ఉత్తర కోస్తా, ఒడిశాను తిత్లీ తుపాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. రేపు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-సంతబొమ్మాళి మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్‌పూర్‌కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, లావేరు, రణస్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పొందూరు, సంతకవిటి, జి.సిగడాం మండలాలు.. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, పూసపాటిరేగ, గరివిడి, నెల్లిమర్ల, గుర్ల, విజయనగరం, డెంకాడ, భోగాపురం, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, దత్తి రాజేరు.. విశాఖపట్నం జిల్లాలో బీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, విశాఖ రూరల్ మండలాలపై ప్రభావం పడే అవకాశముంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్-హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, బిలాస్‌పూర్ మీదుగా దారి మళ్లించారు.
కళింగపట్నం – గోపాల్ పూర్ మధ్య రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల సమయంలో టిట్లీ తుఫాన్ తీరం దాటనుంది… దీంతో పోలీస్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్తు, మెడికల్ విభాగాలను అలర్ట్ చేశారు కలెక్టర్. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా… భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు , చెట్లు నేలకూలే అవకాశం ఉందని… ప్రజలెవరూ ఇళ్లను వీడి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి… సముద్రంలో అలజడి, తీరంవెంబడి బలమైన గాలులుండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.