Home / Inspiring Stories / నీటిని ఒడిసిపట్టి ఎడారి ప్రాంతాన్ని పంట భూమిగా మార్చిన మహిళ.

నీటిని ఒడిసిపట్టి ఎడారి ప్రాంతాన్ని పంట భూమిగా మార్చిన మహిళ.

Author:

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ అనేవారు కానీ నేడు దేసానికే వెన్నెముకగా నిలిచిన ఆ పట్టుకొమ్మలు విరిగిపోయి స్థితిలో ఉన్నాయి. చాలా గ్రామాలలోని ప్రజలు సరైన వర్షాలు, నీరు లేక, పంట ఎండిపోతుంటే చూడలేక పట్టణాలకు వలసపోయి కూలీలుగా బతుకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రకటించినా అవన్నీ పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రజలకు ఉపయోగ పడటం లేదు. ప్రభుత్వాలు కూడా అసలు సమస్యలు పట్టించుకోకుండా ప్రజలకు తాయిలాలు ప్రకటించి పబ్బం గడుపుకుంటున్నాయి. దేశం మొత్తం ఈ సమస్య ఉన్నప్పటికీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మరి దారుణం. ఈ ఎడారిలో వ్యవసాయం మాట దెవుడెరుగు కనీసం ఎండాకాలం లో తాగే నీటికే దిక్కులేని పరిస్థితి. దానితో రాజస్థాన్ లోని చాలా గ్రామాల్లోని రైతులంతా నీటి ఇక్కట్ల వల్ల ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ల్లో కూలీలుగా పని చేయడానికి వలసపోతున్నారు.

అయితే ఈ గ్రామాల, రైతుల దుస్థితిని టివీలో చూసిన అమల రుయా అనే ఒకావిడ మాత్రం ఈ దుస్థితి అంతుచూసేదాకా వదలొద్దని నిర్ణయిచుకుంది. వెంటనే ముంబై నుండి రాజస్తానికి మకాం మార్చేసింది. ఊరూరా తిరిగింది. గ్రామాల చుట్టూ కొండలు ఉండడం గమనించింది. వర్షాకాలం వర్షాలు పడ్డా చాలా నీరు వృధాగా పోవడమూ గమనించింది. వర్షాకాలం లో డ్రిఫ్టింగ్ ద్వారా కొంతమంది రైతులు వ్యవసాయానికి నీరు సమకూర్చుకుంటున్న దానికన్నా వృధాగా పోతున్న నీరే ఎక్కువ . ఎలాగైనా ఈ వృధా అరికట్టాలని అన్ని రకాలుగా ఆలోచించింది.. చివరికి ప్రతి గ్రామం లో చిన్న చెక్ డ్యామ్స్ కట్టడం ద్వారా నీరు జమ చేయొచ్చని నిర్ణయించుకున్నాక గ్రామ గ్రామానికి తిరిగి ఇదే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పింది కానీ ఎవరూ అదేం సాధ్యం కాదని అమలని నమ్మలేదు. అయినా అమల తన పట్టు వీడలేదు. ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించింది. కొండలపైనుంచి కారే నీటిని దిగువ భాగాన ఒక రిజర్వాయర్ లాగ ఒడిసిపట్టి అవసరాలు తీర్చేలా చెక్ డ్యామ్స్ డిజైన్ చేసింది. మొదట గ్రామస్తులు పెద్దగా పట్టించుకోకపోయినా మెల్లగా అమల మాటల మీద గురి కుదిరింది. అమల ప్లాన్ కి దౌసా జిల్లాలోని మంద్వారా గ్రామ ప్రజలు ఓకే అన్నారు. ఆమె చెప్పిన విధంగా కష్టపడి రెండు చెక్ డ్యామ్స్ కట్టారు ..ఆ ఏడాది గ్రామస్తులకు నీటి సమస్య తీరడమే కాకుండా వ్యవసాయం ద్వారా ఆ గ్రామస్తులకు దాదాపు 12 కోట్ల నికర లాభం వచ్చింది.

Woman Who Rescued 2 Lakh Villagers From Poverty

ఈ వార్తా ఒక దావానలం లాగా వ్యాపించింది అన్ని గ్రామాల ప్రజలు ఈ చెక్ డ్యామ్స్ కట్టుకోవాలని ఫిక్సయ్యారు. అమల తో చేతులు కలిపారు. వరుసగా దౌసా, అల్వార్, శిఖర్ జిల్లాల్లోని 156 గ్రామాల్లో 250 చెక్ డ్యామ్స్ నిర్మించారు. అన్ని గ్రామాల్లో నీరు నిలిచి ఎడారి భూములు సాగు భూములుగా మారాయి దాంతో దాదాపు 2 లక్షల ప్రజలు వలసపోకుండా తమ గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకున్నారు. ఏడాదికి ఒక పంట కూడా సరిగా పండించలేని దుస్థితి నుంచి మూడు పంటలు వేసేదాకా వచ్చారు. ఒక్క ఏడాదిలో 156 గ్రామాల పంటల ద్వారా దాదాపు 500 కోట్ల లాభం కళ్ళ చూసారు. ఇదంతా కేవలం చెక్ డ్యామ్స్ ద్వార నీరు నిలువ చేయడం వల్లే సాధ్యమైంది. ఇప్పుడా గ్రామస్తులంతా అమలాని జలమాత గా పూజిస్తున్నారు.. ఒకప్పుడు ఊరినుంచి వలస పోయి కూలీగా పని చేసిన దివాకరన్ అనే రైతు ఇప్పుడు తన గ్రామానికి తిరిగొచ్చి ఏటా 3 పంటలు పండిస్తున్నాడు. ఒక బైక్, ట్రాక్టర్ కూడా కొనుక్కున్నాడు. ఇదే అమల కృషికి నిదర్శనం. అయితే అమల ఇక్కడితో ఆగలేదు తన ట్రస్ట్ ద్వారా మరిన్ని రాష్ట్రాలు, గ్రామాలకు సేవ చేయాలని ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చ్చత్తీస్ ఘఢ్ లోని గ్రామాలలో నీటి నిల్వ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ ప్రకృతి సిద్దమైన నీటిని మనం కూడా వృదా కాకుండా కాపాడుకోగలిగితే దేశానికి పట్టుకొమ్మలైన మన పల్లెలు కళకళలాడుతాయి. రైతు ఇంట సంతోషమే రాజ్యానికి, దేశానికి శుభకరం.

(Visited 215 times, 23 visits today)