Home / Inspiring Stories / ఒకప్పుడు రోజువారి కూలీ..! ఇప్పుడు 20 కంపెనీలకు అధిపతి.

ఒకప్పుడు రోజువారి కూలీ..! ఇప్పుడు 20 కంపెనీలకు అధిపతి.

Author:
ఇది మన్నెం మధుసూదన్ రావు కథ, ప్రతీ తల్లితండ్రులూ, తమ బిడ్డలకి చెప్పాల్సిన, ప్రతి ఒక్క యువతీ యువకులు తెలుసుకోవాల్సిన ఓ సామాన్యుడి వీర గాధ. ఆకలి, అవమానంలో నుంచి పుట్టిన కసి కష్టాలకి ఎదురు నిలబడ్డ ధైర్యం 20 కంపెనీలకి అధిపతిని చేసింది. అతన్ని కష్టం, నమ్మకం, కార్యదీక్షా గెలిపించాయి, ప్రపంచానికి ఓ విజేతనూ పరిచయం చేసాయి .
Mannem Madhusudhan Rao
ఇతని తల్లీ, తండ్రీ కూలి పని చేసేవారు, ప్రతి రోజూ కూలికెళ్ళి రోజుకి 18 గంటలు పనిచేసినా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేని కటిక పేదరికం, దానికి తోడు 8మంది సంతానం, 8మందిలో మధు అందరికంటే చిన్నవాడు, అమ్మా నాన్నలతో కలిపి మొత్తం పది మంది ఒక చిన్న పూరి గుడిసె లో నివాసం ఉండేవారు. మధు చిన్నవాడిగా ఉన్నప్పుడు పొద్దున్న తను లేచే లోపే తన అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నారో ,పోనీ తను నిద్రపోయే లోపు ఎందుకు రారో అర్ధం అయ్యేది కాదు ,ఊరందరికీ పక్కా ఇల్లు ఉన్నా వీళ్ళు మాత్రం తరతరాలుగా అదే గుడిసెలో ఎందుకు ఉండేవారో తెలిసేది కాదు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్పింది. మధుది వాళ్ళ ఊర్లో ఓ దళిత కుటుంబం అని తన అమ్మ నాన్నతో పాటు అక్క కూడా ఊరి భూస్వాముల దగ్గర వెట్టి చాకిరీ చేసేవాళ్ళని తెలుసుకున్నాడు. తన ఊర్లో తన లాంటి అనేక కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలని చూసి చలించిన మధు తను బాగా చదివి ఉద్యోగం చేసి సంపాదిస్తేనే తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తెగలను అని తెలుసుకున్నాడు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని శ్రద్దగా చదివాడు. ఒక్కసారి అతని లైఫ్ స్టొరీ లో ముఖ్యమైన విషయాలు అతని మాటల్లోనే విందాం.
“మొదట మా ఊర్లో పరిస్థితులు నాకు అర్ధం అయ్యేవి కాదు, తినటానికి ఏమీ లేక ప్రేగులు మెలిపెట్టేవి,పౌష్టికఆహార లోపం వాళ్ళ బాగా వల్లు నొప్పులు ఉండేవి అవి నాకు ఇప్పటికీ గుర్తే మా ఇంటికి దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య రాకతో మా జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. ఉచితంగా చదువు, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామనడంతో మా నాన్న నన్నూ, మా అన్న మాధవ్ని హాస్టల్ లో చేర్చేందుకు సరేనన్నాడు. అలా ఇద్దరం హాస్టల్ లో చేరాము. హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య, టీచర్ జేకే- మా ఇద్దరికీ ఎంతో సాయం చేశారు. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా స్కూల్ రోజులు గడిచిన తర్వాత మా అన్నయ్య బీటెక్ జాయిన్ అయ్యాడు, నేను మాత్రం ఆరోజుల్లో పాలిటెక్నిక్ అవ్వగానే జాబు వస్తుంది అనే నమ్మకం ఉండటంతో ఎంట్రెన్స్ ఎక్సామ్ రాసాను. ఎంట్రెన్స్ టెస్ట్ లో మంచి ర్యాంకు రావడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీటు వచ్చింది. రెండేళ్ల పాటు తిరుపతి, ఫైనల్ ఇయర్ ఒంగోలులో చదివి డిప్లొమా పట్టా అందుకున్నాను.
