అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దేశంలో అవినీతి పెరిగిపోతూనే ఉంది. అంతకుముందుతో పోలిస్తే గడచిన ఏడాది కాలంలో మరింత పెరిగింది. ట్రన్సాపరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అండ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఏడాది భారత్‌లోని 56 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లంచాలు ఇచ్చారు. ఈ సర్వే కోసం 1,60,000 మంది నుంచి స్పందనలను స్వీకరించారు.గత ఏడాది 45శాతం మంది భారతీయులు లంచాలు ఇచ్చినట్లు చెప్పగా ఈ ఏడాది 56శాతం మంది లంచాలు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో అంతకుముందుతో పోలిస్తే 11శాతం మంది పెరిగారు. తాజా నివేదిక ప్రకారం 58శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి-వ్యతిరేక హెల్ప్‌లైన్ లేదని చెప్పారు. 33శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి వ్యతిరేక హెల్ప్‌లైన్ ఉన్నట్లు తెలియదని సమాధానమిచ్చారు.
ఎక్కువ శాతం లంచాలు డబ్బు రూపంలోనే ఇచ్చారని సర్వే పేర్కొంది. నగదు రూపంలో 39శాతం, ఏజెంట్ల ద్వారా 25శాతం, ఇతర రూపాల్లో ఒక్క శాతం లంచాలు అందాయని వెల్లడించింది. అందులోనూ ఎక్కువగా పోలీసులకు లంచాలు ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత మున్సిపల్ అధికారులకు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం, ఇతర అధికారులకు(విద్యుత్ బోర్డు, రవాణా కార్యాలయం, పన్ను కార్యాలయం, ఇతర కార్యాలయాలు) ప్రజలు లంచాలు ఇచ్చినట్లు సర్వే పేర్కొంది.
అంతేకాకుండా సర్వేలో పాల్గొన్న వారిలో 36శాతం మంది తమ పని పూర్తి కావాలంటే లంచం ఇవ్వడం ఒక్కటే మార్గం అని భావిస్తున్నారని తెలిపింది. అలాగే తమ పని చేయించుకోవడానికి లంచం ఇవ్వము అని చెప్పే వారి సంఖ్య కూడా 43శాతం నుంచి 39శాతానికి తగ్గిందని వెల్లడించింది. 13శాతం మంది తాము లంచం ఇచ్చిన కార్యాలయాల్లో సీసీటీవీలు ఉన్నాయని చెప్పారని సర్వే పేర్కొంది.