Home / Political / Video: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు.

Video: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు.

Author:

ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వకుండా రాద్ధాంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటివరకు పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ తీరుని పూర్తిగా తప్పుపట్టాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా సీమాంధ్ర ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది చాలా ఆవేశంగా మాట్లాడాడు, స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు పోరాటం చేస్తానని చెప్పాడు.

Pawan-kalyan-speech

తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అయన మాటల్లోనే:

విల్లునుంచి వదిలిన బాణం.. నోటినుంచి వచ్చిన మాటా వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏమి మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించే మాట్లాడతాను.

ఒక దేశం అంటే నదులు పర్వతాలు ఖనిజాలే కాదు.. కలల ఖనిజాలతో చేసిన ఈ యువత. మన దేశ భవితకు యువకులే నావికులు అన్న గుంటూరు శర్మ గారి మాటలను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

జనసేన పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు కావొస్తుంది. రాజకీయాల మీద పదవుల మీద వ్యామోహం లేదు.. మీరిచ్చే ప్రేమ చాలు. మరి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను… కోట్లు సంపాదిస్తాను కోట్లు రూపాయలు టాక్సులు కడతాను.. ఇప్పుడు నేను హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. నాకు సినిమాలపై వ్యామోహం లేదు… కానీ సమాజం మీద దేశం మీద వ్యధ ఉంది. ప్రజాసేవపై వ్యామోహం ఉంది.

దేనికంటే… వర్తమాన రాజకీయాలు – రాజకీయనాయకులు యువతకు మేలు చేయకపోతే నాకు చాలా బాద వస్తుంది. సినిమాలో 2 గంటల్లో చాలా చెప్పొచ్చు. ఆస్తులు త్యాగం చెయ్యొచ్చు విలన్లను కొట్టొచ్చు హీరోయిన్లతో పాటలు పాడొచ్చు (నవ్వుతూ).. అలాగే సినిమాల్లో ఏదైనా చేసి చూపించొచ్చు కానీ నిజజీవితంలో మన అసలైన సమస్యలకు రాం దేవ్ బాబా న్యూడిల్స్ లాగా రెండు నిమిషాల్లో పరిష్కారాలు దొరకవు.

నేను ఈరోజు మూడు విషయాలు మాట్లాడటానికి వచ్చాను.

ఒకటి జనసేన ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలు.

రెండోది తెలుగుదేశం ప్రభుత్వం పనితీరుపై నా అభిప్రాయం చెప్పడానికి.

అన్నింటికంటే ముఖ్యమైనది.. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వకుండా నాంచుతున్న కేంద్ర ప్రభుత్వం విషయంలో మాట్లాడి తేల్చుకోవలసినవి చాలా ఉన్నాయి.

నాడు చంద్రబాబు కానీ మోడీ కానీ నేను కానీ ముగ్గురం కలిసి మొట్టమొదటి సభ తిరుపతిలోనే పెట్టాము.. అందుకే ఈ సభ ఇప్పుడు కూడా తిరుపతిలోనే పెట్టాను!

తనపై వచ్చిన విమర్శలు తన అభిమాన నాయకులపై స్పందించిన పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే అన్నింటినీ మౌనంగా ఉండి పరిశీలిస్తుంటాను. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తుంటాను. నేను నోటికొచ్చిన విమర్శలు చేసే వ్యక్తిని కాదు.. ఒక కనస్ట్రక్టివ్ గా విమర్శలు చేస్తాను.

నేను ఇలా మౌనంగా ఉన్నప్పుడు చాలా మంది ఇపవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది.. మోడీ భజనచేయడానికి వాడి “మోడీ భజనసేన” చేశాడని కొతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది తెలుగుదేశం తొత్తులా ఉన్నానై తిట్టారు. మరికొంతమందైతే నువ్వు గబ్బర్ సింగ్ కాదు.. రబ్బర్ సింగ్ అని కూడా అన్నారు.