Mannem Madhusudhan Rao1
నా డిప్లొమా తో మా ఇంట్లో వాళ్లకి పట్టరాని సంతోషం వేసింది, త్వరగా జాబ్ తెచ్చుకోమని నా మీద ఒత్తిడి పెంచారు, నేను ఉద్యోగ ప్రయత్నం కోసం ఎక్కడికి వెళ్ళినా ముందు రెఫరెన్సే అడిగేవారు, కానీ నాకు రిఫరెన్స్ ఇచ్చేందుకు ఎవరూ లేరు, ఏం చేయాలో అర్థంకాలేదు. ఖాళీగా కూర్చోలేను. డిప్లొమా కంప్లీట్ కాగానే మంచి ఉద్యోగం వస్తుందన్న కుటుంబసభ్యుల ఆశ నిరాశైంది. ఏ పని చేసైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నా.కూలీ పని కూడా చేశాను రోజుకి 50 రూపాయలు ఇచ్చేవారు, నైట్ వాచ్మెన్ గా కూడా పనిచేసాను, ఒకరోజు పనిలో టెలిఫోన్ స్తంభం గోయి తవ్వుతుండగా ఓ ఇంజనీర్ నా పనితనం చూసి నేను చదువుకున్న వాడిని అని తెలిసీ నాకో ఆఫర్ ఇచ్చారు, అక్కడ నాకో కాంట్రాక్ట్ డీల్ కుదిరింది మొదటి రోజునే మంచి లాభాలు చూపించాను, ఆ కాంట్రాక్ట్ కి మొదట మా అక్కలు ముందర కాస్త ఆర్దిక సహాయం చేసారు ఆ రోజు వచ్చిన లాభం తోనే చాలా రోజుల తర్వాత అక్కలతో కలిసి కడుపు నిండా భోజనం చేసాను .అలా ఒకదాని వెంట ఒకటి అవకాశాలు రాసాగాయి కాస్త బాగానే డబ్బు సంపాదించి ఊరు చేరాను.
మా వాళ్ళు లక్షల్లో ఉన్న ఆ డబ్బుని చూసి ఆశ్చర్యపోయారు, నా చెల్లి పెళ్ళి కూడా ఆ డబ్బుతోనే చేసారు, ఆ తర్వాత మళ్ళీ వ్యాపారంలోకి దిగాను మరిన్ని కాంట్రాక్టులు, మంచి పేరు, చేతి నిండా డబ్బు జీవితం సాఫీగా సాగుతుంది అనుకున్నప్పుడు అనుకోని ఇబ్బంది ఒకటి వచ్చి పడింది రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా రెప్పపాటులో మాయమైంది.“నమ్మిన వ్యక్తులు నట్టేట ముంచారు. నమ్మక ద్రోహం చేశారు. వెన్నుపోటు పొడిచారు. కొందరు స్నేహితులు ప్రోద్బలంతో కంపెనీ ప్రారంభించా. కంపెనీ బాగానే నడిచింది. అయితే భాగస్వాములు మోసం చేశారు. నా సంపాదననంతా దోచేశారు.
