Home / Entertainment / కబాలి సినిమా రివ్యూ & రేటింగ్.

కబాలి సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

kabali-Perfect-Review-Rating-కబాలి-రివ్యూ-కబాలి-రేటింగ్

నటీనటులు: రజనీ కాంత్, రాధిక ఆప్టే, ధన్శిక, వింస్టన్ చావో, దినేష్ రవి, కిశోర్, తదితరులు
దర్శకత్వం: రంజిత్ పిఏ.
నిర్మాత: కలైపులి ఎస్. థాను.
సంగీతం: సంతోష్ నారాయణన్.

సూపర్ స్టార్ రజనీ కాంత్, ఆ పేరు చాలు కోట్లాది అభిమానులను ప్రపంచంలో జరుగుతున్నఇతర విషయాలకు సంబంధం లేకుండా సినిమా థియేటర్ బాట పట్టిస్తుంది. ఆయన సినిమా అంటేనే చాలు ఎప్పుడూ పోట్లాడుకునే ఇతర హీరోల ఫ్యాన్స్ అంత ఒక్క చోట చేరి సందడి చేస్తారు, తమ హీరో సినిమాతో సమానంగా ఆదరిస్తారు. రంజిత్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, రాధిక ఆప్టే జంటగా నటించిన “కబాలి” సినిమా  ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే పెట్టుబడికి రెండింతలు బిజినెస్ చేసిన ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. మరి “కబాలి” ఆ అంచనాలకు అందుకుందో లేదో చదవండి.

కథ:

మలేసియాలో తీవ్ర కష్టాలు పడుతున్న తమిళలు తమను రక్షించేవారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు, ఆ సమయంలో మలేషియాలోనే ఉండే కబాలి (రజిని కాంత్) వారిని రక్షించడానికి మాఫియా గ్యాంగ్ లతో పోరాడుతాడు, మాఫియా గ్యాంగ్ ల వల్ల కబాలి తన ఫ్యామిలీ ని కోల్పోతాడు, పోలీసులు కబాలిని అరెస్ట్ చేస్తారు, ఎన్నో ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన కబాలి సాధారణ జీవితం గడపాలనుకుంటాడు. కానీ అక్కడి పరిస్థితులని చూసి కబాలి మళ్ళీ గ్యాంగ్ స్టార్ గా మారిపోతాడు, కబాలి తన భార్య బతికే ఉంది అని తెలుసుకుంటాడు, కబాలి తన భార్యని ఎలా కలిసాడు..? తనని చంపడానికి చూస్తున్న మాఫియా డాన్ ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

మలేషియాలో  రజనీ కాంత్ జైలు నుండి విడుదల అవుతున్న సన్నివేశంతో మొదలైన సినిమా, ప్రధమార్ధం మొత్తం నెమ్మదిగా సాగుతుంది. రజనీ కాంత్ నేపధ్యం, జైలుకెళ్లడానికి గల కారణాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తో మామూలుగా సాగుతున్న స్టోరీలో ఇంటర్వల్ ట్విస్ట్ మళ్లీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఇంకో పంధాలో సాగుతుంది. పూర్తిగా భావోద్వేగాలతో కూడుకున్న సన్నివేశాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.  మొదటి సగం తో పోల్చితే రెండో సగం కథలో దర్శకుడి ప్రతిభ కనపడుతుంది కానీ క్లైమ్యాక్స్ ను మాత్రం జీర్ణించుకోలేము.

 నటీనటుల పనితీరు:

కబాలి లో రజనీ కాంత్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే, నెరిసిన గడ్డం, స్టైలిష్ లుక్, సూట్ లలో రజనీ కాంత్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. డైలాగు డెలివరీ, యాక్షన్ సీన్లలొ, భావోద్వేగాలు పండించే సీన్లలొ సూపర్ స్టార్ నటన అమోఘం. రజనీ ఎంట్రీ సీన్ కి ఐతే థియేటర్ మొత్తం చప్పట్లు, ఫ్యాన్స్ అరుపులతో నిండిపోయింది.

ఇక రాధిక ఆప్టే ఐతే ఇంతవరకు ఏ సినిమాలో నటించని విధంగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబాలి రాధిక కెరీర్లో బెస్ట్ సినిమా అవడం ఖాయం. ధన్శిక, కిశోర్, నాజర్ లు తమ పరిది మేరకు బాగానే నటించారు. ఇతర విదేశీ నటులు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

రజనీ కాంత్ క్రేజ్ కి తగ్గట్లు కథ రాసి దర్శకత్వం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఈ రెండు విభాగాల్లో దర్శకుడు రంజిత్ కుమార్ తనదైన మార్కును చూపించడానికి గట్టిగా ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నంలో రజనీ కాంత్ కిచ్చిన స్క్రీన్ ప్రెసెన్స్ వేరే నటులకు ఇవ్వలేక పోయాడు. ఈ చిన్న తప్పిదం వలన రజనీ కాంత్ అభిమానులని ఆకట్టుకున్నట్లుగా కబాలి మిగతా వారందరిని ఆకట్టుకొలేదు.

సినిమాటోగ్రాఫర్ మురళి పనితనం మెచ్చుకోదగ్గది. కబాలి ని అంత స్టైలిష్ గా చూపించడం ఆయన ఒక్కడి వల్లనే అవుతుందేమో అన్నట్లు సాగింది ఆయన పనితనం. ఇక సంగీతం విషయానికోస్తే గొప్ప నేపధ్య సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ అలరించే పాటలు అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. తెలుగు పాటలలో కూడా తమిళ పరిమళం ఉన్నట్లుగా ఉన్నాయి పాటలు.

ప్లస్ పాయింట్స్:

  • రజనీ కాంత్ నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • లొకేషన్స్

మైనస్ పాయింట్స్:

  • కొత్తదనం లేని కథ
  • దర్శకత్వం
  • స్క్రీన్‌ప్లే
  • తమిళ వాసన ఉన్న సంగీతం.

అలజడి రేటింగ్: 2.75/5

పంచ్ లైన్:  ‘కబాలి రా….! రజిని ఫ్యాన్స్ కే రా….!’

(Visited 6,745 times, 1 visits today)