ఆధార్‌ను డీ-లింక్ చేసే ప్రణాళికను పదిహేను రోజుల్లో ఇవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) టెలికాం సంస్థలను కోరింది. ఆధార్‌ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
టెలికాం సంస్థలు సహా ప్రైవేటు కంపెనీలు ఆధార్ నంబరు అడగడానికి వీల్లేదని స్పష్టంచేసింది.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉడాయ్ భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తదితర టెలికాం సేవల కంపెనీలకు సర్య్కులర్ పంపించింది.
టెలికాం సంస్థలు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను నిలిపివేసే, ఆధార్‌ను డీ-లింక్ చేసే ప్రణాళికలను అక్టోబరు 15వ తేదీ నాటికి ప్రణాళిక అందజేయాలని ఉడాయ్ నోటీసులో పేర్కొంది. వ్యక్తుల ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్ ఉన్న ఆధార్ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలు డిమాండ్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. అయితే ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని కోర్టు స్పష్టంచేసింది.