Home / Inspiring Stories / గుడివాడ బామ్మా వంటలకి…ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్..!

గుడివాడ బామ్మా వంటలకి…ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్..!

Author:

వంటల కార్యక్రమాలంటే ఎలా ఉంటాయి… ఆధునిక వసతులున్న ఏసీ గదుల్లో చెఫ్‌లు వండుతుంటారు. వ్యాఖ్యాత తయారీని వివరిస్తుంటుంది. లేదంటే ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తమకు తెలిసిన వంటల్ని వండి చూపిస్తుంటారు. నిజానికి మనం ఆ వంటల కార్యక్రమాలు చూస్తామే గానీ.. చాలా పదార్థాలు మనకు తెలియవు. ఒకవేళ తెలిసినా ఎక్కడ అమ్ముతారో తెలియదు. అయినా కొత్త కాబట్టి మనకు కాస్త వింతగానే ఉండి చూసేస్తుంటాం కదా! ఈ బామ్మ మాత్రం.. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈతరానికి ఆ పదార్థాల్ని పరిచయం చేస్తోంది. కుక్కర్లు, మిక్సీలు ఏమీ ఉండవు. వంటకాల్లో వాడేవన్నీ మనకు ఇంట్లో దొరికేవే. ఉప్పు, కారం, మసాలాలు వేయాలంటే ప్రత్యేకంగా కొలతలూ, అందుకు చెంచాలూ అవసరం లేదామెకి. అనుభవంతో ఉజ్జాయింపుగా వేస్తుంది. దాదాపు ఆరు నెలల్లో ఆమ్లెట్‌, రొయ్యలూ, పీతలూ, దోసకాయ చికెన్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటి వంటకాలెన్నో తనదైన శైలిలో చేసి చూపింది. అందుకే దేశ విదేశాల్లోని 42 మిలియన్ల మంది వాటిని చూశారు. ఆ ఛానల్‌కి రెండున్నర లక్షల మందికిపైనే చందాదారులుగా మారిపోయారు. నూట ఆరేళ్ల ఈ బామ్మకి దేశవిదేశాల్లో అభిమానులున్నారు. చీరలూ, గ్రీటింగు కార్డులు పంపుతున్నారు. సన్మానం చేస్తామని ఆహ్వానం అందిస్తున్నారు. అదంతా ఈ బామ్మ చేతివంట మహత్యమే.

వందేళ్ల బామ్మా వంటలకి...ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్..!

అద్దాల్లేకుండానే: ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలికి 10 కిలోమీటర్ల దూరంలో గుడివాడ అనే పల్లెటూరులో ఉండే మస్తానమ్మ నిన్న మొన్నటి వరకూ పొలం పనులు చేసుకునేది. ఇప్పటికీ చూపు బాగా కనిపిస్తుంది. కూరగాయలు కోసినా, వంటలు వండి వార్చినా కళ్లద్దాలు అవసరం లేదు. చురుగ్గా ఉంటుంది. చకచకా నడుస్తుంది. వంటలు చేసేటప్పుడు ఆమె కూరగాయలు కత్తిపీటతో కోస్తుంది. చేస్తూనే వాటి గురించి చెబుతుంటుంది. మస్తానమ్మ పుట్టి పెరిగిందీ, అత్తారి వూరు గుడివాడే. ఆమె ఆ వూరు సరిహద్దులు దాటి బయటకు వెళ్లింది చాలా అరుదు. పదకొండేళ్ల వయసులోనే పెళ్లైంది. ఐదుగురు పిల్లలు. నలుగురు పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనుమలు ఉన్నా… తన భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే జీవితం వెళ్లదీసేది.

వందేళ్ల బామ్మా వంటలకి...ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్..!

రుచి చూశాకే ఆలోచన: ఏడు నెలల క్రితం ఆమె మనవడు లక్ష్మణ్‌ స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి బామ్మని చూడటానికి వెళ్లాడు. మనవడు వచ్చాడని తానే స్వయంగా టొమాటో కూర చేసి అన్నం వండి పెట్టింది. ఆ వయసులో ఆమె చాకు కూడా లేకుండా టొమాటోను ముక్కలుగా కోయడం, వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఆసక్తిగా అనిపించాయి. పైగా కూరకూడా అద్భుతమైన రుచి. దాంతో వారి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె చేత ఆరుబయట వంట చేయించి యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందని అనుకున్నారు. అదే విషయం మస్తానమ్మని అడిగారు. ‘పాత కాలం వంటలు మీకేం నచ్చుతాయి నాయనా’ అంటూ బోసి నోటితో నవ్వేసింది. అయినా వాళ్లిద్దరూ వదలకుండా ఆమెతో పల్లెటూరి పద్ధతితో బెండకాయ కూర చేయించారు. అదే మొదటి వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంట వెంటనే మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్‌ అనే ఛానల్‌ ద్వారా పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. వండి వార్చడంలో ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన అరవై శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు బాగా స్పందన వచ్చింది. నెలరోజుల్లో ఆరులక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, రోస్టెడ్‌ ప్రాన్స్‌నూ ఎక్కువ మందే వీక్షించారు.

ఎల్లలు దాటిన అభిమానం: ఈ వంటలను భారతీయుల తరవాత అమెరికా, జర్మనీ, ఇంగ్లండ్‌, పాక్‌లో ఉన్న ప్రవాస భారతీయులతోపాటు, విదేశీయులూ చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అవ్వడమే కాదు మొన్న ఆమె పుట్టిన రోజుసందర్భంగా పాక్‌ నుంచి ఫ¾ర్హాన్‌ అనే ఓ అభిమాని చీర, గ్రీటింగ్‌ కార్డు పంపాడు. అది చూసుకుని మస్తానమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆమెరికా, న్యూజిలాండ్‌ నుంచి కొన్ని భారతీయ కుటుంబాలు ఆమెను సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. లండన్‌కి చెందిన బార్‌ క్రాఫ్ట్‌ అనే ఛానల్‌ నుంచి కొందరు వచ్చి ఈ మధ్యనే మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకుని వెళ్లారు. బీబీసీ కూడా అదే పనిలో ఉంది. ఇక ఈ వంటలను చూసేవారిలో యువతులే ఎక్కువ. వారు తిరిగి ఇదే వంటలను ప్రయత్నించి వీడియోలు తీసి బామ్మ వంటకి కామెంట్‌గా పోస్టు చేస్తున్నారు. అంతేకాదు కొత్త వంట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే జాబితాలోనూ వారున్నారంటే నమ్ముతారా!

Youtube Channel Link: Youtube.com/CountryFoods

BBC Article Link: www.bbc.com/indian-grandmother–youtube-star

Source : Eenadu

(Visited 576 times, 1 visits today)