హైదరాబాద్ మెట్రో రైలు మరో ముందడుగు వేసింది. భాగ్యనగరవాసుల మరో కల నిజమైంది. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. సోమవారం గవర్నర్ నరసింహన్ ఈ కొత్త మార్గాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అమీర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్ల పొడవులో 17 మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందని మెట్రో రైలు అధికారలు తెలిపారు.
కొత్త మార్గం ప్రారంభమవడంతో ఇక మియాపూర్ నుంచి నేరుగా ఎల్బీనగర్‌కు 29 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం సాగనుంది. గతంలోనే మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు దాదాపు 13 కిలోమీటర్ల రైలు మార్గం ప్రజలకు అందుబాటులోకి రాగా, దీన్ని అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు పొడగించారు. ఇది దేశంలోనే అతి పెద్ద పొడవైన మెట్రోస్టేషన్‌గా గుర్తించవచ్చు.