Home / Entertainment / ప్రతి అరగంటకు వాడే గుర్తొస్తున్నాడు! – నాని

ప్రతి అరగంటకు వాడే గుర్తొస్తున్నాడు! – నాని

Author:

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి..తన యాక్టింగ్ టాలెంట్ తో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయ్) ఈరోజు విడుదల కానుంది, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని పలు విషయాలు వెల్లడించారు..!

MCA ఎక్కువమందికి నచ్చుతుంది :

‘‘M.C.A ట్రైలర్‌లో ఏ కథైతే కనిపిస్తుందో అదే ఈ సినిమా. ప్రతి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చదు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. కానీ ‘ఎం.సి.ఎ’లో ఎక్కువమందికి నచ్చే అంశం ఉంది. ఇందులో భూమిక, సాయిపల్లవి, నా పాత్ర… ఇలా ప్రతి పాత్రలోనూ వాస్తవ జీవితాల్లో ఉన్నవే కనిపిస్తాయి. దర్శకుడిగా వేణుశ్రీరామ్‌కే అవకాశం ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు చాలామంది. మనం విజయం సాధించామని తర్వాతి సినిమాకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కావాలంటే కొత్త దర్శకులు రారు. కొత్త కథలు తెరకెక్కే అవకాశమే ఉండదు. వేణు శ్రీరామ్‌ ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత గ్యాప్‌ వచ్చింది ఈ విషయాలేవీ నాకు అక్కర్లేదు. కథ ఎంత బాగా చెప్పాడు… దాన్ని ఎంతబాగా తెరకెక్కించాడనేది నాకు ముఖ్యం. సహజంగా ఉండాలని వరంగల్‌లో తెరకెక్కించాం. జనాల మధ్య చిత్రీకరణకు ఇబ్బందులు ఎదురైనా సినిమా సహజంగా వచ్చింది’’

MCA-Movie-Review

నిజంగా వదినైపోయారు:
‘‘భూమిక మంచితనం గురించి చాలా విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. సెట్‌కు వెళ్లిన తొలి రోజు ఆమెతో నేను చెప్పిన తొలి మాట ఏంటంటే ‘మేడమ్‌ మీ ‘ఖుషి’ సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు టిక్కెట్ల కోసం ఎక్స్‌ట్రా లైన్లో నిలబడ్డప్పుడు పోలీసులు కొట్టారు. ఇప్పుడు మీతో కలిసి నటిస్తున్నాను’ అని చెప్పాను. ఆ రోజు మొదలు నిజంగా వదిన అయిపోయారు భూమిక’’

చూస్తానంతే…నటించను:
‘‘నాకు హారర్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ నేను మాత్రం ఎప్పటికీ హారర్‌ చిత్రాల్లో చేయను. నేను నిర్మిస్తోన్న ‘అ’ కథ చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఇలాంటి ఓ కథ ఉందా? అనిపిస్తుంది. అది నచ్చే నిర్మించడానికి ముందుకొచ్చాను. ‘అ’అనేది ఆశ్చర్యానికి గుర్తు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ ఆశ్చర్యానికి సంబంధించిన ఓ అంశం ఉంటుంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం.

ఎప్పటికైనా మణిసార్‌తో:
నాగార్జునగారితో చేసే సినిమా చర్చలు జరుగుతున్నాయి. కథ అయితే మా ఇద్దరికీ నచ్చింది. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రీకరణ జరుగుతోంది. కొత్తగానూ, కమర్షియల్‌గానూ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్‌ ఓ సినిమాకు పనిచేస్తున్నారు. అది పూర్తయ్యాక నాతో సినిమా ఉంటుంది. మణిరత్నంతో సినిమా గురించి చర్చలు జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తీయాలనుకోవడం, ఎక్కువ మంది నటులు ఉండటంతో డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో అది కుదరలేదు. మణిసార్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక.

జీవితాన్నే మార్చేశాడు:

‘‘మా అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక జీవితమే మారిపోయింది. వాడు రాకముందు వరకూ షూటింగ్‌ అయ్యాకా ఇంటికెళ్లాలి కదా అని ఎప్పుడో గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి అరగంటకు ఓ సారి వాడి ముఖం నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది’’

(Visited 161 times, 24 visits today)