Home / Devotional / పరమశివుడికి నైవేద్యంగా చేపల కూర

పరమశివుడికి నైవేద్యంగా చేపల కూర

Author:

సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం, చక్కరపొంగలి, దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. భద్రాద్రి లో ఇప్పపువ్వు ని నైవేద్యంగా సంమర్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ఆలయ ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. అక్కడక్కడా దేవుళ్ళకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. కొన్ని ఆలయాల బయట జంతుబలి జరుగుతుండడం అందరికి తెలుసు. కానీ, ఇలా ఆలయం లోపల మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఎప్పుడూ వినలేదు కదా..

special prasadam for lord siva

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలో పరమ శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడికి చేపలేంటీ ..ఇలాంటి వింత ఆచారాలేంటని అనుకుంటున్నారా..? భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొనలేదా.. అలాగే ఇక్కడా ఇదో ప్రత్యేకమైన ఆచారం అంతే.

మహా శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు అంగ రంగ వైభవంగా.. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపలకూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలన్నీనెరవేరతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని, తద్వారా ఆ భోళా శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు. ఆచారం, పద్దతులేవైనా భగవంతున్ని వేడుకోవడం, ప్రసన్నం చేసుకోవడమే కదా అంతిమం.. ఆయన చల్లని చూపు తగిలితే చాలు అదే పదివేలు అంటున్నారు భక్తులు.

పంచ లింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసింది. జంఝావతి, నాగవళి నదుల పవిత్ర సంగమం ఈ ఆలయ సమీపంలోనే దర్శించవచ్చు. ఈ గుంప సోమేశ్వర ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్టు ఇక్కడి స్థల పురణాల బట్టి తెలుస్తోంది. బలరాముడు తన నాగలి సాయంతో గంగను ఇక్కడకు రప్పించాడు కాబట్టి ఈ నది నాగావళిగా ప్రసిద్ధి చెందింది.

(Visited 599 times, 1 visits today)