Home / Entertainment / డబ్బింగ్ సీరియల్స్ ప్రపంచంలో కొద్ది సేపు..

డబ్బింగ్ సీరియల్స్ ప్రపంచంలో కొద్ది సేపు..

Author:

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలలో వచ్చిన ఒక విలక్షణమైన ఫేస్ బుక్ పోస్టింగ్ ఇది. నిజంగా హిందీ-తెలుగు డబ్బింగ్ సీరియల్స్ ఎంత దుర్మార్గమైన భాషను ప్రోత్సహిస్తున్నాయో…ఎంత వికృత భాషా పోకడలకు తెగబడుతున్నాయో సమగ్రంగా ..సవివరంగా తెలియచేస్తూ వచ్చిన ఒక అద్భుతమైన పోస్టింగ్ ఇది! సిద్దార్థ్ గౌతమ్ అనే ఒక ముఖ పుస్తక రచయిత వెలువరించిన ఈ హాస్య స్ఫోరక విశ్లేషణ ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఒక వైరల్ గా, ఇంకా చెప్పాలంటే ట్రెండీ గా నడుస్తోంది. మీరూ చదివి ఆనందించండి….

“ఆ ప్రకారంగా..మధ్యాహ్నం రెండింటికి నేను నా గదిలో పడుకున్నాను. నాలుగున్నరకి లేచేసరికి తెలుగు చానళ్ళలో వచ్చే డబ్బింగు సీరియళ్ళ ప్రపంచంలో ఉన్నాను.

చుట్టూ చూసాను..ఒక పెద్ద, ధనవంతుల ఇల్లు. కాఫీ కలుపుకుందామని వంట గది వైపు నడిచాను. హాలులో నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళని చూస్తే తెలుగు వాళ్ళ లాలేరు. ఒక్కొక్కరు ఒక్కో రంగు పట్టు చీర కట్టుకుని ఉన్నారు. కట్టు పర్లేదు కాని, బొట్టు లో ఏదో తేడా ఉంది. కాస్త దగ్గరికెళ్ళి చూసాను – నీలి, ఆకుపచ్చ, గులాబి రంగులతో నుదుటి మీద రథం ముగ్గులు వేసినట్టున్నాయి.

ఆ నలుగురిలోకి రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకునే ఒక పెద్దావిడ..సోఫా పక్కన చేతిలో ట్రే పట్టుకుని నిలబడ్డ అమ్మాయితో – “ఇలా చూడు గోపికా…నువ్వు ఏదైతే అన్నావో అదైతే మళ్ళీ ఒకసారి చెప్పు..అలా అని ఇక నేనైతే అడిగాను కదా..” అంది..

వాళ్ళ చీరలు, నుదురు చూస్తున్న నేను వాళ్ళ నోళ్ళ వైపుకి నా కళ్ళు తిప్పాను. ఇందాక ఆవిడ అన్న మాటల్లో ఏదో తిరకాసు ఉంది. ఎందుకైన మంచిదని పై పేరా మళ్ళీ చదివాను. కొబ్బరికాయ పీచు వలిచినట్టు ఆ వాక్యంలోని అనవసరమైన చెత్తనంతా తీసి పక్కన పారేసాను. నో పార్కింగ్ లో ఉన్న పదాలని కాస్త అటూ, ఇటూ జరిపాను. అప్పుడు అర్థమయ్యింది…”ఏమన్నావు?” అని ఆవిడ ప్రశ్న.

ఇంత శ్రమ పడ్డాక అర్జెంటుగా నా బుర్రకి గ్లూకోజు ఎక్కించాలి.

ఏమండీ..కాఫీ…” అని అడుగుతున్నా వినిపించుకోకుండా నా పక్కన ట్రే పట్టుకుని నిలుచున్న అమ్మాయి – “అదైతే అత్తయ్య గారు..నేను ఇంకా కాంచన గారు కలిసి మరి ఆనంద్ గారి సాక్సులు రెండు వాషింగు మిషన్ లో వేసి అలాగే ఇక ఆనంద్ గారి సాక్సులు ఉతికేసి అలాగే ఇంక తరువాత చూస్తే ఒకే సాక్సు ఉంది అత్తయ్య గారు…” అని ఏడవటం మొదలుపెట్టింది.

నేను గట్టిగా ఊపిరి తీసుకున్నాను. ఈ కొత్త వాక్యం డీకోడ్ చేద్దామనుకునే లోపుఆ పెద్దావిడ చేయి పైకి లేపి కళ్ళు మూసుకుంది. భలే..కనురెప్పలకి కూడా చీర మ్యాచింగ్ రంగు వేసుకుంది.

కళ్ళు తెరిచి ఆ ట్రే అమ్మాయి వైపు చూసి – “నువ్వైతే ఇక మరి మాటలు అనేవి మాట్లాడకు గోపిక. కోపము, అలాగే చిరాకు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇక మరి రెండూ నాకు వచ్చాయి అని నేను అంటున్నాను. ఆ సాక్సు ఎప్పటివరకు ఐతే నువ్విక పట్టుకురావో, అలాగే మరి పట్టుకుని వచ్చి నాకు మరి చూపించవో..అప్పటిదాక ఇక నువ్వు మరి ఈ ఇంటి కోడలి స్థానం లో అలాగే ఆనంద్ భార్య స్థానంలో అలాగే కాంచన వదిన స్థానంలో ఉండవు అని నేనైతే ఇక చెబుతున్నాను.” అని మన దేశ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించింది.

