Home / Inspiring Stories / సాధిక్ అలి అనే అత్యంత సామాన్యుడూ-అతని తోపుడు బండి.

సాధిక్ అలి అనే అత్యంత సామాన్యుడూ-అతని తోపుడు బండి.

Author:

తోపుడు బండి మనకు కొత్తేం కాదు భారతీయ ఫుట్ పాత్ వ్యాపారంలో వీటి పాత్ర తక్కువేం కాదు.టిఫిన్ సెంటర్లూ,మినీ బట్టల దుకాణాలూ, వాచీలూ, చెప్పులూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తోపుడుబళ్ళెక్కి నగరాల్లో సంవత్సరానికి కొన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.కూరగాయల దగ్గరి నుంచీ పాత సామాన్లు మోయటం వరకూ తోపుడు బండి దిగువ వర్గాల జీవితంలో ఒక భాగమైపోయింది. భారత దేశంలోని ప్రతీ మధ్య తరగతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సంధర్బంలో తోపుడు బండి మీద ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. ఒక రకంగా తోపుడు బండి సామాన్యుడి “అక్షయ పాత్ర”. తోపుడు బండ్ల మీద జరగని వ్యాపారం లేదు. మీరు ఆదివారాలు చార్మినార్ ప్రాంతానికి వెళితే ఎలక్ట్రానిక్ ప్రింటర్లూ,కంప్యూటర్ విడి భాగాలూ,మానిటర్లూ తోపుడు బళ్ళ మీద అమ్మే మనుషులు కనిపిస్తారు. ఇవన్నీ సరే..! మరి పుస్తకాలు..!? ఇప్పటివరకూ మనం పాత పుస్తకాలనీ,పాత వార్తా పత్రికలనూ “కొనే”తోపుడు బళ్ళనే చూసాం. కానీ కొత్త పుస్తకాలను అమ్మే బండిని చూసారా?. ఇప్పుడు సాహిత్యం కూడా తోపుడు బండెక్కింది…సాహిత్యం సామాన్యుడి ముందుకే వచ్చేందుకు సిద్దమైంది. ఐతే ఈ పల్లకీ కి బోయీ ఒక్కడే.. రాజుల దగ్గరికి కాదు సాహితీ అభిమానులదగ్గరికి…పల్లె గుడిసెల ముంగిళ్ళకి… సాధిక్ అనే ఒక సారథి సాహితీ రథాన్ని తీసుకు వెళుతున్నాడు…

Thopudu Bandi

తెలుగు సాహిత్యం ఒకప్పుడు రాజ లాంచనాలతో పల్లకీల్లో మోయబడింది,గజారోహణాలు చేయించుకుంది…సాహితీ కారులకి కనకాబిషేకాలు జరిపించింది… ఐతే ఇప్పుడు కాలం మరింది తెలుగు సాహిత్యం సామాన్యుడికి కాస్త దూరం జరిగింది.అకడమిక్ పుస్తకాల వెనుకకు జరిగింది…కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్,మత సాహిత్యం ఇలా మరికొన్ని నెమ్మదిగా సాహిత్యాన్ని పక్కకు నెట్టాయి. ఒక దశలో తెలుగు కవిత్వ పుస్తకం వేయాలీ అంటే పబ్లిషర్లు కూడా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది… ఐతే ఇప్పుడు మరో చిన్న ఆశ తోపుడు బండిలా మరోసారి మొదలైంది. ఏమో తెలుగు సాహిత్యం మళ్ళీ కవులనీ రచయితలనీ ధనవంతులను చేయొచ్చు… ప్రతీ ఊరిలోనూ ఒక గ్రంథాలయం మొదలవ్వొచ్చు…. సాధిక్ అనే ఒక మనిషి ఈ కలని నిజం చేయొచ్చు…

Thopudu Bandi

ఒకప్పుడు అతనొక జర్నలిస్ట్,తర్వాత ఒక బిజినెస్ మ్యాన్,ఆ తర్వాత ఒక ఉధ్యమ కారుడు పోలవరం చుట్టుపక్కల గిరిజన తండాల్లోని ప్రతీ గుడిసెనీ తన ఇల్లు చేసుకొని,ప్రతీ మనిషినీ తన వాడు చేసుకొని బతికిన ఈ మనిషి ఇప్పుడు పుస్తకాల మీద పడ్డాడు ఉధ్యమ కారుడి బుద్ది కదా కాస్త తీవ్రంగానే విరుచుకు పడ్డాడు. ఒకే సంవత్సరంలో ఎప్పుడూ అమ్ముడుపోనన్ని తెలుగు కవిత్వ పుస్తకాలని ఠక్కున అమ్మి పారేసాడు. హైదరాబాద్ లోని గల్లీ గల్లీ తిరిగి… మరీ తెలుగు కవిత్వమా ఎవరు కొంటారిప్పుడు? అన్న వాళ్ళ చేత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి “కొత్త పుస్తకాలేం వచ్చాయ్?” అని అడిగి మరీ కొనే దాకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో సాధిక్ అలీ తోపుడు బండి సత్తా ఏమిటో ఒక్క సారి అందరికీ అర్థమైంది లక్షల రూపాయల అమ్మకాలు కవిత్వం,కథా,సాహిత్య వ్యాసాలూ ఇలా అదీ ఇదీ అనికాదు తెలుగు సాహిత్యానికి మళ్ళీ పాత వైభవం వచ్చేసినట్టే…. ప్రతీ ఒక్కరూ అనుకున్న మాట.. ఇప్పుడు తెలుగు కవులు కూడా కాస్త ధైర్యంగా పుస్తకాలు ప్రింట్ కివ్వొచ్చు అనుకున్నారు…

