Home / Inspiring Stories / ఒక్కడే…150 మంది చైనా సైనికులని మట్టుపెట్టాడు.

ఒక్కడే…150 మంది చైనా సైనికులని మట్టుపెట్టాడు.

Author:

అది 1962 నవంబర్, ఇండియా, చైనా దేశాల మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తవాంగ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సైన్యం పావులు కదుపుతుంది, మన దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన తవాంగ్ ప్రాంతం రక్షణ బాధ్యతలను భారత సైన్యానికి చెందిన గఢ్వాల్‌ రైఫిల్స్‌ విభాగం నిర్వహిస్తోంది. పక్క ప్రణాళికతో ఆక్రమణకు వస్తున్న చైనా సైనికులని నిలువరించడం భారత సైనికులకు కష్టతరంగా మారుతోంది. భారత సైనికులు వీరోచితంగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పై అధికారుల నుండి వెనక్కు మళ్లాలని ఆదేశాలు అందాయి. కానీ రైఫిల్‌మాన్‌ జశ్వంత్‌సింగ్‌ రావత్ అనే 21 ఏళ్ళ సైనికుడు మాత్రం తన స్థానం నుంచి కదల్లేదు. చైనీయులపై తుపాకి గుళ్ల వర్షం కురిపించాడు. దాదాపు మూడు రోజుల పాటు వారిని నిలువరించి 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు.

జశ్వంత్‌సింగ్‌ - Jashvanth-Singh-Rawath

మిగతా సైనికులు వెనక్కి వెళ్ళిపోయినా 21 ఏళ్ళ జశ్వంత్‌సింగ్‌ మాత్రం అక్కడే ఉండి ఇద్దరు స్థానిక బాలికల సహాయంతో చైనా సైనికులకి దడ పుట్టించాడు, జశ్వంత్‌సింగ్‌ సూచనతో సెల, నురా అనే బాలికలు చైనా సైనికులకి కనిపించే విధంగా దాదాపు 300 రైఫిళ్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో చైనా సైన్యాలకు అక్కడ వందలాది మంది భారత సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఫలితంగా ముందుకు వచ్చేందుకు సిద్ధపడ లేదు, మూడు రోజులైనా చైనా సైనికులకి మన దేశ సైనికుల వ్యూహం ఏంటో అర్థంకాక దిక్కుతోచలేదు, ఇదే సమయంలో జశ్వంత్‌సింగ్‌కు ఆహారాన్ని అందిస్తున్న ఒక గ్రామస్థుడిని చైనా సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చిత్రహింసలు పెట్టడంతో నిజం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన చైనా సైన్యం జశ్వంత్‌ శిబిరంపై దాడి జరిపింది. ఆ సమయంలోనూ అధైర్యపడని జశ్వంత్‌ చివరి నిమిషం వరకు వీరోచితంగా పోరాడి దాదాపు 150 మంది చైనా సైనికులని మట్టుపెట్టాడు, తూటాలు ఖాళీ అవడంతో చివరి తూటాతో ఆత్మాహుతి చేసుకొని వీరమరణం పొందాడు, అనంతరం ఆ ఇద్దరు బాలికలను చైనా సైన్యం చంపివేసింది. తమను మూడు రోజులుగా ముప్పుతిప్పలు పెట్టిన జశ్వంత్‌సింగ్‌పై శత్రువులకు ఆగ్రహం తగ్గలేదు. ఆయన తలను తమతో పాటు తీసుకెళ్లారు. కొన్ని రోజుల తరువాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జశ్వంత్‌సింగ్‌ తలను తిరిగి అప్పగించారు. ఆయన అనుపమాన ధైర్యసాహసాలను శత్రు సైన్యం కూడా ప్రశంసించడం గమనార్హం. ఆయన సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ప్రకటించింది.

తవాంగ్‌ స్థానికులు ఇప్పటికీ జశ్వంత్‌సింగ్‌ ను బాబా జశ్వంత్‌గా ఆరాధిస్తారు. ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతం మీదుగా తమ విధులకు వెళ్లే భారతీయ సైనికులు ఆ మందిరంలో పూజలు చేస్తారు. ఆయన జీవించి వున్నట్టే స్థానికులు భావించి ఇప్పటికీ ఆయన బూట్లను శుభ్రం చేస్తారు.

ప్రస్తుతం చైనా, ఇండియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడంతో, 1962 లో చైనాపై ఒక సైనికుడు చేసిన వీరోచిత పోరాటాన్ని కొంతమంది సామాజికమాధ్యమాల్లో గుర్తుచేసుకుంటున్నారు.

Also Read: పాక్ లో ‘అండర్ కవర్ కాప్’…దేశభద్రత వ్యూహాల్లో ఎప్పటికీ టాప్ !

(Visited 3,636 times, 1 visits today)