పడతాం మాటలు.. పడకుండా ఉంటామా ఏంటి? పడకుండా ఉండటానికా రాజకీయాల్లోకి వచ్చాం… తిట్టండి తిట్టండి అయినా కూడా నేను ప్రజలకు చేయాల్సింది యువతకు చేయాల్సింది.. మన రాష్ట్రానికి చేయాల్సింది చేసే తీరుతాను చేసే వెళ్తాను.. నేను ఎక్కడికీ పారిపోను.

నా జీవితంలో పాతిక సంవత్సరాలు దేశం కోసం రాష్ట్రంకోసం పోరాడతాను. ఒక్కసారి మాటైచ్చానంటే మాట తప్పే మనిషిని కాదు మడమ తిప్పే వ్యక్తినీ కాదు.

నేను.. భజన సేనా భజన సేనా అని అంటారు. కరక్టే… కాని ఎవరికి? నేను మీకు భజనసేన తెలుగు రాష్ట్రానికి భజనసేన ప్రజాసమస్యలపై భజనసేన. నేను మోడీగారికి భజన చేయను అది అర్ధం చేసుకోండి.

ఈ విషయంలో సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. దానికి మరుసటిరోజే ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయలేక కాదు.. వామపక్ష పార్టీలు వారిపోరాటాలు అంటే నాకు గౌరవం. నేను నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు మా నాన్న చదువుతూ నాకిచ్చిన పుస్తకం కారెండ్ తడిమొల్లు రాసిన తాకట్టులో భారతదేశం నాకిచ్చారు.. నేను ఆ పుస్తకాన్ని చదివాను. అలాగే నాకు చేగువేరా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే… తన దేశం కాదు తన సమస్య కాదు కానీ కొంతమంది బాదపడుతున్నారు అని వాళ్లకోసం పోరాటం చేసిన వ్యక్తి.

సమస్య మనకుటుంబానిదే అవ్వనవసరం లేదు మన ప్రాంతానిదే అవ్వనవసరం లేదు.. మన రాష్ట్రానిదే అవ్వనవసరం లేదు.. మానవత్వం బాదపడుతున్నప్పుడు మానవత్వం గురించి నిలబడేవారే నిజమైన హీరోలు.

అభిమానులకు పవన్ చేసిన సూచనలు ఆయన మాటల్లోనే…

నేను తెలుగుదేశం పక్షపాతినో తెలుగుదేశం తొత్తునో అనుకుంటే పొరపాటు. నేను ప్రజల పక్షపాతిని ప్రజల తొత్తుని. రైతు తొత్తుని ఆడబిడ్డల పక్షపాతిని అక్కచెల్లెల్ల పక్షపాతిని.. అంతే కానీ ఏ ఒక్క పార్టీకో ఏఒక్క వ్యక్తికో నా జీవితాన్ని ఇవ్వను.

ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నా సినిమాలు నాకు ఆనందాన్ని కలిగించలేదు. అవి మీ ఆనందంకోసమే చేస్తాను తప్ప నా ఆనందంకోసం కాదు.

సినిమాని ఒక వినోదంగానే చూడండి… వేరే హీరోలతో నాకు గొడవలు ఉండవు. మేమంతా బాగానే ఉంటాం. మీరు సినిమాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే నేనే వాటిని సీరియస్ గా తీసుకోను. సినిమాని రెండు గంటలపాటు చూసి అనంతరం లైట్ తీసుకోండి. సినిమాలో నేనే కాని – నా తోటి హీరోలే కాని ఏమిచేసినా దానికీ నిజజీవితానికి ఏమీ సంబందం ఉండదు అన్న మాట గుర్తుపెట్టుకోండి. దానికోసం క్షణికమైన కోపాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

వినోద్ రాయల్ అనే అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాదకలిగింది. క్షణికావేశంలోనో మరో కారణంతోనో జరిగిన ఒక హత్య.. ఒక తల్లికి కడుపుకోతను మిగిల్చింది. ఆ సంఘటన నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.

