Home / Latest Alajadi / చెట్టుని కొట్టినందుకు పగబట్టిన కాకులు..!

చెట్టుని కొట్టినందుకు పగబట్టిన కాకులు..!

Author:

పాములు పగబడుతాయనే మాట విన్నాం.. కానీ కాకులు కూడా పగబట్టడం వింతే మరి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రం బొగుడ గూడెంలో కాకుల జంట ఓ యువరైతును పగబట్టాయి! అతను ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తెల్గ రమేశ్‌ అనే వ్యక్తిని ఓ కాకుల జంట గత పది రోజులుగా వెంబడిస్తోంది. రమేశ్‌ ఇంటి సమీపంలో ఉన్న వేపచెట్టు ఇటీవల గాలి దుమారాలకు ఒక వైపునకు వంగింది. రోడ్డు వెంట రాకపోకలకు ఇబ్బందిగా ఉందని రమేశ్‌ ఆ చెట్టు కొమ్మలను నరికాడు. అదే వేప చెట్టుపై ఉన్న కాకి గూడును అతను గమనించ లేదు.

crows revenge

ఆ కొమ్మలు నరుకుతుండగా గూట్లో ఉన్న కాకిపిల్లలు కింద పడ్డాయి. ఇక అంతే.. ఆ కాకులు వెంటనే రమేశ్‌పై దాడికి దిగాయి. కావు కావు మంటూ అరుస్తూ, కాళ్లతో కొడుతూ, ముక్కుతో పొడుస్తూ బీభత్సం సృష్టించాయి. వాటి గోలకు తట్టుకోలేక ఇంట్లోకి పరిగెత్తాడు. కిందపడ్డ కాకి పిల్లలను కాపాడాలని గ్రామస్తులు సూచించారు. దీంతో వాటిని తట్టలోకి తీసుకుని కొమ్మలు లేని ఆ వేప చెట్టుపై పెట్టాడు. అప్పటి నుంచి కాకులు వాటి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నాయి. కానీ, రమేశ్‌ను మాత్రం వదిలిపెట్టడం లేదు. చెట్టు పక్కనే ఉన్న గడ్డివాము వద్దకెళ్లి ఎడ్లకు మేత వేద్దామన్నా వెంబడిస్తున్నాయి.

వాడలో కనిపించినా, రోడ్డు మీదకొచ్చినా దాడికి దిగుతున్నాయి. దీంతో రమేశ్‌ వాటి కంటపడకుండా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ‘‘కాకులతోని నాకిదేం గోస, వాటి పగ గింత ఘోరంగా ఉంటుందనుకోలేదు. వాటి పిల్లలను కింద పడేసినందుకే నా మీద కసి పెంచుకు న్నయ్‌. మా బొగుడగూడెంల ఎక్కడ కనపడ్డా నాపై దాడికి దిగుతున్నాయి. వాటికి కనపడకుండా చేన్లకు, ఎవుసపు పనులకు పోతాను’’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

(Visited 691 times, 1 visits today)