అంగరంగ వైభవంగా వేదిక… రాజకీయ దిగ్గజాల రాక.. నడుమ కర్ణాటకలో సంకీర్ణ సర్కారు సారథిగా.. జనతాదళ్ (ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర్‌తో సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నరు వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కుమారస్వామి దైవం, కర్ణాటక ప్రజల సాక్షిగా, పరమేశ్వర్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణానంతరం కుమారస్వామి అక్కడే ఉన్న తల్లి చెన్నమ్మ చెంతకు వెళ్లి పాదాభివందనం చేశారు. కుమారస్వామి కన్నడ సంప్రదాయానుసారం తెల్లటి పట్టు పంచె, చొక్కా ధరించారు. పరమేశ్వర్ ఎప్పటిలాగే తెల్లటి ప్యాంటు, చొక్కా వేసుకున్నారు.
నేతల సందడి
కుమారస్వామి పట్టాభిషేకాన్ని వీక్షించేందుకు దేశంలోని 13 పార్టీలు తరలివచ్చాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (కాంగ్రెస్), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం), పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), తేజస్వీ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా (సీపీఐ), బాబు లాల్ మరాండీ (జార్ఖండ్ ముక్తి మోర్చా), శరద్ యాదవ్ (జేడీ), అజిత్ సింగ్ (రాష్ట్రీయ లోక్‌దళ్), దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ), పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి (కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు. ఇంకా పలు పార్టీలకు చెందిన ప్రముఖులు వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్ని పక్షాల నేతలు వేదికపైకి వచ్చి చేతులు కలిపి ఐక్యతను చాటారు. వేదికపై మాజీ ప్రధాని దేవెగౌడ నేతలందరివద్దకూ వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. పాత మిత్రుడు, రాజకీయ దాయాది శరద్ యాదవ్‌ను ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబును ఆప్యాయంగా పలకరించి వెన్నుతట్టారు. భుజాలపై ఆనందంగా చరిచి సంతోషాన్ని పంచుకున్నారు.
కరుణించిన వరుణుడు..
ప్రమాణ స్వీకార సమయానికి వరుణుడూ కరుణించాడు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకూ విధానసౌధ పరిసరాలతోపాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలులతో కూడిన వాన కురిసింది. ప్రమాణ ఉత్సవం నాలుగున్నర గంటలకు జరిగింది. అంతకు పది నిముషాల ముందు వాన చినుకులు పడ్డాయి. ఆ తర్వాత వరుణుడు శాంతించాడు. మొదట మధ్యాహ్నం 12 గంటలకే ప్రమాణం చేయాలనుకున్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు జ్యోతిషంపై నమ్మకం ఎక్కువ. ఆయన మాటను మన్నించి సాయంత్రం నాలుగున్నర కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రమాణోత్సవం తర్వాత విధానసౌధ విందుశాలలో ప్రముఖులకు తేనీటి విందునిచ్చారు.
‘ప్రాంతీయ’ బలోపేతమే లక్ష్యం: చంద్రబాబు
ప్రాంతీయ పార్టీల బలోపేతానికి కృషిచేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బెంగళూరులో బుధవారం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రాంతీయ రాజకీయ పక్షాల్ని బలోపేతం చేయడం మా ముందున్న కర్తవ్యం. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించేందుకు ఇక్కడకు వచ్చా. కాంగ్రెస్- దళ్ సంకీర్ణ సర్కారు ఏర్పాటు ఆనందాన్నిస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేము అన్నింటినీ గమనిస్తున్నాం. నాతోపాటు పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులం ప్రాంతీయ రాజకీయ పక్షాల బలోపేతానికి అలుపెరుగకుండా శ్రమించాం. ఇంకా కృషి చేస్తున్నాం. ఈ శక్తులన్నీ కలసికట్టుగా ముందుకు పోవాలి. జాతీయ పక్షాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల బలోపేతం అనివార్యం’ అని వ్యాఖ్యానించారు.