Home / Inspiring Stories / తిరుమల కొండలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా…?

తిరుమల కొండలకు ఆ పేర్లెలా వచ్చాయో తెలుసా…?

Author:

7 hills

మనిషి ఎంత ఎత్తు ఎదిగినా,ఎన్ని సాధించి తానో మహా శక్తినని ప్రకటించుకో చూసినా… ప్రతీసారీ ప్రకృతి ముందు మోకరిల్లుతూనే ఉన్నాడు. తనకు తానుగా అన్వేషించుకున్న ప్రతీసారీ తనను నడిపించే మరో శక్తేదో ఉన్నట్టు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఈ మహా విశ్వానికి ఒక రూపం ఇచ్చి కొలుచుకుంటూనే ఉన్నాడు. ఎత్తైన ప్రదేశాల్లో,దట్టమైన అడవులు ఉన్న ప్రదేశాల్లో అందే ఆక్సీజన్,మనసుని ఉల్లాసంగా ఉంచే నైట్రస్ ఆక్సడ్ ఉండే ప్రదేశాల్లోనే హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయ్. తెలుగు నాట ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తించారు అందుకే శ్రీశైలం,తిరుమల,యాదగిరి గుట్ట,ఇలా ప్రఖ్యాత క్షేత్రాలన్నీ ఎక్కువగా కొండలపైనే నిర్మించబడ్డాయి. ఇక ఉత్తర భారతదేశం లో కశ్మిర్ ప్రాంతం లో ఉన్న దేవాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు…. తెలుగు వారికి వెంకన్న గా,మిగిలిన దక్షిణ భారతం లో పెరుమాళ్ గా,ఉత్తర భారత దేశం లో బాలాజీ గా పూజలందుకునే కలియుగ దైవం తిరుపతి వేంకటేశ్వరుడు ఏకంగా ఏడు కొండలమీద కొలువు తీరాడు…. ఐతే ఏడుకొండల వాడు అనటమే గానీ ఆ కొండల పేర్లూ…. వాటి వృత్తాంతాలూ మామూలుగా మనకు తెలిసింది తక్కువే…. ఆ సమాచారం మీకోసం…..

1.వృషభాద్రి:

1 hill

మనం తిరుమల యాత్ర మొదలు పెట్టగానే మొదటగా ఎక్కేది వృశభాద్రి. పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో చావు తప్పదనుకుని వృషభాసురుడు ‘నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం! నీవున్న ఈ పర్వతానికి ‘వృషభాచలం’ అన్న పేరు ప్రసాదించాలని వేడుకున్నాడు. స్వామి ఆ వరమిచ్చి, త ర్వాత అతణ్ని సంహరించాడు.

2.అంజనాద్రి:

Tirupati Anajantri

సంతానం కోసం అంజనాదేవి వేంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది.ఆ మహాబలున్ని పొందటానికి చేసిన తపస్సు కు వేదికగా నిలిచిన కొండమీదనే వాయు దేవుడి ద్వారా రుద్రుని పదకొండవ అవతారమైన హనుమాన్ అంజనా దేవి గర్భం లో ప్రవేశ పెట్ట బడ్డాడట అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది.

3.నీలాద్రి:

Tirupati Neelathri

ఆపద మొక్కులవాడికి తలమీద గాయం కారణంగా జుట్టు పోయిన కొంత భాగాన్ని కప్పటానికి ఇచ్చే తలనీలాలు ముఖ్యమైనవని తెలుసుకదా. అయితే స్వామివారికి తొలిసారిగా ఆయన కోసం తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి పరవశించిన స్వామివారు ఆమెను అనుగ్రహించి సప్తగిరిలో ఓ కొండకునీలాద్రి అని ఆమె పేరు పెట్టారని ప్రతీతి.

4.గరుడాద్రి:

Garudadri

శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత గరుత్మంతుని పిలిచి, తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది ‘గరుడాచలం’, ‘గరుడాద్రి’గా ప్రసిద్ధి పొందింది.

5.శేషాద్రి:

Seshadri

ఓసారి ఆదిశేషుడికి, వాయుదేవునికి మధ్య ఎవరు గొప్పనే వివాదం రేగింది. ‘నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు’ అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతణ్ని విసిరివేయగా పర్వతంతోపాటు ఇక్కడ వచ్చి పడతాడు. ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుడిని శ్రీనివాసుడు ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు. దాంతో ఇది శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది.

6.నారాయణాద్రి:

Tirupati 1

నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన కొన్ని సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేయడంతో అతడి పేరుమీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది.

7.వేంకటాద్రి:

View of Tirumala from alipiri

‘వేం’ అనగా సమస్త పాపాలను, ‘కటః’ అనగా దహించునది. అంటే, పాపరాశులను భస్మం చేసేది కనుక ఆ మహా పురుషునికి వేంకటేశ్వరుడు అనీ ఆయనను మోసే కొండకు ‘వేంకటాచలం’ అని పేరొచ్చింది..

ఇలా తనని చేరుకోవటానికి అరిషడ్ వర్గాలను (అరి=శత్రువు,షడ్ వర్గాలు=కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యలనే ఆరు లక్షణాలు) దాటితేనే ఏడో దశలో నన్ను చేరుకోగలవూ అని అన్యాపదెశంగా చెబుతూ ఏడో కొండ మీద కొలువు దీరాడు ఆపద మొక్కుల వాడు….

(Visited 4,090 times, 67 visits today)