నా వెనకాల బైక్స్ పై మీరంతా వస్తుంటారు.. ఆసమయంలో మీరంతా క్షేమంగా వచ్చి – క్షేమంగా వెళ్లాలని కోరుకునేవాడిని నేను.

నాకు వినోద్ రాయల్ తల్లి ఎంత గౌరవం ఇచ్చిందంటే.. అమ్మా నేను రాత్రి బోజనానికి వస్తాను అని చెప్పిన బిడ్డ అవయువదానానికై సంతకం చేయడానికి వెళ్లిన బిడ్డ.. హత్యకు గురయ్యాడని – హాస్పటల్ ఉన్నాడని తెలిసినప్పుడు ఆ తల్లికి బిడ్డ శవాన్ని చూసి ఎంతో ఆవేదన చెందినా కూడా .. ఆ పరిస్థితుల్లో కూడా తన బిడ్డ కళ్లను దానం చేసింది. అంత గొప్ప తల్లి ఆమె.. తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నాపాధాబివందనాలు. అలాంటి తల్లుల బిడ్డలకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను.

కుల ప్రస్థావనలపై పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

నేను టీడీపీకి – బీజేపీకి కూడా ఎంతోకొంత సాయం చేశాను. దాని పర్సంటేజ్ ఎంత అనే విషయం పక్కనపెడితే.. వారి గెలుపులో మనది ఎంతో కొంత పర్సంటేజ్ ఉంది.

నాడు ప్రధాని అభ్యర్థిగా మోడీ ప్రకటన జరిగినప్పుడు మోడీని కలిసి వారికి నా మద్దతు ప్రకటిస్తే.. నాడు నన్ను నా అభిమానులైన మిమ్మల్ని జనసేన కార్యకర్తలనీ తెగ పొగిడేశాయి ప్రముఖ దినపత్రికలు.

అయితే… నేను మద్దతిచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ఒకటి రెండు తప్పులు దొర్లినప్పుడు పొరపాట్లు జరిగినప్పుడు ప్రజలతరుపున ప్రశ్నిస్తే.. ఆ పత్రికలు తమ ఎడిటోరియల్ పేజీల్లో కులప్రస్థావన తీసుకొచ్చి ఏవేవో రాయడం మొదలుపెట్టాయి.

ఇక్కడ ఉన్న మీరంతా.. ఏ కులమో – ఏ మతమో నాకు తెలియదు. అసలు నాకు కులమే లేదు.. నాకు కులమేమిటబ్బా. నాకూతురు క్రీస్టియన్ – ఆమె తల్లి క్రీస్టియన్. ఆమె నా కూతురికి బాప్తీసమిస్తాను అంటే నేను సరే అన్నాను. ఎందుకంటే.. నాకు దేవుడు ఏరూపంలో ఉన్నా ఇష్టమే. ఆమె క్రీస్టియన్ ఫ్యామిలీలో పుట్టింది నేను హిందూ ఫ్యామిలీలో పుట్టాను.

అయితే నాకు కులం మరక అంటిస్తే మాత్రం అరికాలు నుండి నడినెత్తివరకూ కాలుతుంది. అప్పుడు నేను నేనుగా ఉండలేను.

అయితే నాకు కులాన్ని జోడిస్తూ నా వెనకనున్నవారంతా ఒక సామాజిక వర్గం వారేనంటూ ఎడిటోరియల్స్ రాసిన వారికి చెప్పాను. సర్ నేను టీడీపీకి భుజం కాసినప్పుడు మీకు నా కులం గుర్తుకురాలేదు అలాంటిది ఒకటి రెండు ప్రశ్నలు ప్రభుత్వంపై సందించేసరికి నా కులం గుర్తొచ్చేసిందా. అలా ఎలా రాస్తారు సర్ అని అడిగాను. తర్వాత వారు రిపీట్ చేయలేదనుకోండి.

