Home / Political / ఆరు నూరైనా ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చుతాం – కేసీఆర్

ఆరు నూరైనా ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చుతాం – కేసీఆర్

Author:

“ తెలంగాణ ప్రయోజనాలకు ఏది అవసరమో, ఏది మంచిదో అదే చేస్తాం. అంతేతప్ప… అది చేయాలి, ఇది చేయాలని అరిచి గీ పెట్టినా చేయం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. వక్రబుద్ధులు, వక్రీకరణలు మానుకోవాలని విపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ సాగునీటి విధానాన్ని అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రజల ముందుంచుతామని అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కోసం ఏళ్లు, దశాబ్దాలు వేచి చూడాలి. నీళ్లు మాత్రం ధవళేశ్వరం చేరుకోవాలి. ఇదే వారు అనుసరించిన వ్యూహం’’ అని అన్నారు. కేవలం 14 టీఎంసీల నీటి నిల్వతో  ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుల ద్వారా 16.50 లక్షల ఎకరాలకు ఎలా నీరు అందిస్తారని ప్రశ్నించారు. కనీసం 24 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకైనా డిజైన్లు లేవన్నారు. 200 టీఎంసీల నీరు నిల్వ లేకుండా ప్రాజెక్టును కడితే అర్థం పర్థం ఉండదన్నారు. ‘‘ దేవాదుల ఎత్తిపోతల పథకానికి 7,500 కోట్లు వెచ్చించారు. 170 రోజుల పాటు నీళ్లిచ్చేందుకు 71 మీటర్ల లెవెల్లో లిఫ్టులు నిర్మించారు. కానీ… వీటిద్వారా 70 రోజులు కూడా నీళ్లు రావడం లేదు. నీటిని ఎత్తిపోసే చోట కనీసం ఒక ఆనకట్టనైనా నిర్మించలేదన్నారు. ఎవరి వాటాలను వాళ్లు జేబులు నింపుకొని పోయారు’’ అని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గోదావరి, కృష్ణా నదుల ద్వారా 1280 టీఎంసీల నీటిని ఇస్తున్నామని చెప్పారు. ఈ నీటి ద్వారా 40 లక్షలా 40 వేల హెక్టార్ల భూములు సాగు కావాలి. ఇందులో తెలంగాణ నీటి పారుదల ఎంత.. ఆ లెక్క ప్రకారం ఇంకా నీళ్లు మిగలాలి ? వారు చెప్పిన ప్రకారం బొట్టుబొట్టు నీటిని తీసుకునేందుకు తగిన ప్రణాళికలు తయారు చేసుకుంటాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిగిలో నిర్వహించిన సభలో ఈ ప్రాంతానికి  ప్రాణహిత -చేవేళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావని, పాలమూరు ఎత్తిపోతల ద్వారానే నీళ్లు వస్తాయని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పానన్నారు కేసీఆర్. ఆ జిల్లా రైతుల సాగుకు రెండున్నరేళ్లలో కడుపునిండా నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వాటర్ గ్రిడ్ పనులు రెండేళ్లలో 90 శాతం పూర్తవుతాయని కేసీఆర్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎస్ఎఫ్సీ నిధులు, ప్రత్యేకంగా విడుదల చేసే వెయ్యి కోట్లు అన్నీ కలుపుకొని గ్రామజ్యోతికి నాలుగేళ్లలో 25 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

(Visited 52 times, 1 visits today)