Home / Inspiring Stories / చానెల్ మారుతోంది – నష్టాల దారిలో తెలుగు టీ వీ ఛానెల్స్

చానెల్ మారుతోంది – నష్టాల దారిలో తెలుగు టీ వీ ఛానెల్స్

Author:

తెలుగు విజువల్ మీడియా లో సంక్షోభం తలెత్తిందా? చూడబోతే అలానే అనిపిస్తోంది. పేరు మోసిన టీ వీ ఛానెల్స్ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోకి నిజంగా నే నెట్టబడ్డాయా? లేక, అలాంటి ఒక కృత్రిమ వాతావరణం సృష్టించటానికి యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయా? ఇది నిజంగా గందరగోళ వాతావరణమే. టీ వీ ఛానెల్స్ లో ఉద్యోగాలు చూసుకుని పెళ్లిళ్లు చేసుకోవటం….మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకపోసుకోవటమే అన్న మాదిరి తయారందనేది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. మొన్నటికి మొన్న …ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్ లో ఉన్న ఒక తెలుగు న్యూస్ చానెల్ లో తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడటానికి యాజమాన్యం నానా అగచాట్లు పడవలసి వచ్చింది. మూడు నెలల జీతాలు ఆపటానికి కారణం సీనియర్ మేనేజ్ మెంట్ క్యాడర్ లో కొత్తగా చేరిన ఒక `ఔత్సాహికుడే’ నని అందరూ చెవులు కోరుక్కుంటున్నారు. జూభ్లీ హిల్స్ లోనే ఉన్న ఒక ప్రముఖ న్యూస్ చానెల్ యజమాని ని  చూసి, తాను కూడా టీ వీ ఛానెల్స్ మొదలెట్టిన మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త-రియల్ ఎస్టేట్ లో కింగ్ అని పేరున్న పెద్దాయన –తన దూకుడు ప్రవర్తన కారణంగా విలువైన సీనియర్లను స్వల్ప కాలం లో పోగొట్టుకున్నారు. అయితే, ఇన్నాళ్లూ జీతాలు సక్రమంగా ఇస్తూ వచ్చిన ఆ పెద్దాయనకు..తాజాగా ఎందుకు ఫండ్స్ సమస్య వచ్చిందనే దాని మీదే అందరికీ సందేహాలున్నాయి.  ఆ విషయం అలాగ ఉంచితే, కొత్తగా మరో రెండు ఛానెల్స్ దూసుకు రాబోతున్నాయి. దీంతో తెలుగు టీ వీ ఛానెల్స్ సంఖ్య 21 కి చేరబోతోంది.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా `మీడియా 24’ పేరిట రాబోతున్న చానెల్ లోగో ఆవిష్కరణ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన సర్జికల్ రంగానికి చెందిన పారిశ్రామిక వేత్త ఆరంభిస్తున్న ఈ చానెల్ కు తెలుగు విజువల్ మీడియా లో తనదైన ముద్ర వేసుకున్న నేమాని భాస్కర్ సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు. టీం బిల్డింగ్ లో నూ, ప్లానింగ్ లోనూ నేమాని భాస్కర్ కున్న అపారమైన అనుభవం, అలాగే ఆయనకున్న విస్తృత పరిచయాలు ఆయన చానెల్ కున్న ప్లస్ పాయింట్లయితే…పూర్తిగా కొత్త కెరటాలతో ఆయన చేయాలనుకుంటున్న సాహసంపైనే పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎక్స్ ప్రెస్ టీ వీ సంక్షోభం తర్వాత, తన 19 మంది టీం తో బయటకు వచ్చేసిన నేమాని భాస్కర్ ఇన్నాళ్లూ కూడా..తన సహచరులకు ఆర్ధిక పరమైన అండదండలు ఇస్తూ వచ్చారు. ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న నెమని భాస్కర్, సినిమా రంగం లో సూపర్ స్టార్ట్ కృష్ణ లాగా ..ఇప్పుడు న్యూస్ చానెల్ లో పూర్తిగా కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు.

 

 అమరావతి కేంద్రంగా `మీడియా 24’

ఇక , ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో రాబోతున్న భారత్ టీ వీ కూడా, ఇటీవలే సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చానెల్ మార్కెటింగ్ కు పూర్తిగా స్వామి పరిపూర్ణానంద మీదే ఆధారపడిన ఆ చానెల్ లో `ఫేస్ ఆఫ్ ద చానెల్’ అని చెప్పుకోగలిగిన వాళ్ళ కోసం కాగడాలు పెట్టి వెతుకుతునారు. మొన్నటి వరకూ అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మాగజైన్ కు సంపాదక బాధ్యతలు వహించిన సీనియర్ పాత్రికేయుడు జి వల్లీశ్వర్ ఈ చానెల్ కు చీఫ్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీం లో ..ఒక్క రామ్మోహన్ తప్పించి, గుర్తుపట్టగల ఒక్క సీనియర్ ఫేస్ లేకుండా చాలా ధైర్యంగా ముందుకు దూసుకు వస్తున్న ఈ చానెల్ మీద ఎవరూ ఎలాంటి అంచనాలకూ రాలేకపోతున్నారు. మరి ఈ రెండు ఛానెల్స్ తెలుగు విజువల్ మీడియా మార్కెట్ లో ఎలాంటి ముద్ర వేసుకోగలవో కాలమే నిర్ణయించాలి.

 

(Visited 204 times, 1 visits today)