జనసేన ఎందుకు పుట్టింది – జనసేన అజెండాలు పవన్ మాటల్లో…

మోడీ ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచీ నేను మోడీకి మళ్లీ కలవలేదు. అనంతరం హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేత ఒకరు నా దగ్గరకొచ్చి… జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉంది తప్ప ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకి వచ్చి జాయిన్ అవ్వమని కోరారు.

నేను ఏమి సమాధానం చెప్పి ఉంటానో మీరు చెప్పగలరా? సర్.. నాకు బీజేపీ అంటే గౌరవం ఉంది కానీ ఇది తెలుగు ప్రజలకోసం పుట్టిన పార్టీ ప్రాంతీయ పార్టీ అయ్యి ఉండొచ్చు గాక.. కానీ జాతీయ భావాలున్న పార్టీ ఇది. జాతీ సమగ్రతకు కృషిచేసే పార్టీ ఇది. అని చెప్పి థాంక్స్ చెప్పి లైట్ తీసుకున్నాను.

నాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలంటే గౌరవం ఉంది కానీ.. దానిలో మొత్తం సిద్ధాంతాలపై నేను ఏకీభవించి పూర్తిగా పార్టీలోకి వచ్చేయలేనని చెప్పాను.

జనసేన పార్టీ పెట్టింది ఎవరి జెండాలు ఎజెండాలు మోయడానికి కాదు. వ్యక్తి ఎజెండాలు మోయడానికి జనసేన పుట్టలేదు. ఇది ప్రజల ఎజెండాలు మోయడానికి వారికి భుజం కాయడానికి పుట్టిన పార్టీ.

నాడు “మేడం మేడం”.. నేడు “సార్ సార్”: ఎంపీలకు చురకలు.. పవన్ మాటల్లోనే

రాష్ట్రం విడిపోయింది – కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. లేడికి లేచిందే పరుగన్నట్లు… ప్రత్యేక హోదాపై మోడీని ఏమి అడుతుతాం. అండుకే ఇంతకాలం ఎదురుచూశాను.

అయితే రెండున్నరేళ్లు ఎదురుచూశాను. ఇప్పుడు ప్రత్యేక హోదాపైనే మాట్లాడతాను. తర్వాత సభల్లో మిగిలిన విషయాలు మాట్లాడతాను.

సీమాంధ్రులంటే ఎందుకంత చులకనబ్బా.. ఏ కేంద్ర ప్రభుత్వాలైనా మనతోనే ఇలా ఆడుకుంటాయి. మనకు పౌరుషం లేదని అనుకుంటున్నారు. మనకు పౌరుషం ఉంది దానితోపాటు దేశభక్తి కూడా ఉంది. కాంగ్రెస్ – బీజేపీలు సీమాంధ్రుల ప్రేమ చూశారు – సహనం చూశారు.. ఇచ్చిన మాట తప్పితే సీమాంధ్రుల  పౌరుషం చూస్తారు వారి ఆత్మాభిమానం దెబ్బతీస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో దేశం మొత్తం చూస్తారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏమాత్రం పద్దతి పాడు లేకుండా విడగొట్టారు. ఇంతమంది యువత ఉన్నారు.. అలాంటి యువతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో మీ చావు మీరు చావండి అని నిర్దాక్షినీయంగా విడగొట్టారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు.

ఆ విషయం తెలిసి కూడా బీజేపీకి ఎందుకు మద్దతు పలికావు అని మీరనొచ్చు.. మరి ఎవరికి చెప్పుకోవాలి. ఉన్నవి రెండే రెండుపార్టీలు. కాంగ్రెస్ దెబ్బ కొడితే బీజేపీకే కదా చెప్పుకోవాలి.

నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు – ఎంపీలకు ముఖ్యమంత్రులకు – ఇప్పుడున్న టీడీపీ మంత్రులకు ఎమంల్యేలకూ పెద్ద తేడా లేదు. వారంతా అప్పుడు “మేడం.. మేడం” అనే వారు.. ఇప్పుడున్న టీడీపీ – బీజేపీ నేతలు “సర్ సర్” అంటున్నారు. అంతే తేడా కనిపిస్తుంది.

