అందరూ చూస్తుండగానే ఓ యువతీ యువకుడిపై కొబ్బరి బోండాల కత్తితో ఓ వ్యక్తి దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కత్తితో దాడి చేస్తున్నాడు. అప్పటికే ఆమె పక్కనే ఉన్న యువకుడు భయంతో పారిపోయాడు. యువతి మాత్రం తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిఉంది. చేతిపై, ముఖంపై తీవ్ర గాయమైన ఆమెపై మరో కత్తివేటు పడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇంత జరుగుతున్నా నిందితుడిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసించలేదు. అంతేకాదు ఇంకోసారి వేటు వేసేలోపే ఓ యువకుడు మాత్రం ధైర్యం చేశాడు. నిందితుడిని వెనుక నుంచి ఎగిరి తన్నాడు. దీంతో జనం దాడి చేసే అవకాశముందని భావించి పారిపోయాడు. ఈ సంఘటనలో నిందితుడు మనోహరాచారి కాగా, యువతీ యువకులు మాధవి, సందీప్. సాహసం చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడు ఎర్రగడ్డ గుల్షన్ నూర్‌బాగ్ బస్తీకి చెందిన అసద్. ఈ ఘటన తర్వాత పోలీసు విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని భయంతో అసద్ ముందుకు రాలేదు. బండలు పరిచే పనిచేసే అసద్ ఖాళీ సమయాల్లో ఎర్రగడ్డలోని బాటా షోరూం దగ్గర ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుంటాడు. బుధవారం గోకుల్ థియేటర్ దగ్గర ఘటన జరుగుతున్న సమయంలో… అప్పుడే పని నుంచి వచ్చిన అసద్ ..మిత్రుడితో కలిసి టిఫిన్ చేసేందుకు బైక్‌పై ఎర్రగడ్డ వచ్చాడు. హ్యుందాయ్ షోరూం ముందు వెళ్తుండగా కత్తితో కూతురిపై దాడి చేస్తున్న మనోహరాచారి కనిపించాడు. వెంటనే బైక్ దిగిన అసద్ వేగంగా స్పందించి వెనుక నుంచి మనోహరాచారిని తన్నాడు. స్థానికులు పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు గ్రహించిన మనోహరాచారి పరారయ్యాడు. అసద్ స్పందించకుండా ఉంటే మాధవిపై మళ్లీ దాడి చేసేవాడు.
తన కళ్లముందే యువతిని కత్తితో దారుణంగా నరుకుతుండడాన్ని చూడలేకపోయానని… అడ్డుకోవడం మంచిదనే నిర్ణయంతో వెనుక నుంచి తన్నానని తెలిపాడు. నిందితుడి తనపై దాడి చేసే అవకాశం ఉందని భావించి తర్వాత దూరంగా జరిగానన్నాడు.
మాధవి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆఫరేషన్ జరిగిన తర్వాత మాధవిని ICU లో ఉంచి కృత్రిమ శ్వాసను కల్పించారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అవసరం లేకుండా స్వయంగా శ్వాస తీసుకుంటోందని తెలిపారు యశోద ఆస్పత్రి డాక్టర్లు.