Home / సాహిత్యం / నిశ్శబ్దాలని పలకరించే కవి

నిశ్శబ్దాలని పలకరించే కవి

Author:

Sahithyam

రాలిపోయే ఆకుల్లో
వాడిపోయే పువ్వుల్లో
చీమలదండుల్లో
నత్తల గుల్లలో
గొంగళి నడకల్లో
గుళక రాళ్ళల్లో
కవిత్వాన్ని వెర్రిగా వెతికేస్తుంటా… అనుకుంటూ కవిత్వం లో మమేకమవ్వాలనే ఒక బలీయమైన కోరిక కలిగించి ఎందరిని తనవైపులాకుందో ఈ భావుకత. కొన్ని సార్లు తనకుతానే అగాదాల్లోకి జారిపోతూ తనను తానే తీరానికి లాకుంటూ…ఇలా కవిగా బతకటం ఎంతదుర్బరమోకదా…! మిథిల్ అనే రెందుపదుల సంవత్సరాలని దాటున్న ఈ పిల్ల వాడు ఒక్కొసారి అమాంతంగా దిగంతాలదాకా తనని తాను ఒక గాలిపటం లా ఎగరేసుకుంటూ.. ఒంతరి తనపు తీరాల ఇసకల మీద ఎన్ని కన్నీళ్ళని,ఎన్నెన్ని మౌన సంభాషణలనీ రాసుకున్నాడో..
అరెయ్ చోటూ” అని పిలవబడుతుంటాయి
కాఫీకప్పుకి
చెత్త కుప్పకి
ట్రాఫిక్ సిగ్నల్ కి వేలాడుతూ
అలసిన నవ్వుల్ని ఎండిన డొక్కల్లో దాచేసుకుంటూ
పేవ్మెంట్ల పై పెరిగే పసితనాలు…. కంటి రెటీనా పై అతుక్కునే కొన్ని జిగురు దృశ్యాలని లిపుల్లో బందించేదాకా ఆగనివ్వని ఒకానొక అనామక వేదానానుభవాన్ని అందుకోవటం,కవిగా…మనిషిగా…కవిత్వం రాసే మనిషిగా లార్వాదశనుంచీ సీతాకోకచిలుక రెక్కల పైరంగులని మొహానికి పులుముకునే దాకా మిథిల్ నడిచివచ్చాడు.. మామూలుగా తన ఈడు కుర్రవాళ్ళలో కనిపించే సుకుమార భావ ప్రకటనేమీ కాదిది. తన చుట్టూ ఉన్న దేహక్షేత్రాలనీ,ఆ క్షేత్రాల మీద పడిన పాదపు గుర్తులనీ పొదివి పట్టుకొనీ రక్తపు మరకల పాదముద్రలని పట్టుకొని రోదించీ,వేదనపడీ…రగిలిపోతూ ప్రశ్నించే ఒకానొక ధిక్కార ధోరణివైపుగా సాగే వినూత్న స్వరం….
నడుస్తున్న చీమ కాలి కింది
వినిపించిన నిశ్శబ్దపు చప్పుడు … వినగలిగిన భావుకత ఎంత ఎదగాలి? ఎలా ఆలోచీంచాలి? మనిషిగా కొన్ని అడుగులకే పరిమితమయ్యే మనిషి కవిగా మారినప్పుడు మాత్రం అమాంతం ఒక శిఖర సమానుడై ఎలా నిలబడతాడు..? జవాబులు కష్టమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు….
తుమ్మెదపై వాలిన పుప్పొడి రేణువుల సమూహం చేసే సంపర్కాల సడుల్లో
శరీరాన్ని మోస్తున్న ఆత్మతో సంభాషించాలనిపిస్తే మాత్రం mithilkumar0007.blogspot.in  ఇక్కడికి వెళ్ళిపోండి.. ఎక్కడో ఒక చోట మీకు మీరే ఎదురుపడొచ్చు, మిమ్మల్ని మీరే పలకరించుకోవాల్సీ రావొచ్చు… కాస్త జాగ్రత్త కవిత్వమంటే మాటలు కాదు మరి….

~నగ్నకాగితపు అస్థిత్వం~

1.
ఓ సుప్తావస్థ స్థితి నుండి తెప్పరిల్లి
నెమ్మదిగా తెరుచుకున్న నా కళ్ళు
పురిటి వాసనతో ప్రసవించిన కొన్ని కలలు
రెప్పల చివర లోలకంలా
ఊగుతూ చేస్తున్న లిప్తసడిలో
లీనమైన నిన్ను వినడానికి
నా గవాక్షమొకటి రెప్పలు తెరిచీ…

వెర్రితనాన్ని నింపుకున్న చూపులు
నిన్ను నిర్వచించే ఆ సడి కోసం
చక్షువులు చాచి చూస్తున్నాయి
ఇక్కడేమో అన్నీ నిన్ను అనుకరించేవే మరి
బహుసా ఇవన్నీ నా కన్నా ఎక్కువగా
నిన్ను అల్లుకున్నాయి కామోసు

2.
నడుస్తున్న చీమ కాలి కింది
వినిపించిన నిశ్శబ్దపు చప్పుడులో
తుమ్మెదపై వాలిన పుప్పొడి రేణువుల సమూహం చేసే సంపర్కాల సడుల్లో
శరీరాన్ని మోస్తున్న ఆత్మొకటి
ఫట్మని పగిలిన చప్పుడులో
సర్పం కుబుస రాపిడిలో
జనించే అస్పష్టపు శబ్దంలో
నా భావపరిది చూసిన వీటన్నిట్లో
నీ అస్థిత్వమే ఎదురవుతుంది

కానీ నువ్వు వినిపించక
కన్ను నీటిపొర కప్పుకుంది
నగ్నకాగితం తన అస్థిత్వాన్ని
వదులుకోలేక బేలగా ఆహ్వానిస్తుంది
రిథమ రాగాలన్నీ పరావర్తనం
చెంది శిశిర సాక్ష్యాలుగా మారుతున్నాయి

3.
ఏముందిప్పుడు నాలో
ఓ పూరేకు సున్నితత్వమే మిగిలింది
పొడిబారిన నా తడి శ్వాసకి
ఓదార్పు తేమను అద్దింది

ఇక నువ్వు వినిపించవు
అసలు నాకు మనసనే యానకమే లేదుగా
–కుమార్ మిథిల్

(Visited 303 times, 37 visits today)