నా తల లోపల నా బుర్ర వాంతి చేసుకుంది. పాపం పైత్యం చేసినట్టుంది.

గోపిక తన ఏడుపు కంటిన్యూ చేస్తూ – “అత్తయ్యా గారు…నేను ఇక నా కృష్ణయ్య గారిని ప్రార్థిస్తాను. ఆయన నా ప్రార్థన విని..ఆనంద్ గారి సాక్సు ఏదైతే ఉందో మరి ఇక ఆ సాక్సు తప్పకుండా నాకైతే తిరిగి ఇచ్చి నా కోరిక తీరుస్తాడు అత్తయ్య గారు..” అని ఏడుస్తూ దేవుడి గదిలోకి పరిగెట్టి తలుపు వేసుకుంది. పాపం దేవుడు..

kodala kodala koduku pellama

 

నేను నోరు మెదపకుండా వంటగది వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక గదిలోంచి ఏవో గిన్నెల చప్పుడు వినబడింది. లోపలికి వెళ్ళాను. ఒక పదేళ్ళ అమ్మాయి, ఒక ముసలావిడ ఉన్నారు.

అరే ఆనంది..నీకు బుధ్ధి అనేది ఉందా? ఉందా నీకు బుధ్ధి అనేది? బుధ్ధి అనేది నీకు ఉందా?” అంది ఆ ముసలావిడ.

ఆ చిన్నమ్మాయి “ఇహి..ఇహి…” అని ఏడ్చినట్టు ఏడ్చింది..

మళ్ళీ ఆ పెద్దావిడ అందుకుంది – “అరే పిల్లా..ఈ గదిలోకి రమ్మని నీకు చెప్పిన తెలివి అలాగే భయభక్తులు లేని వ్యక్తి ఎవరు అన్నది నువ్విక నాకు చెబుతావా లేదా అన్న విషయం నేను అడుగుతున్నానని నీకు చెబుతున్నాను………తెలివి అలాగే భయభక్తులు లేని…..”

నేను చెవులు మూసేసుకున్నాను. ఇందాకంటే నాలుగు పదాలున్న వాక్యంఇప్పుడు వంద కిలోమీటర్లున్న ఈ వాక్యం లోని పదాలని కూడా వాక్యతాత్పర్యార్థాలతో సహా తర్జుమా చేసి చేసి చెబితే ఇక చచ్చానే. ఆవిడ నోరు కదులుతున్నంత సేపు చెవులు మూసుకునే ఉన్నాను. చెప్పవలసినదంతా చెప్పేసి మంచి నీళ్ళు తాగుతున్నప్పుడు చెవుల మీది నుంచి చేతులు తీసాను.

ఆ పిల్ల..”ఇహి..ఇహి..బామ్మగారు…ఇహి…ఇహి..నేను అలాగే జగదీష్…ఇహి..ఇహి…కలిసి బడికి వెళ్ళాలని..ఇహి..ఇహి…బామ్మ గారు…ఇహి..ఇహి…..”

ఎహె..ఆపండి..ఇక్కడ కాఫీ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి..చస్తున్నాను మీ దిక్కుమాలిన ఎడుపులతో” అన్నాను కోపంగా…

అరే..నువ్వు ఎవరివైతే ఉన్నావో అసలు లోపలికి ఏ విధంగా వచ్చి ఇలా నా ముందు నిలబడి అలాగే మాట్లాడుతున్నావు? నా ముందు నిలబడి…..” అని నన్ను తగులుకుంది ఆ ముసలావిడ..

balika vadhu kal;yani devi and anandhi

 

నేను గది బయటకు పరిగెట్టాను. రెండడుగులు వేసేరికి పక్క గదిలోంచి కమ్మటి కాఫీ సువాసన. ఆహా! గది లోపలికెళ్ళాను. అక్కడ ఎవరో విలన్ వనిత ఉంది. తను విలన్ అన్న విషయం లో ఎవ్వరికీ అనుమానం రాకుండా మొహం వంద వంకర్లు తిప్పుతూ..కనుబొమ్మలు కంటి నుంచి చెవి దాకా కనుబొమ్మల పెన్సిల్ తో గీసుకుని ఉంది. కాఫీ లో ఏదో కలుపుతోంది. నేను కష్టపడకుండా అదేంటో తెలిసిపోయింది. సీసా మీద “POISON” అని స్కెచ్ పెన్నుతో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. పొరబాటున అది నేను గమనించలేదేమో అని తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటోంది….”ఈ విషం కలిపిన కాఫీ ఏదైతే ఉందో..అది తాగిన రాహుల్ అలాగే ఇషిత ఎవరైతే ఉన్నారో…వారిక మరి మరణించక తప్పదు..” అని నవ్వింది.

నాకు కోపమొచ్చింది..

