Home / Devotional / ఉగాది పండుగని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకోండి…!

ఉగాది పండుగని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకోండి…!

Author:

‘ఉగాది’ అంటే ప్రకృతి పుట్టినరోజు. కాలగణనానికి కూడా అదే శ్రీకారం. మనది చాంద్రమాన గణనం. చైత్ర శుద్ధ పాడ్యమే ‘యుగాది’. మనమందరం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం. మన బ్రతుకుల్ని నిలబెడుతూ, హాయినిస్తుంది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అందరికీ తల్లి. అందువల్ల ప్రకృతి మాత పుట్టినరోజును జరుపుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతిని ప్రేమించి పచ్చదనాన్ని రక్షించుకుంటే మన జీవనయాత్ర సాఫీగా సాగుతుంది. ఇందులో కులమత భేదాలేవీ లేవు.

ఉగాది పండుగ చరిత్ర

బ్రహ్మ చైత్ర మాసం శుక్లపక్షంలో మొదటిరోజున సూర్యోదయ కాలంలో సమగ్రంగా ఈ ప్రకృతిని రూపొందించారు. చంద్రుడిసంచారాన్ని బట్టి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం మొదలైన పేర్లతో నెలలు ఏర్పడుతున్నాయి. 12 నెలలో చివరిదైన ఫాల్గుణమాసం నాటికి చెట్లన్నీ ఆకులు రాలిపోయి, పచ్చదనం తక్కువ కావడంతో ప్రకృతి వెలవెల బోతుంది. తిరిగి నవనవోన్మేషమైన ప్రకృతి శోభలతో చైత్ర మాసం ప్రారంభమవుతుంది. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన ఆరింటిని మనం ఉగాది పచ్చడి రూపంలో తీసుకోవడం జరుగుతోంది. ఉగాది నాడు తప్పనిసరిగా చేయవలసిన పనులను మనం వివరంగా తెలుసుకుందాం.

  •  ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెను ఒంటికి పట్టించి, పసుపు కలిపిన సున్నిపిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, తలంటు స్నానం చేయాలి. గానుగనూనెను మర్దన చేసుకుంటే, లావుగా ఉన్నవారు సన్నబడతారు. తేజస్సు పెరుగుతుంది. సన్నటివారికి మంచి బలం చేకూరుతుంది.
  • ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించాలి. క్రొత్త బట్ట ఆయుష్షునీ, దేహవర్చస్సును పెంచుతుంది.
  • తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే 5 అంశాల పరిజ్ఞానంతో కూడిన పంచాంగ శ్రవణం ఆ రోజున తప్పక చేయాలి. ఈ ఐదింటి వల్ల క్రమంగా  సంపద, ఆయుష్షు, పాపహరణం, రోగాలు తొలగడం, చేసిన ప్రయత్నాలు ఫలించడం అనే సత్ఫలితాలు కలుగుతాయి.
  •  ఆరు రుచుల పచ్చడిని సేవించడాన్నిసంప్రదాయంగా చేశారు. అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన ఉగాది పచ్చడిని అందరూ తప్పనిసరిగా సేవించాలి.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

  • బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
  • ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
  • వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
  • చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
  • పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
  • కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.

అలజడి పాఠకులందరికి శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…!

(Visited 1,955 times, 1 visits today)