Thopudu Bandi 5

అక్కడితో ఇక తోపుడు బండి ఆగలేదు…సాధిక్ ఆపలేదు “తోపుడు బండి పబ్లికేషన్స్” మొదలయ్యింది. కవిత్వంతో పాటు మిగిలిన సాహిత్యమూ బండెక్కి కూచుంది.ఇప్పుడు ఇంకో గ్రంథాలయోధ్యమం మొదలయ్యింది.100 రోజుల్లో 1000 కిలోమీటర్ల ప్రయాణానికి తోపుడు బండి సిద్దమైంది మరిన్ని కొత్త పుస్తకాలతో సింగారించుకుంది.ప్రతీ పల్లె లోనూ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయటం కోసం,ప్రజల్లో పఠనాభిలాష పెంచటం కోసం తోపుడు బండి ప్రస్థానం మొదలయ్యింది.సాధిక్ మరోసారి బండి తోసుకుంటూ సాగనున్నాడు… ఒక్కడుగా మొదలౌతాడు రోడ్డుమీదకొచ్చేలోపు భానోజీ రావు వచ్చి చేరతాడు,నాలుగడుగులేసే సరికి సంతోష్ అనే కుర్ర్రాడొస్తాడు. కాసేపట్లోనే షారూఖ్ వస్తాడు.. ఇక ఆ తర్వాత వస్తూనే ఉంటారు… సాహితీ వేత్తలూ, జర్నలిస్ట్ లు, మంత్రులూ…ఇలా వస్తూనే ఉంటారు తోపుడు బండిని ఒక సారి ఆప్యాయంగా స్పర్శించి పుస్తకాలు కొనుక్కుని వెళ్ళిపోతారు.

Thopudu Bandi7

రోడ్డు మీద స్పీడ్ గా వెళ్ళే ఒక కారు సడన్ గా స్లో అయిపోయి పార్క్ చేయబడుతుంది,మనుషులు దిగుతారు కాసేపటికి కొన్ని పుస్తకాలను బ్యాక్ సీట్లో వేసుకొని కారు వెళ్ళిపోతుంది.. ఒక బైక్ మీద అబ్బాయీ అమ్మాయీ తోపుడు బండిని వింతగా,ఆనందం గానూ చూస్త్తూ స్లో ఔతారు కాసేపు సాధిక్ భాయ్ తో మాట్లాడి ఒక సెల్ఫీ,కొన్ని పుస్తకాలూ తీసుకొని వెళ్ళిపోతారు.. ఐతే ఆఖరున అక్కడ మిగిలేది తోపుడు బండీ సాధిక్ లు ఇద్దరే.. ఈ ఇద్దరికీ తోడు ఒక ఆశయం. అంతే ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఒక ప్రవాహంలా…

Thopudu Bandi 4

ఎప్పుడైనా మీకు అతను కనబడొచ్చు.. తోపుడు బండి పక్కన అలా నిలబడి ఒక తాత్వికుడిలా శూన్యం లోకి చూస్తూనో…లేదా కార్లో కూచొని రెండు నిమిషాలు రిలాక్స్ గా ఒక దమ్ము కొడుతూనో… లేదంటే అక్కడే పుట్ పాత్ మీదే కూచొని భోజనం చేస్తూనో…సామాజికుడి నుంచి పనికి రాని కుహనా మర్యాదలని వదిలేసిన ఒక మౌని లా కనిపిస్తాడు. ఒక సారి బండి దగ్గరికి వెళ్ళండి అతనితో మాట్లాడండి… ఒక సెల్ఫీ తీసుకోండి…ఒక పుస్తకం కొనండి.. ఆ కొద్దిసేపూ హాయిగా మిమ్మల్ని నవ్వించి మనసుని ఆనందంతోనూ చేతిని కొన్ని అక్షరాలతోనూ నింపి మిమ్మల్ని సాగనంపుతాడతను…మీరు వెళుతూంటే చిరునవ్వుతో మీకు చెయ్యి ఊపి మళ్ళీ బండిని తోసుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాడు…

(Visited 1,583 times, 115 visits today)