Home / Latest Alajadi / తెలంగాణ ఎన్నికల ఫలితాలనుండి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఇదే అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!

తెలంగాణ ఎన్నికల ఫలితాలనుండి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఇదే అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!

Author:

కేసీఆర్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు కకావికలమైపోయాయి. కూటమి అంటూ నేతలు కలిసినా…ప్రజలు మాత్రం కలవలేదు. చివరికి కూటమికి ఓటమి తప్పలేదు. సరైన వ్యూహం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడం కూడా కూటమి వైఫల్యానికి కారణమైంది. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఓట్ల బదలాయింపులో ఉన్న లోపాలను ఈ ఫలితాలు బయటపెట్టాయి.

ఇక తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఏపీలో చూపిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. బయట గెలవలేకపోయిన చంద్రబాబు ఇంట అయినా గెలుస్తారా అనే వాదనలు వినపడుతున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి చక్రం తిప్పగలరా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇక తెలంగాణలో ఒక యుద్ధం ఓడిపోయిన చంద్రబాబు ఇక జాతీయ స్థాయిలో జరిగే యుద్ధంలో గెలవాల్సి ఉంది.

పొత్తుల్లో ఓట్ల బదలాయింపు చాలా కీలకం. తాజా ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌, తెదేపా మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేర్వేరు పార్టీలకు చీలిపోయింది. దీనికి తోడు భారీగా బరిలోకి దిగిన రెబల్స్‌ విజయావకాశాలను దెబ్బతీశారు. కాంగ్రెస్‌ 19 మందిపై వేటు వేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోపక్క భాజపా, ఎంఐఎంలతో ఎటువంటి పొత్తు లేకుండా తెరాస ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. ఇది అంతిమంగా తెరాసకు లబ్ధి చేకూర్చింది. మరోపక్క ఎంఐఎంకు రాష్ట్రంలో ఉన్న సానుభూతి ఓట్లు మాత్రం నిరాటంకంగా తెరాసకు బదిలీ అయ్యాయి.

ముందుగా టీఆర్ఎస్‌తో పొత్తు కోసం ఆయన ప్రయత్నించారు. తెలుగుదేశం ముఖ్య నేతలకు సీట్లు ఇస్తే చాలని కోరారు. కానీ తెలంగాణలో టీడీపీ ఉండాల్సిన అవసరం లేదని భావించిన కేసీఆర్ అందుకు అంగీకరించలేదు. కేసీఆర్ నో అన్నాకే బాబు చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్ తో చేతులు కలిపి కూటమి ఏర్పరచారు.

‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్‌’ అనే విషయాన్ని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరోసారి విఫలమైంది. పార్టీ అధినేత రాహుల్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీలు వచ్చి ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ వాదం తలకెత్తుకొన్న బలమైన నేతలు ఎవరూ తెరపైన లేకపోవడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది. తెలుగుదేశంతో పొత్తు ఉండటంతో ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్దగా ప్రయత్నించలేదు. కేసీఆర్‌పై విమర్శలకే ఎక్కవుగా పరిమితం అయ్యారు.

ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఫలితాలతో చంద్రబాబు కాంగ్రెస్‌ను విడిచి వేరే పార్టీతో జట్టుకట్టే పరిస్థితి లేదు. ఒకవేళ మరో పార్టీతో వెళదామన్నా తనకు లాభం చేకూర్చే పార్టీ ఇక ఏదీ మిగలలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా ఆశించిన స్థానాలకంటే కాస్త ఎక్కవగా వచ్చేవని మాట వినిపిస్తోంది. ఇక రాజధాని అమరావతి పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడం ఏపీలో అడుగంటుతున్న అభివృద్ధి, పలు ప్రాంతాల్లో కరువులాంటి అంశాలు 2019 ఎన్నికల్లో బాబుకు మైనస్ కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. మొత్తానికి తెలంగాణ ఫలితాలు బాబు ఫేట్‌ను మారుస్తాయా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

(Visited 1 times, 1 visits today)