ప్రత్యేక హోదాపై జనసేన పోరాటం.. పవన్ మాటల్లోనే…

ఈరోజు జనసేన పార్టీ తరుపున ప్రత్యేక హోదా డిమాండ్ కేంద్రానికి వినిపించేలా చెప్పడానికి పోరాడటానికి నేను నిర్ణయించుకున్నాను. ఇది మూడుదశల్లో జరుగుతుంది…

మొదటిదశలో ముందుగా అన్ని జిల్లాలకు తిరుగుతాను – స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి ఎవరెవరి నమ్మక ద్రోహాలు ఉన్నాయో అందరికీ చెప్తాను. ఎప్పుడు ప్రశ్నిస్తావు ఎప్పుడు ప్రశ్నిస్తావు అని అంటున్నారు.. ఇప్పుడు ప్రశ్నిస్తాను.

చేతగాకో – పౌరుషం లేకో కాదు.. ఎప్పుడు ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఆచి తూచి మాట్లాడాని ఆచరణలో పెట్టగలమంటేనే మాట్లాడతాను.

రెండోదశలో ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడదీయాలని సభపెట్టిందో అదే కాకినాడలో సభ పెడతాను. అప్పటికి కూడా కేంద్రప్రభుత్వంలో కదలిక రాకపోతే… ఆ సభతో రాష్ట్రంలో ఉన్న అధికార – ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కొన్ని సూచనలు చేస్తాను.

అప్పటికీ మనకు ప్రత్యేక హోదా రాకపోతే మీ అనుమతితో మీ సహకారంతో రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో నిర్ణయిద్దాం.

టీడీపీకి సూచనలు.. బీజేపీకి చురకలు: పవన్ మాటల్లోనే..

మోడీ యువతకు ఎన్నో పథకాలుపెడుతున్నారు.. అలాంటప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయి యువతకు ఉద్యోగాలు ఎక్కడనుండి వస్తాయి స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి.. మోడీ గ్రహించాలి.

రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటికి రాజధాని లేకుండా చేశారు. అది ఎప్పటికి అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ విషయాలపై మోడీని వ్యక్తిగతంగా కలవను.. ప్రజలతో కలిసే పోరాడతాను.

ఇక టీడీపీకి కొన్ని సూచనలు చేస్తున్నాను… వీటిని విమర్శలుగా భావించొద్దు.

ముఖ్యమంత్రిగారు స్పెషల్ స్టేటస్ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవంతో ఆటాడుకుంటుంటే మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు.

ఐదేళ్లు కాదు – పదేళ్లు కాదు – పదిహేను ఏళ్లు స్పెషల్ స్టేటస్ ఉండాలని చెప్పిన వెంకయ్య నాయకుడు గారు ఇప్పుడు “ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు” అని చెప్పడం తప్పు. వెంకయ్య నాయుడు గారూ మీరు తప్పు చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలకంటే.. వ్యక్తి ప్రయోజనాలకంటే.. జాతి ప్రయోజనాలు ముఖ్యం. అర్ధం చేసుకోండి.

గోవుల గురించి – గోవుల సంరక్షణ గురించి ఆలోచిస్తున్నారు.. మంచిదే! నా దగ్గరకూడా 15ఆవులున్నాయి. ముందు ముఖ్యమైన విషయాలైన ప్రత్యేక హోదా – తెలంగాణ ప్రత్యేక హైకోర్టులపై స్పందించండి.

గోసంరక్షనే బీజేపీకి ముఖ్యమైతే.. ప్రతీ బీజేపీ కార్యకర్తలను ఒక్కో ఆవుని పెంచమనండి చాలు.. గోసంరక్షణ దానికదే జరుగుతుంది.

పేరుపేరునా ఎంపీలపై ఫైర్: పవన్ మాటల్లోనే..

