Home / Entertainment / బజార్‌….. సినిమా రివ్యూ

బజార్‌….. సినిమా రివ్యూ

Author:

సైఫ్‌ అలీఖాన్‌ ఇటీవల ‘రంగూన్‌’, ‘షెఫ్‌’, ‘కాలాకండి’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేదు. ఇప్పుడు ‘బజార్‌’తో మరో ప్రయత్నం చేశారు. స్టాక్‌ మార్కెట్‌ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రంతోనైనా సైఫ్‌ మళ్లీ ట్రాక్‌లోకి వస్తారా? చూద్దాం.

కథ:

శకున్‌ కొఠారి(సైఫ్‌)కి బాగా డబ్బు సంపాదించాలని కోరిక. టాటా, బిర్లా, అంబానీల జాబితాలో తన పేరును చూసుకోవాలని కలలు కంటుంటాడు. స్టాక్‌ మార్కెట్ వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంటాడు. రిజ్వాన్‌(రోహన్‌ మెహ్రా) అనే ఓ తెలివైన యువకుడు శకున్‌ సంస్థలో చేరి ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే తను ఎంతో అభిమానించే శకున్‌ నిజస్వరూపం సంస్థలో చేరాక తెలుస్తుంది. మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలే శకున్‌కు ముఖ్యమని అర్థమవుతుంది. అయితే రిజ్వాన్‌ తెలివిని గుర్తించిన శకున్‌ అతనికి ఓ పని అప్పగిస్తాడు. అది పూర్తి చేసే క్రమంలో రిజ్వాన్‌కు ఎదురైన పరిస్థితులేంటి? స్టాక్‌ మార్కెట్‌లో జరుగుతున్న తెర వెనుక బాగోతాలేంటి? ప్రియా రాయ్‌(రాధికా ఆప్టే)కి, శకున్‌కు మధ్య ఉన్న సంబంధమేంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

స్టాక్‌మార్కెట్‌ నేపథ్యంలో వచ్చే చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే సినిమా మాత్రం ఆసక్తికరంగా, జాగ్రత్తగా తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్న సినిమా ద్వితీయార్ధంలో నెమ్మదిస్తుంది. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి మధ్య సంబంధం అంత సులువుగా అర్థంకాదు. స్టాక్‌మార్కెట్ల‌పై బాగా పట్టు ఉన్న వారికి సినిమా నచ్చుతుంది.మొత్తానికి ఈ ‘బజార్‌’లో ఎవరు గెలుస్తారు? అన్న ఆతృత ప్రేక్షకుడికి చివరి దాకా ఉంటుంది. ‘నేను లెక్కల్ని నమ్ముకుంటా. నువ్వు భావోద్వేగాలను నమ్మకుంటావ్‌’ అనే సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే స్కాట్‌ మార్కెట్‌లో జరిగే ట్రేడింగ్, మీడియా, పొలిటికల్‌ రిగ్గింగ్‌ ఎలా ఉంటుంది? తదితర విషయాలపై అవగాహన కల్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

baazaar-Movie-Review-and-rating

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఇందులో సైఫ్‌, రోహన్‌, రాధికా ఆప్టేల పాత్రలే ప్రధానం. వ్యాపారవేత్త శకున్‌ పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ ఒదిగిపోయారు. అతని ఆటిట్యూడ్‌ కూడా ఆకట్టుకుంటుంది. అలనాటి బాలీవుడ్‌ నటుడు వినోద్‌ మెహ్రా కుమారుడు రోహన్‌ కూడా రిజ్వాన్‌ పాత్రలో చక్కగా నటించారు. రోహన్‌, సైఫ్‌ల మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. రాధికా ఆప్టే కూడా తన అందంతో, నటనతో ఆకట్టుకున్నారు. సన్నివేశాలకు తగ్గట్టుగా సంగీతం కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • సైఫ్‌ నటన
  • కథ
  • సంభాషణలు
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

  • ఆసక్తికరంగా లేని సన్నివేశాలు
  • ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

పంచ్ లైన్:  బజార్‌…. వ్యాపారులకు మాత్రమే..!.

రేటింగ్ :  3/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘బజార్‌’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)