మళ్ళీ మొదటి నుంచీ జీవితం ఈసారి ఓ ఇంజనీరింగ్ కంపనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాను, ఆ సమయం లోనే నాకు పెళ్లి కూడా అయ్యింది, ఎంత ఉద్యోగం చేసినా మా ఇద్దరి ఆదాయం కలిపి 35 వేలు దాటేది కాదు, అదే బిజినెస్ అయితే 3 లక్షలు వరకూ సంపాదిచ్చొచ్చని నా ఆలోచన, కానీ నా బిజినెస్ నష్టాల గురించి ముందే తెలిసిన నా భార్య మళ్ళీ బిజినెస్ ఊసు ఎత్తొద్దని షరతు పెట్టింది ,కానీ నాకు మాత్రం నాలో మంచి బిజినెస్ మాన్ ఉన్నాడని అనిపించేది.చివరికి ఎలానో నచ్చచెప్పి బిజినెస్ ప్రారంభించేలా ఒప్పించాను. ప్రతి విషయంలోనూ నా భార్య అండగా నిలిచింది. ఆమె నా జీవిత భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె కారణంగానే జీవితం ఆనందమయమైంది. ఆమే నా బలం”
MMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో టెలికాం, ఐటీ, ఎలక్రికల్, మెకానికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఇప్పటికి 20 కంపెనీలు పెట్టి సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్నాను. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాను నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతం దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాను.అసలు నిజానికి చెప్పాలంటే 20 కంపెనీలను మేనేజ్ చేయడం ఏమంత పెద్ద కష్టం కాదు, కుటుంబం లో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను భుజాన వేసుకుని అవసరమైన సాయం చేస్తారు.“ప్రతి విషయంలోనూ ఎక్స్ పర్ట్ అయిన వారిని కంపెనీ హెడ్ లుగా నియమించా. ఎవరి పనులు వారు చక్కగా చేసుకుంటారు. ప్రతిరోజూ అన్ని కంపెనీల హెడ్స్ తో మాట్లాడుతాను. అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాను. అవకాశం దొరికిన వెంటనే అందిపుచ్చుకుంటాను.”
Mannem Madhusudhan Rao1
టైం మేనేజ్ మెంట్ పెద్ద సమస్యే కాదనే మధుసూదన్. ఈ విషయంలో తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి ,ఒకప్పుడు వాళ్ళు పడ్డ కష్టం నాకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది, ఇప్పుడు నేను పడుతుంది అంతకంటే పెద్ద కష్టమూ కాదు. బతికున్నంత వరకు తల్లిదండ్రులే ఆదర్శం, వారిచ్చిన ప్రేరణతోనే సమస్యల నుంచి బయటపడటం నేర్చుకున్నానునా ఆఫీసు లో వారు రోజులో 18 గంటల పాటు పనిచేసేవారు. వాళ్లలాగే నేను కూడా రోజూ 18 గంటలు పనిచేస్తాను. మా కంపెనీల్లో ప్రతి ఉద్యోగి కూడా మనసుపెట్టి పని చేస్తాడు. ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తానని ఎవరూ చెప్పరు. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అలుపెరగకుండా వర్క్ చేస్తారు, నాకు వారి గురించి చెప్తుంటే చాలా గర్వంగా ఉంటుంది.
మేన్, మెటీరియల్, మనీ ఈ మూడింటిని సమర్థంగా వినియోగించుకోవడమే నా సక్సెస్ సీక్రెట్. కడుపేదరికం నుంచి బయటపడి కోటీశ్వరుడిగా మారినా.. నడిచివచ్చిన దారిని ఎన్నిటికీ మర్చిపోను, ప్రస్తుతం నా కల, లక్ష్యం ఒక్కటే. అదే రానున్న ఐదారేళ్లలో గ్రామీణ ప్రాంత యువతకు మంచి ఉద్యోగం వచ్చేలా లేదా వ్యాపారవేత్తలుగా రాణించేలా శిక్షణ ఇవ్వడం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినందున అక్కడి యువత, విద్యార్థుల కష్టాలు, సమస్యలు నాకు బాగా తెలుసు. వాస్తవానికి గ్రామీణ ప్రాంత యువత ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్లలో నైపుణ్యాలను పెంచి వచ్చే ఐదేళ్లలో కనీసం ఐదు వేల మంది యువతీయువకుల్ని వ్యాపారవేత్తలుగా లేదా ఉన్నతోద్యోగం పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించేలా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం.
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మధుసూదన్ తన మిగతా జీవితంలో కూడా మరిన్ని విజయాలు సాదించాలని కోరుకుంటూ అల్ ది బెస్ట్ చెప్దామా మరి .
(Visited 2,350 times, 1 visits today)