నువ్వు మనిషివేనా? పవిత్రమైన కాఫీ లో విషం కలుపుతావా..నీ కారెక్టర్ ని చంపేయించి ఈ సీరియల్ నుంచి వెలివేయించేస్తాను…” అని అరిచాను. ఆవిడ ఇంకా గట్టిగా నవ్వింది. అప్పుడు గుర్తొచ్చింది – ఈ క్యాండిడేట్ ఇదివరకు రెండు సార్లు చనిపోయి మళ్ళీ బ్రతికింది. వీళ్ళని ఆ యముడు కూడా ఏమీ చేసుకోలేడు. మార్చి లో పోతే సెప్టెంబర్ లో మళ్ళీ తిరిగొస్తారు.

నా సహనం చచ్చిపోయింది. మళ్ళీ బ్రతికింది.

మెట్లు కనబడితే పైకి ఎక్కాను. అక్కడ ఎవరైనా పుణ్యాత్ముడు కాఫీ ఇస్తాడేమో అన్న ఆశ. అక్కడికెళ్ళగానే అంతా విచిత్రంగా ఉంది. ఏదో విజువల్ ఎఫెక్ట్ అనుకుంటా…శివుడు, పార్వతి, కొంత మంది ఉన్నారు. కాని వాళ్ళ వెనకాల అంతా వింతగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి మెట్లు ఎక్కితే కైలాసం ఎలా చేరుకున్నానా అని ఆలోచిస్తున్నాను.

శివుడు చాలా మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు..

లోహితాంగా…నీ తపస్సు విరమించు లోహితాంగా….లోహితాంగా నీవు గనక నా మాట వినని పక్షం లోనీవు నాశనం కాక తప్పదు లోహితాంగామా యొక్క క్రోధాన్నిమా యొక్క కోపాగ్నినిఅలాగే మా యొక్క…”

ఆయన డైలాగు పూర్తవ్వకుండానే ఎవరో అడ్వర్టైజ్మెంటు గాళ్ళు నా ముందుకొచ్చారు..

నొప్పిగా ఉంద్యా? ఉప్పు ఉంద్యా?” అని అవసరం లేని చోట వత్తు పెట్టి సబ్బులు, టూత్పేస్ట్లు అమ్మటానికి ప్రయత్నించారు. “కాఫీ ఉంటే మాట్లాడండి” అని పక్కకొచ్చేసాను.

hara hara mahadeva dubbed serial

 

ఇక ఈ ఇంట్లో మనకి కాఫీ దొరకదు అని అర్థమైపోయింది. ఇంటి బయటకు నడిచాను. అక్కడ సూట్లు, బూట్లు, వేసుకుని నలుగురు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. CID అని మెడలో ట్యాగ్లు వేసుకుని ఉన్నారు.

గురువుగారు..దగ్గర్లో టీస్టాల్ ఏదైనా ఉందా? కాఫీ కావాలి..” అనడిగాను.

ప్రద్యుమ్న అని జేబు మీద పేరు ఉన్న ఆయన….”ఓహ్….నీకైతే మరి టీస్టాల్ కావాలా? అభిజీత్ ఇంకా దయా…వెంటనే ఇక మరి ఆ గేటు ఏదైతే ఉందో అది బధ్ధలు కొట్టి అలాగే విరగ్గొట్టండి.” అన్నాడు. ఆ అభిజీత్, దయా ఆ ఇంటి గేటుని పచ్చడి పచ్చడి చేసేసారు.

అదేంటండి..నేనడిగిన టీస్టాల్ కి, ఈ గేటు బధ్ధలు కొట్టడానికి ఏంటి సంబంధం?” అనడిగాను..

ఓహ్…అభిజీత్ ఇంకా దయా…వీడి మీద నాకు ఇక అనుమానం ఏదైతే ఉందో అది ఉంది. వెంటనే వీడిని పూర్తిగా సోదా ఏదైతే ఉందో అది చేయండి. కమాన్..” అన్నాడు ఆయన..

నేను పారిపోవటానికి ప్రయత్నించాను. ఆ దయా అనే పహిల్వాను నా ముక్కు మీద కర్చీఫ్ పెట్టాడు. అందులో క్లొరోఫాం ఉందో లేదో తెలియదు కానిరెండు వందల ఎపిసోడ్లుగా ఉతక కుండా వాడుతున్న ఆ కర్చీఫు నా ముక్కుమీద ఉంచేసరికి మూర్ఛపోయాను.

CID daya abhijeeth

లేచేసరికి నా గదిలో ఉన్నాను. కాఫీ కలుపుకుందామని వంటగది వైపు నడిచాను…”….

చదివారుగా..ఇలా పద్ధతీ…పాడూ…భాషా సంస్కారం లేకుండా నడిచే డబ్బింగ్ సీరియల్స్ సమాజాన్ని ఎలా ఛిద్రం చేస్తున్నాయో తెలియచెప్పే ప్రయత్నం చేసిన సిద్దార్థ్ గౌతమ్ గారికి మీరూ హ్యాట్ ఆఫ్ చెప్పండి.

(Visited 138 times, 1 visits today)