Home / Inspiring Stories / కేటిఆర్ అంకుల్, నేను చనిపోయానంట…!

కేటిఆర్ అంకుల్, నేను చనిపోయానంట…!

Author:

డియర్ కేటిఆర్ అంకుల్,

నా పేరు భూమిక. నా వయసు 8 ఏళ్ళు. ఉప్పల్ లో ఉంటాము.  జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్, నాచారం లో సెకండ్ క్లాస్ చదువుతున్నాను.  ఈ రోజు పొద్దున్నే నేను మా అక్క అమ్మతో కలిసి స్కూటీ మీద స్కూల్ కి వెళుతున్నాము. రోడ్డు మీద పెద్ద గుంత. అమ్మ బండి స్లో చేసింది. మా వెనక వస్తున్న లారీ అంకుల్ మా బండిని లారీతో గుద్దేసాడు. అంతే అమ్మ, నేను, అక్క కింద పడిపోయాం. నా తల బలంగా నేలకి గుద్దుకుంది. రక్తం కారిపోతోంది. అమ్మకి కూడా దెబ్బలు తగిలాయి, స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న ఓ అంకుల్ నన్ను తన చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు, నా తల నుంచి రక్తం  కారిపోతూ ఉంది. ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరాము, డాక్టర్లు నన్ను చూసారు. నేను చనిపోయానట .  అక్కడ నుంచి నన్ను గాంధీ ఆసుపత్రి మార్చురీకి  తీసుకెళ్ళిపోయారు. ఇంకొక్క అయిదు నిమిషాలు ఉంటే రోల్ నంబర్ 28 అంటే హాజరు పలకాల్సిన నేను మార్చురీ లో 28 నంబర్ బాక్సులో శవంగా మిగిలాను అంకుల్.

కేటీఆర్ అంకుల్ భూమిక

ఇవాంకా వస్తోందని చాలా చోట్ల రోడ్లు బాగు చేసారట. మా కాలనీకి కూడా ఇవాంకా వచ్చి ఉంటె నేను బ్రతికేదాన్ని కదా అంకుల్. ప్రభుత్వాన్ని మేమేమైనా  వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా అంకుల్. గుంతలు లేని రోడ్లే కదా అడుగుతున్నాం. ఎన్ని నెలల నుంచి ఈ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుసా అంకుల్. మీరు,  కెసిఆర్ తాతయ్య  రోడ్లు బాగుచేయమని అధికారులకి చెప్పారని చాలా సార్లు పత్రికల్లో వచ్చింది. అయినా రోడ్లు బాగు కాలేదు.

ఈ ఆఫీసర్లకి, కాంట్రాక్టర్లకి, నాయకులకి  కూడా పిల్లలు ఉంటారు కదా. రేపు వాళ్ళ పరిస్థితి అయినా ఇంతే కదా. ఎందుకు ఇంత చిన్న విషయం అర్థం కాదు. నన్ను లారీ తో గుద్దిన డ్రైవర్ అంకుల్ కి శిక్ష పడుతుంది, కానీ ఇంత నిర్లక్ష్యంగా రోడ్లు వేసిన అధికారులకి, కాంట్రాక్టర్ లకి మాత్రం శిక్ష పడదు.  మాబోటి సామాన్యుల ప్రాణాలు అంటే అంత లోకువా అంకుల్. నేనే కాదు అంకుల్ ఇంకెంతో మంది నా లాగా యాక్సిడెంట్ లలో చనిపోయినవారి శవాలు ఇక్కడ మార్చురీ లో కుప్పలుగా ఉన్నాయి. అంకుల్ నా చావుతో నైనా మన హైదరాబాద్ రోడ్లు బాగుపడాలి. మీరు చాలా సమర్థులు అని మీకు చాలా అవార్డులు వస్తున్నాయి. మీరు తలచుకుంటే  ఈ రోడ్లు బాగుపడతాయి. ఒక వారం, కేవలం రోడ్ల సమస్య మీదే మీరు పనిచేయండి. పని చేయని అధికారులని  పీకి పారెయ్యండి. కాంట్రాక్టర్లు తప్పు చేస్తే శిక్ష వేయండి. ఏమైనా చేయండి. రోడ్లు మాత్రం బాగు చేయండి అంకుల్. మా అక్క, అమ్మ, నా క్లాస్ మేట్స్, నా లాంటి మరెంతో మంది పిల్లలు, పెద్దల ప్రాణాలు, ఆరోగ్యం  కాపాడండి. చివరిగా, నా తోటి పిల్లలకి నా విజ్ఞప్తి, బండి నడిపేవారే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. కేటిఆర్ అంకుల్, మీరు మాత్రం మరో ప్రాణం బలికాకముందే రోడ్లు బాగుచేయించండి.

ఇట్లు,

ఎప్పటికీ మిమ్మల్ని చూడలేని..

భూమిక.

Note: ఈ రోజు అంటే 19న ఉప్పల్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమిక, రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన  కల్పించేందుకు కృషి చేస్తున్న I am not an idiot సంస్థ వ్యవస్థాపకులు, లోక్ సత్తా పార్టీ నగర నాయకులు అయిన దోసపాటి రాము మేనకోడలు.

(Visited 6,264 times, 1 visits today)