Home / Inspiring Stories / లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది..?

లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుంది..?

Author:

Leap Year History లీపు సంవత్సరం

మామూలుగా సంవత్సరానికి ఎన్నిరోజులూ? మరి నాలుగేళ్ళకి ఒక సారి లీపు సంవత్సరం వస్తుంది కదా..! అసలు లీపు సంవత్సరం అంటే ఏమిటి ఆ సంవత్సరంలో మిగతా అన్ని నెలలనూ వదిలేసి ఫిబ్రవరిలోనే ఒకరోజు ఎందుకు అదనంగా వస్తుంది…? ఈ అనుమానాలు మీకెపుడైనా వచ్చాయా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా మనలో చాలా మందికి అంతగా గుర్తుండి ఉండదు ఓసారి అసలు లీపు సంవత్సరం గొడవేంటో ఈ ఫిబ్రవరి 29 సంగతేంటో చూద్దాం రండీ…!

భూమి సూర్యుడి చుట్టూ గిర..గిరాగిర..గిరా అంటూ తిరిగేస్తోందని మీకూ తెల్సుకదా. ఇలా సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేసుకోవటానికి భూమికి సరిగ్గా  365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. అంటే 365 రోజుల మీద ఒక పావు పూట అన్న మాట. ఈ అయిదు గంటలని ఒక రోజుగా తీసుకోలేం, అలా అని క్యాలెండర్ లో అలానే వదిలేస్తే? కాలం గడిచే కొద్దీ కొన్ని సంవత్సరాలకి క్యాలెండర్ లో తేదీల లెక్కలు గందర గోళం గా తయారవుతాయి. అందుకే ఈ అదనపు 5 గంటల 48నిమిషాల 46సెకెన్ల కాలాన్ని ప్రతీ నాలుగు సంవత్సరాలకి ఒకసారి. నాలుగవ సంవత్సరానికి అదనపు రోజుగా కలుపుతున్నారు. ఈ అదనపు రోజు ఫిబ్రవరి లో వస్తుంది. అలా మొత్తం 366 రోజులుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అదన్న మాట సంగతి…

అయితే సంవత్సరంలో 12 నెలలు ఉండగా కేవలం ఫిబ్రవరి నెలకే 29 రోజులెందుకు? అదేదో డిసెంబర్ నేలకే ఒకరోజు అదనంగా చేరిస్తే కొత్త సంవత్సరం వేడుకలని ఇంకాస్త ఎక్కువ సేపు చేసుకునేవాళ్లం కదా..! అయితే ఇక్కడా ఒక విషయం ఉంది… అప్పట్లో అంటే క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్ ల ప్రభావమే ఎక్కువగా ఉండేదన్న సంగతి తెలుసు కదా… రోం చక్రవర్తిగా జూలియస్ క్యేసర్ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించేంత వరకూ రోమన్ క్యాలెండర్‌‌లో సంవత్సరానికి 355 రోజులు మాత్రమే ఉండేవి. ప్రతీ రెండు సంవత్సరాలకు 22 రోజలు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఈ గందర గోళం వద్దనుకున్న క్యాసర్ ఈ క్యాలెండర్ విధానంలో మార్పులు చేసి మొదటి శతాబ్దంలో మెరుగైన క్యాలెండర్‌ను ప్రజలకు అందించాలని నిర్ణయించారట.

ఆదేశించింది రాజు కదా అందుకే మేధావులందరూ కలిసి కిందా మీదా పడి 365 రోజుల క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్కువ వస్తుందనీ, అందువల్ల ఆ రోజును ఆగస్టు నెలలో కలపాలనీ అనుకున్నారు, మొత్తం మీద రోమన్ క్యాలెండర్‌లో ఫిబ్రవరి నెలకు 30 రోజులు, జూలై నెలకు 31 రోజులు, ఆగస్టు నెలకు 29 రోజులు ఉండేలా నిర్ణయించారు. అయితే ఆ ముచ్చటా ఎక్కువ రోజులు ఉండలేదు… జూలియస్ క్యాసర్ తర్వాత చక్రవర్తిగా అధికారం చేపట్టిన “క్యేసర్ ఆగస్టస్” ఈ క్యాలెండర్‌లో తనకు నచ్చినట్టు మరికొన్ని మార్పులు చేశాడు. తాను పుట్టిన నెల అయిన ఆగస్టుకు తక్కువ రోజులు ఉండటం ఆయనకు ఇష్టం లేకుండా పోయింది. దీంతో క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అంతకు ముందు చక్రవర్తి జూలియస్ క్యేసర్ పుట్టిన నెల అయిన ఫిబ్రవరికి రోజులు తక్కువ చేసి, తాను పుట్టిన ఆగస్టు నెలకు సంపూర్ణంగా 31 రోజులు ఉండేట్లు క్యాలెండర్‌లో మార్పులు చేయించారట.దాంతో పాపం ఫిబ్రవరి చిన్నదైపోయింది. అందుకే ప్రతీ లీపు సంవత్సరం లో వచ్చే అదనపు గంటల రోజుని ఫిబ్రవరికి ఇచ్చాడట క్యాసర్ ఆగస్టస్” అదండీ సంగతీ… చక్రవర్తుల పుట్టినరోజుల వల్ల ఆగస్టు అలా ఎదిగి పోయిందీ… ఫిబ్రవరి ఇలా చిన్నదై పోయి నాలుగేళ్ళకోసారి ఇలా లీప్ మంత్ గా సంతృప్తి పడుతోంది. పాపం ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫిబ్రవరి 29న పుట్టిన వాళ్ళ సంగతే కాస్త కంగారు వ్యవహారం ఔతోంది పుట్టిన రోజు ఎప్పుడు చేసుకోవాలో అర్థం కాక బిక్కమొహం వేస్తూంటారు…

(Visited 3,201 times, 864 visits today)