ఇక ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీలతోపాటు ప్రతిపక్ష వైకాపాలు కలిసి ఒకటే మాట మాట్లాడండి. వైకాపా నాయకులే కాని – టీడీపీ నాయకులే కాని కలిసి పోరాడదామంటే నేను వచ్చి కలుస్తాను. నాకెలాంటి బేషజాలు లేవు.

నాడు ఎవరు ఒప్పుకున్నారని రాష్ట్రాన్ని విడగొట్టారు – ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు అడ్డుతగులుతున్నారని ప్రత్యేక హోదా ఇవ్వడంలేదెందుకు.

మీలో దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? కేంద్రం సీబీఐని ప్రయోగిస్తున్నారని ముఖ్యమంత్రి బయపడుతున్నారా? పోరాడండి.. అడగండి! పార్లమెంటును స్థంభింపచేయండి. ఎందుకు భయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందిపెట్టి ఈ రోజున ఈ పరిస్థితులను కల్పించినందుకు జైరాం రమేష్ కి ఒకసారి చప్పట్లు కొట్టండి. థాంక్స్ జైరాం రమేష్ గారు.

అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకు సిగ్గులేదా – లజ్జ లేదా.. మేడం మేడం అంటూ సోనియా గాంధీ ముందు అలా బిచ్చమెత్తుకుంటున్నట్లు అడుగుతారెందుకు. ఇప్పుడు టీడీపీ – బీజేపీ ఎంపీలు కూడా.. జాతీయ నాయకులను జాతీయ పార్టీలను గౌరవించండి కానీ బానిసత్వంతో మోకాళ్లకు నమస్కారం చేయకండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దయచేసి ఢిల్లీ వీదుల్లో తాకట్టు పెట్టకండి.

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రత్యేక హోదాకు అడ్డుతగులుతున్నారు అని అంటున్నారు అశొక్ గజపతిరాజు గారు. అలా ఎలా మాట్లాడుతున్నారు అశోక్ గజపతి రాజు గారు. మీకు పౌరుషం ఉంటే.. రాజీనామా చేసి వచ్చేయండి. మీరు ఎందుకు రారు.. తుమ్మితే ఊడిపోయే పదవిని పట్టుకుని ఎందుకుసార్ వేళాడతారు.

మన ఎంపీలకు కమ్యునికేషన్ స్కిల్స్ లేవు – హిందీ రావడంలేదు.. కాస్త హిందీ నేర్చుకుని హిందీలో ప్రత్యేక హోదా కావాలని అడగండి.

కేశినేని నాని – మురళీ మోహన్ – అవంతి శ్రీనివాస్ – మంత్రి నారాయణలను చూసి మనమంతా డబ్బులున్న వాళ్లని మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదేమో.. వారిని కాదు – ప్రజలను చూసి అయినా ప్రత్యేక హోదా ఇవ్వండి.

ఫైనల్ టచ్.. పోరాడదాం.. పోరాడదాం..

ఇకమీదట కూడా సినిమాలు చేస్తాను.. ఎందుకంటే నాకు డబ్బులు లేవబ్బా. సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే బూతుపదం అనుకునే రాజకీయాలు కాదు.. ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేస్తాను. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు. సెప్టెంబరు 9న కాకినాడలో ఈ పోరాటానికి సంబందించిన మొదటి సభ పెడతాను.

దేశంలో భౌతికంగా కింద ఉండటం వల్లో ఏమో కానీ కేంద్రంలో ఉన్న మీకు మేము కనిపించడంలేదేమో.. ఇకపై సీమాంధ్ర ప్రాంతం తన ఫైర్ ను తన ఆవేదనను కేంద్రంలోని బీజేపీకి వినిపించేలా – కనిపించేలా జనసేన చేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ మాట నేను చెబుతున్నాను.

చివరిగా పోరాడదాం… సాధించేవరకూ పోరాడదాం.. గెలిచేవరకూ పోరాడదాం.. మన ప్రత్యేక హోదా హక్కుని సాధించే వరకూ పోరాడదాం..

 

 

 

 

(Visited 105 times, 1 visits today)