తొలిసారిగా విమానం ఎక్కిన ఆ వ్యక్తి టాయిలెట్ డోర్ అనుకుని విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తీయబోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.పట్నాకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి పని నిమిత్తం గతవారం దిల్లీ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన గో ఎయిర్ విమానంలో పట్నా బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో తన సీటు నుంచి లేచిన ఆ వ్యక్తి నేరుగా విమానం వెనుకవైపు వెళ్లి అక్కడ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి కొందరు ప్రయాణికులు వెంటనే గట్టిగా అరుస్తూ అతడిని అడ్డుకున్నారు.
విమానం పట్నాలో దిగగానే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి అప్పగించారు. భద్రతాసిబ్బంది అతడిని విచారించగా.. టాయిలెట్ డోర్ అనుకున్నానని అందుకే తెరవబోయానని చెప్పాడు.
తాను తొలిసారిగా విమానం ఎక్కానని, అది ఎగ్జిట్ డోర్ అని నిజంగా తనకు తెలియదని తెలిపాడు.ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ ప్రయాణికుడు ఉద్దేశపూర్వకంగా ఎగ్జిట్ డోర్‌ను తెరవలేదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు.