పోలీసు కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో యాపిల్ సంస్థలో పనిచేస్తున్న 38ఏళ్ల ఐటీ ఉద్యోగి మృత్యువాతపడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. రాత్రి 1.30 గంటల సమయంలో గోమతి నగర్ ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్ వాహనాలు తనిఖీ చేస్తుండగా వివేక్ తివారీ అనే వ్యక్తి ఆపకుండా తన ఎస్‌యూవీని ముందుకు పోనిచ్చాడు. కారు ఆపలేదని, యాపిల్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తోన్న వివేక్ తివారిపై కాల్పులు జరిపాడు పోలీస్ కానిస్టేబుల్. యూపీలో…ముకద్మూర్ పోలీస్ స్టేషన్ దగ్గర్లో…. గోమతి నగర్ లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఘటనపై యూపీ డీజీపీ ఓపీ సింగ్ తో మాట్లాడారు యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్.
వివేక్ తివారీ ఎడమ చెవి దగ్గర బుల్లెట్ తగిలిందని, ట్రీట్ మెంట్ సమయంలో వివేక్ తివారీ చనిపోయనట్లు లోహియా హాస్పిటల్ డైరక్టర్ దేవేంద్ర సింగ్ నెగీ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా లోహియా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి…అర్ధరాత్రి 2 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఉన్న కారుని చూశానని, అనుమానం రావడంతో కారు దగ్గరకు వెళ్లి చూశానని తెలిపాడు. అయితే డ్రైవర్ వివేక్ తివారీ తనను చంపేందుకు మూడుసార్లు తనపై కారుని ఎక్కించేందుకు ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసం వివేక్ తివారీపై కాల్పులు జరిపినట్లు తెలిపాడు.