పార్క్‌లను పరిశీలించింది. హార్డ్‌వేర్‌పార్క్‌లో కానీ ఎలక్ట్రానిక్ సిటీలో కానీ తమకు చోటుకావాలని కంపెనీ ప్రతినిధులు కోరుతున్నారు. ఎల్‌ఈడీ లైట్ల తయారీ పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమలను కూడా స్థాపిస్తామని సిస్కా కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు కంపెనీ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి సమర్పించారు.ఇజ్రాయెల్ నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తల బృందం పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వంతో సోమవారం చర్చలు జరిపింది. లైరన్ జస్‌లన్‌స్కి, వీరెడ్ మివ్‌త్‌జరీ, డాన్ అలూఫ్, కెన్ ఉడామి తదితరులతో కూడిన ఈ బృందం పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. మైక్రోఇరిగేషన్, వాటర్‌మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, స్మార్ట్ సిటీల నిర్మాణం, డిఫెన్స్, ఎయిరోస్పేస్ తదితర రంగాలలో పరిశ్రమల స్థాపనపై మంత్రితో చర్చించింది. టీఎస్-ఐపాస్ అమలు తీరును మంత్రి ఇజ్రాయెల్ బృందానికి వివరించారు. పరిశ్రమలను స్థాపించడానికి తమ ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలను అందిస్తుందని వివరించారు

(Visited 51 times, 7 visits today)